టిటిడికి కరోనా నేర్పుతున్న పాఠం..! భవిష్యత్తుకు గట్టి హెచ్చరిక..!

ప్రపంచ మానవాళికి కరోనాతో కొత్త విషయాలు బోధపడుతున్నాయి. అగ్రరాజ్యాలుగా రొమ్ము విరుచుకున్న అమెరికా వంటి దేశాలే ఆత్మరక్షణలో పడిపోయాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల ‌తిరుపతి దేవస్థానమూ ఇందుకు అతీతం కాదు. టిటిడికీ కరోనో కొత్త పాఠాలు నేర్పుతోంది. వేల కోట్ల ఆదాయాన్ని చూసుకుని నేల విడిచి సాము చేస్తున్న దేవస్థానానికి బలమైన హెచ్చరిక చేసింది కరోనా.

ఒకవైపు ఏడాదికేడాది డిపాజిట్లు తగ్గించడం, మరోవైపు ఖర్చులు అదుపు తప్పడం వల్ల ఎటువంటి ముప్పు‌ ముంచుకొస్తుందో కరోనా కాలంలో బాగా తెలిసివచ్చింది. యాభై రోజులు‌ దర్శనాలు‌ అపేయడంతో ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి వస్తోందని మీడియాలో కథనాలు వస్తున్నాయి. భవిష్యత్తులో ఆదాయం తగ్గిపోతే టిటిడి పరిస్థితి ఏమిటన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ముందుచూపు కొరవడటం వల్ల రానున్న రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు తప్పవన్న భయమూ వ్యక్తమవుతోంది. టిటిడి భవిష్యత్తు భద్రంగా ఉండాలంటే ఏం చేయాలి..!

2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.3,310 కోట్లతో టిటిడి బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ ఎడాదికేడాది పెరుగుతూనే ఉంది. ఏటా టిటిడి ఆదాయం పెరుగుతున్నా, అదుపు తప్పుతున్న ఖర్చులు, దుబారా వ్యయం వల్ల బ్యాంకులో డిపాజిట్‌ చేసే మొత్తం తగ్గిపోతోంది. ఇదే ఇప్పుడు అందరికీ ఆందోళన కలిగిస్తోంది. 

భారీగా తగ్గుతున్న డిపాజిట్లు….
సాధారణంగా హుండీ ద్వారా వచ్చే ఆదాయాన్ని క్యాపిటల్‌ ఆదాయంగా పరిగణిస్తారు. కానుకల ద్వారా వచ్చే ఈ ఆదాయాన్ని శాశ్వత పనులకు వినియోగించగా మిగిలిన దాన్ని డిపాజిట్‌ చేయాలి. ఈ డిపాజిట్లపై వచ్చే వడ్డీతో పాటు దర్శనాల టికెట్లు, ప్రసాదాల విక్రయాలు, తలనీలాల విక్రయాలు వంటి ద్వారా వచ్చే ఆదాయాన్ని రెవెన్యూ ఆదాయం అంటారు. రెవెన్యూ ఆదాయం నుంచే ఉద్యోగుల జీతభత్యాలు, మార్కెటింగ్‌ సరుకుల కొనుగోలు, విద్యుత్‌ ఛార్జీలు వంటివాటి కోసం ఖర్చు చేయాలి. డిపాజిట్లు ఎంత ఎక్కువగా ఉంటే వడ్డీ అంత ఎక్కువగా వస్తుంది. భవిష్యత్తులో హుండీ ఆదాయం తగ్గినా…వడ్డీ రావడం వల్ల ఆలయ నిర్వహణకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అయితే డిపాజిట్‌ చేసే మొత్తమే తగ్గిపోతోంది.

2020-21లో రూ.105 కోట్లు డిపాజిట్ చేయాలని నిర్ణయించారు. 2019-20లో 165 కోట్లు డిపాజిట్ చేశారు. 2018-19 సంవత్సరంలో రూ.200 కోట్లు కార్పస్‌ ఫండ్‌ కింద డిపాజిట్‌ చేయాలని నిర్ణయించుకుంటే ఆచరణలో రూ.86 కోట్ల మాత్రమే డిపాజిట్‌ చేయగలిగారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని 2019-20లో కార్పస్‌ఫండ్‌ డిపాజిట్‌ లక్ష్యాలను రూ.78.85 కోట్లకు తగ్గించుకున్నారు. అయితే ఆచరణలో రూ.165 కోట్లు అయింది. అయినా తక్కువనే చెప్పాలి. ఎందుకంటే… 2016-17లో రూ.475 కోట్లు, 2015-16లో రూ.783 కోట్లు, 2014-15లో రూ.969 కోట్లు డిపాజిట్‌ చేశారు. ఈ లెక్కన ఇప్పుడు ఎంత డిపాజిట్ ‌చేయాలో లెక్కేసుకోవచ్చు. 

డిపాజిట్లు చేయడం అంటే భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని వచ్చే ఆదాయంలో కొంత పొదుపు చేయడమే. ఆదాయం తగ్గినపుడు పొదుపూ తగ్గుతుంది. టిటిడి విషయంలో ఆదాయం తగ్గడం లేదు. పెరుగుతోంది. అయినా డిపాజిట్లు భారీగా తగ్గాయి. హుండీ ద్వారా వచ్చే కానుకలను పరిశీలిస్తే….2014-15లో రూ.993 కోట్లు, 2015-16లో రూ.1000 కోట్లు, 2016-17లో రూ.1010 కోట్లు వచ్చాయి. 2017-18లో 1,116 కోట్లు, 2019-20లో 1,310 కోట్లు వచ్చాయి. అంటే హుండీ ద్వారా వస్తున్న ఆదాయం పెరుగుతూనే ఉంది. 2014-15లో రూ.993 కోట్లు వచ్చినపుడే…. రూ.969 కోట్లు డిపాజిట్‌ చేశారు. అలాంటిది రూ.1,310 కోట్ల ఆదాయం వచ్చినపుడు డిపాజిట్లు పడిపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇది ప్రమాద సంకేతంగా భావించాలి. ప్రతి సంవత్సరం నిర్ణీత శాతం కార్పస్ లో డిపాజిట్ చేయాలన్న ఓ తీర్మానాన్ని టిటిడి చేయాల్సిన అవసరం కనిపిస్తోంది.

ప్రస్తుతం టిటిడికి 14000 కోట్ల నగదు డిపాజిట్లు ఉన్నాయి. హుండీ ద్వారా వచ్చే కానుకలు మొత్తం డిపాజిట్ చేయాలన్న నియమం పెట్టుకుంటే….కార్పస్ భారీగా పెరిగేది. ఆ డిపాజిట్ల ద్వారా వచ్చే వడ్డీతోనే టిటిడి నిర్వహణ సాగిపోయేంతగా కార్పస్ పెంచుకుంటే….కరోనా వంటి సంక్షోభాలు వచ్చినా భయం ఉండదు. కానీ…డిపాజిట్ చేయడం కంటే…ఎప్పటి నిధులు అప్పుడు ఖర్చు చేస్తున్నారు. తలకు మించిన ఖర్చులు పెట్టుకుంటున్నారు. కొత్త ఆలయాల నిర్మాణం, ఆలయాలను ఇష్టానుసారం టిటిడి పరిధిలోకి తీసుకోవడం, కల్యాణ మండపాలు వంటి నిర్మాణాలు చేపట్టడం, టిటిడికి సంబంధం లేని కొన్ని‌ పనులనూ నెత్తికెత్తుకోవడం తదితర కారణాల వల్ల ఖర్చులు అదుపు తప్పుతున్నాయి.

కరోనాతో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని…టిటిడి ప్రస్తుతం నిర్వహిస్తున్న కార్యకలాపాలన్నీ వడ్డీతో నిర్వహించగలిగే స్థాయికి‌ డిపాజిట్లు పెంచుకోవాలి. అప్పుడు ఎన్ని కరోనాలు వచ్చినా టిటిడిని ఏమీ చేయలేవు. – ఆదిమూలం‌ శేఖర్, ఎడిటర్, ధర్మచక్రం

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*