టిటిడికి పోటీగా వేదిక్‌ వర్సిటీ ట్రస్టు! అనాలోచితంగా అనుమతి!!

తిరుమల తిరుపతి దేవాస్థనం (టిటిడి) వేద పరిరక్షణకు, వేద విద్యను ప్రోత్సహించడానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. తిరుమలలో వేద పాఠశాలను స్థాపించింది. ఇంకా భీమవరం తదితర ప్రాంతాల్లో సొంతంగా వేద పాఠశాలలను నిర్వహిస్తోంది. నారాయణవనంలో మరో పాఠశాలను ప్రారంభించాలని ఇటీవలే నిర్ణయించింది. ఇంకా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాపితంగా ఉన్న వేద పాఠశాలలకు అక్కడి విద్యార్థుల సంఖ్యను బట్టి ఆర్థిక సహకారం అందిస్తోంది. వేద విద్యలో పరిశోధనలు, ఉన్నత చదువుల కోసం తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర వేదిక్‌ యూనివర్సిటీని స్థాపించింది. వేద విద్యకోసం ఏటా రూ.40 కోట్లకుపైగా టిటిడి వ్యయం చేస్తోంది. వేదం చదువుతున్న విద్యార్థుల పేరుతో డిపాజిట్లు చేస్తోంది. వేద పరిరక్షణ కోసం టిటిడి భక్తుల నుంచి విరాళాలు సేకరిస్తోంది. ఇందుకోసం ‘శ్రీ వేంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టు’ను 2007లోనే ప్రారంభించింది.

ఈ తరుణంలో తిరుపతిలోని, టిటిడి యజమాన్యంలోని వేదిక్‌ యూనివర్సిటీ ఇటీవల ఓ నిర్ణయం చేసింది. ‘శ్రీ బాలాజీ వేద పరిపోషణ ట్రస్టు’ పేరుతో యూనివర్సిటీనే సొంతంగా ఓ ట్రస్టును ప్రారంభించాలని వర్సిటీ ఎగ్జిక్యుటివ్‌ కౌన్సిల్‌ నిర్ణయించింది. ఈ ప్రతిపాదన టిటిడి పాలక మండలి ముందుకు రావడం, దాన్ని ఆమోదించడం (తీర్మానం నెం.85, తేదీ :05.06.2018) చకచకా జరిగిపోయాయి. వేద పరిపోషణ కోసం విరాళాలు ఇవ్వడానికి చాలా మంది దాతలు ముందుకొస్తున్నారని, ఇందుకోసం ప్రత్యేక ట్రస్టు ఏర్పాటు చేయాలని, ఈ ట్రస్టుకు విరాళాలు ఇచ్చే దాతలకు….టిటిడిలోని అన్ని ట్రస్టులకు విరాళాలు ఇచ్చే దాతలకు కల్పిస్తున్న సదుపాయాలు కల్పించాలని టిటిడి యాజమాన్యాన్ని కోరారు. వీటన్నింటికీ బోర్డు ఆమోద ముద్ర వేసింది.

ఇప్పటికే టిటిడి ఆధ్వర్యంలో వేద పరిరక్షణ ట్రస్టు నడుస్తుండగా…యూనివర్సిటీ ఇంకో ట్రస్టు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది ప్రశ్న. వేద పరిరక్షణ కోసం విరాళాలు ఇస్తామని ఎవరైనా దాతలు ముందుకొస్తే…శ్రీవేంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టుకు జమ చేయాల్సిందిగా యూనివర్సిటీ అధికారులు సూచించవచ్చు. ఆ పని ఎందుకు చేయడం లేదు. టిటిడికి సంబంధం లేకుండా ట్రస్టు ఉంటేనే విరాళాలు ఇస్తామని దాతలు అంటున్నారా? టిటిడి ట్రస్టుపైన దాతలకు నమ్మకం లేదా? అన్నదాన ట్రస్టు, ప్రాణదాన ట్రస్టు, గోసంరణ ట్రస్టు, సర్వశ్రేయ ట్రస్టు, వారసత్వ సంపద పరిరక్షణ ట్రస్టు అనే పలు ట్రస్టులకు వందల కోట్ల విరాళాలు వస్తున్నాయి. ఆమాటకొస్తే వేద పరిరక్షణ ట్రస్టుకూ నిధులొస్తున్నాయి. ఇలాంటప్పడు…కొత్త ట్రస్టు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రస్తుతం యూనివర్సిటీకి నిధులను టిటిడినే సమకూర్చుతోంది. అంటే టిటిడి కేటాయించిన నిధుల మేరకే యూనివర్సిటీ ఖర్చులు చేయాల్సివుంటుంది. యూనివర్సిటీపై టిటిడి పెత్తనం ఏమిటి అనుకున్నారా…లేక నిధులు మొత్తం తమ ఆధీనంలోనే ఉంటే టిటిడి అడగాల్సిన అవసరం లేకుండా ఖర్చు చేయవచ్చునని భావించారా…? ఇటువంటివి ఏవీ ఆలోచించకుండానే టిటిడి పాలక మండలి యూనివర్సిటీ అధికారుల ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసింది. ఇది ఎప్పటికీ మంచిది కాదు. వేద పరిరక్షణ కోసం టిటిడి ఇప్పటి దాకా ట్రస్టు ఏర్పాటు చేయకుంటే…తప్పుబట్టాలి. దశాబ్దానికి ముందే ట్రస్టు ఏర్పాటు చేసి, విరాళాలు సేకరిస్తుంటే…యూనివర్సిటీ కొత్తగా ట్రస్టు ఏర్పాటు చేసుకోవడం ఏమిటి? దాతలు టిటిడి ట్రస్టుకు ఇవ్వాలా లేక యూనివర్సిటీ ట్రస్టుకు ఇవ్వాలా? తక్షణం యూనివర్సిటీ ట్రస్టును రద్దు చేయాల్సిన అవసరం ఉంది. టిటిడి ఆధ్వర్యంలోని ట్రస్టునే బలోపేతం చేయాలని పలువురు కోరుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*