టాటా క్యాన్సర్‌ ఆస్పత్రిలో టిటిడి ఉద్యోగులకు ఉచిత చికిత్స లేదుగానీ…

తిరుపతిలో టాటా ట్రస్టు ఏర్పాటు చేస్తున్న క్యాన్సర్‌ ఆస్పత్రి కోసం తిరుమల తిరుపతి దేవనస్థానం రూ.1000 కోట్ల విలువైన 25 ఎకరాల విలువైన భూములను అతి తక్కువ లీజుతో ఇచ్చింది. ప్రపంచ స్థాయి వైద్య సదుపాయాలతో ఏర్పాటు కాబోతున్న ఈ ఆస్పత్రిలో తమకు ఉచిత వైద్యం అందించాలని టిటిడి ఉద్యోగులు కోరుతున్నారు. టిటిడికి అనుబంధంగా ఉన్న స్విమ్స్‌లో టిటిడి ఉద్యోగులకు నగదు రహిత చికిత్స అందుబాటులో ఉంది. ఇటువంటి సదుపాయమే టాటా ఆస్పత్రిలోనూ కల్పించాలన్న డిమాండ్‌ ఉద్యోగుల నుంచి ఉంది. అయితే…ఇందుకు అవకాశం లేదని టిటిడి ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ తేల్చేశారు.

టిటిడిలో 8 వేల మందికిపైగా రెగ్యులర్‌ ఉద్యోగులున్నారు. 14,500 మంది కాంట్రాక్టు కార్మికులున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు ఎటూ వైద్య సదుపాయం అందుబాటులో లేదు. కనీసం టిటిడి సెంట్రల్‌ హాస్పిటల్‌లోనూ వైద్యం అందించడం లేదు. కాంట్రాక్టు కార్మికుల సంగతి పక్కనపెడితే…రెగ్యులర్‌ ఉద్యోగులూ ఉచిత వైద్యం కోసం పోరాడుతున్నారు. స్విమ్స్‌ నుంచి సిఫార్సు వుంటే తప్ప బయట ఆస్పత్రుల్లో చికిత్స చేసుకోడానికి వీలులేదు. మెరుగైన వైద్యం కావాలన్నా బయట ఆస్పత్రులకు వెళ్లలేని పరిస్థితి. ప్రభుత్వ ఉద్యోగుల్లాగా ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనూ చికిత్స చేయించుకునే అవకాశం కల్పించాలని టిటిడి ఉద్యోగులు కోరుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి వేలూరు సిఎంసి, అపోలో, చెన్నై విజయ ఆస్పత్రి వంటి వాటితో ఒప్పందం కుదుర్చుకోడానికి టిటిడి చర్చలు మొదలుపెట్టింది. ఆ సంగతి అలావుంచితే…క్యాన్సర్‌ ఆస్పత్రిలో ఉచిత చికిత్స కల్పించాలని ఉద్యోగులు కోరుతున్నారు.

టిటిడి రూ.1000 కోట్ల విలువైన భూమి టాటా ఆస్పత్రికి ఇచ్చినందున సంస్థలో పనిచేసే ఉద్యోగులందరికీ ఉచిత వైద్యం కల్పించమని కోరడంలో తప్పులేదు. కానీ…ఈ విషయం టాటా ట్రస్టు – టిడిపి మధ్య కుదిరిన ఒప్పందంలో లేదు. ఉద్యోగులకు ఉచిత వైద్యం గురించి ఈవోను ధర్మచక్రం ప్రశ్నించగా….’టాటా ఆస్పత్రిలో 40 శాతం మందికి ఉచిత వైద్యం అందిస్తామని టాటా ట్రస్టు హామీ ఇచ్చింది. అదేవిధంగా ఆస్పత్రికి వచ్చిన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వైద్యం చేయకుండా తిప్పిపంపబోమన్న హామీని కూడా ఇచ్చింది. టిటిడి ఉద్యోగులు చికిత్స చేయించుకుంటే రీయింబర్స్‌మెంటు (వైద్య ఖర్చుల చెల్లింపు) ఇస్తున్నాం. ఉద్యోగులకు వైద్యం చేస్తే ఫీజు టిటిడి చెల్లించేలా టాటా ఆస్పత్రితో ఒప్పందం కుదుర్చుకుంటే సరిపోతుంది’ అని సింఘాల్‌ చెప్పారు.

ఈవో చెప్పిన దాన్నిబట్టి ఉద్యోగులకు టాటా ఆస్పత్రికి చేసే చికిత్సకు టిటిడి డబ్బులు చెల్లించాల్సివుంటుందన్నమాట. అయినా…రూ.వెయ్యి కోట్ల విలువైన భూములు టాటా ట్రస్టుకు ఇచ్చిన తరువాత తమ ఉద్యోగులకు ఉచిత వైద్యం అందించాలని కోరడంలో తప్పేముంది. ఫీజు రీయింబర్స్‌మెంటు ఒప్పందం కుదుర్చుకుంటే…ఉద్యోగులపై భారం ఉండకపోవచ్చుగానీ శ్రీవారిపైన భారం పడుతుంది కదా? తమ ఉద్యోగులకు ఉచిత వైద్యం అందించాలని టిటిడి అడిగివుంటే టాటా ట్రస్టు కాదనేదా? అసలు ఒప్పందం చేసుకునేటప్పడు ఇటువంటి ప్రయత్నం జరిగిందా? ఇవీ ప్రశ్నలు. ఇప్పటికైనా టిటిడి ఉద్యోగులకు ఉచిత వైద్యం అందించడానికి టాటా ట్రస్టుతో చర్చలు జరపాల్సిన అవసరం ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*