టాటా ఆస్పత్రికి టిటిడి రూ.1000 కోట్లు భూమి! – ఆపై రూ.40 కోట్ల నజరానా!!

తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) టాటా క్యాన్సర్‌ ఆస్పత్రికి అలిపిరి సమీపంలో 25 ఎకరాల భూమి కేటాయించడాన్ని టిటిడి ఉద్యోగులు తీవ్రంగా తప్పబడుతున్నారు. తమకు ఇళ్ల స్థలాల కోసం జాగా ఇవ్వమంటే ఎన్నో సాకులు చెబుతున్న టిటిడి టాటా ఆస్పత్రికి 25 ఎకరాల స్థలం ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. వాస్తవంగా ఇది ఇప్పుడు జరిగిన కేటాయింపు కాదు. 2017 మేలోనే టాటా ఆస్పత్రికి స్థలం ఇవ్వాలని టిటిడి నిర్ణయించింది. ఈ స్థలం విలువ దాదాపు రూ.1000 కోట్లు ఉంటుంది. దీన్ని అప్పట్లోనే విమర్శలు తలెత్తాయి. మరోవైపు ఈ ప్రైవేట్‌ ఆస్పత్రికి రూ.40 కోట్లు శ్రీవారి నిధురలు ఇవ్వడానికి కూడా టిటిడి అంగీకరించింది.

ఇంతకీ ఏమి జరిగింది?
దేశంలోనే వ్యాపార సంస్థగా పేరుగాంచిన టాటా కంపెనీ…టాటా మెడికల్‌ ట్రస్టును నిర్వహిస్తోంది. ఈ ట్రస్టు ఆధ్వర్యంలోనే కోల్‌కతా, ముంబైలో క్యాన్సర్‌ ఆస్పత్రులు నిర్వహిస్తున్నారు. తిరుపతిలో క్యాన్సర్‌ ఆస్పత్రి నిర్మాణం కోసం టాటా కంపెనీ ముందుకొచ్చింది. ఆ సంస్థ సొంతంగా భూములు కొనుక్కుని, సొంత పెట్టుబడితో ఆస్పత్రి పెట్టుకుని ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరంలేదు. అయితే….టాటా కంపెనీ టిటిడి సహకారం ఆశించింది. సాంబశివరావు ఈవోగా ఉన్నప్పుడు చర్చలు జరపింది. తనకు 25 ఎకరాల భూమి ఇస్తే, రూ.140 కోట్ల పెట్టుబడితో క్యాన్సర్‌ ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని చెప్పింది. ఈ మేరకు టిటిడికి-టాటాట్రస్టుకు మధ్య ఒప్పందం కుదరింది. అలిపిరి వద్ద 25 ఎకరాల స్థలాన్ని లీజు ప్రాతిపదికన ఇచ్చేందుకు టిటిడి సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇదే సమయంలో రూ.40 కోట్ల నిధులు కూడా టాటా కంపెనీకి ఇవ్వడానికి టిటిడి అంగీకరించింది. ఇదే అప్పుడు విమర్శలకు దారితీస్తోంది.

రూ.40 కోట్లు ఇవ్వడం న్యాయమా?
అజ్ఞాత భక్తులు…టిటిడికి రూ.40 కోట్లు ఇచ్చి ఏదైనా మంచి కార్యక్రమం కోసం వినియోగించమని కోరారని, ఆ మొత్తాన్ని టాటా కాన్సర్‌ ఆస్పత్రి కోసం కేటాయిస్తున్నామని అప్పటి ఈవో సాంబశివరావు ప్రకటించారు. మొత్తం రూ.140 కోట్ల వ్యయం అయ్యే ఈ ప్రాజెక్టులో రూ.100 కోట్లు టాటా మెడికల్‌ ట్రస్టు భరిస్తుంది. మిగిలిన రూ.40 కోట్లను టిటిడి ఇచ్చింది. అయితే…ప్రైవేట్‌ ట్రస్టుకు ఇంత పెద్ద మొత్తంలో టిటిడి నిధులు ఎలా ఇస్తారని శ్రీవారి భక్తులు ప్రశ్నిస్తున్నారు. టాటా కంపెనీనే…రూ.40 కోట్లు ఇచ్చే దాతలను తీసుకొచ్చిందని చెబుతున్నారు. నేరుగా టాటా ట్రస్టుకు ఇవ్వకుండా….టిటిడికి ఇవ్వడం ద్వారా దేవుడికి ఇచ్చిన భావన కలుగుతుందని, అలాగే ఆదాయ పన్ను రాయితీ లభిస్తుందని, అందుకే రూ.33 కోట్లు ఒకరు, రూ.7 కోట్లు ఒకరు టిటిడికి ఇచ్చి, ఆపై తమ ట్రస్టుకు ఇచ్చేలా టాటా కంపెనీ కథ నడిపించిందని తెలుస్తోంది. అయితే…ఇది అక్రమమని, ఇలాంటి వ్యవహారాలకు టిటిడి అధికారులు ఎలా సహకరిస్తారని శ్రీవారి భక్తులు ప్రశ్నిస్తున్నారు. ‘ఒకసారి భక్తుడు విరాళం ఇచ్చిన తరువాత….అది పూర్తిగా టిటిడికి చెందుతుంది. మంచి సామాజిక కార్యక్రమాలకు వినియోగించమని భక్తులు కోరివుండవచ్చు. అలాంటి నిధులను ప్రాణదానం, బర్డ్‌ వంటి టిటిడి ఆధ్వర్యంలోని ఆస్పత్రులకు వినియోగించాలి తప్ప….ప్రైవేట్‌ సంస్థ అయిన టాటా ట్రస్టుకు ఎలా ఇస్తారు..? భవిష్యత్తులో ఇంకెవరో దాతలను తీసుకొచ్చి….టిటిడికి విరాళం ఇప్పించి, తిరిగి ఆ మొత్తాన్ని తమ సంస్థకో, ట్రస్టుకో తీసు కోడానికి ప్రయత్నిస్తే….టిటిడి అనుమతిస్తుందా…’ అని ప్రశ్నిస్తున్నారు. టిటిడి డబ్బులను ప్రైవేట్‌ ట్రస్టుకు ఇవ్వడానికి అవకాశముందా? ఇచ్చినా ఏ షరతులతో ఇవ్వవచ్చు, అసలు టాటా ట్రస్టుతో కుదర్చుకున్న ఒప్పందంలో ఏముంది…తదితర అంశాలను బహిర్గతపరచాలని శ్రీవారి భక్తులు కోరుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*