టిటిడికి మరో ఐఏఎస్‌ అధికారి… ఎడ్యుకేషన్‌, హెల్త్‌కు ప్రత్యేక జేఈవో..!

  • ధర్మచక్రం ప్రతినిధి, తిరుపతి

తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి)కు మరో ఐఏఎస్‌ అధికారి వస్తున్నారు. ఎడ్యుకేషన్‌, హెల్త్‌ విభాగాలకు జెఈవోగా ఎస్‌.భార్గవి అనే ఐఎఎస్‌ అధికారిని నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. 2015 బ్యాచ్‌కు చెందిన ఆమె ఒకటి రెండు రోజుల్లో బాధ్యతలు చేపట్టనున్నారు.

మూడు వేల కోట్లకుపైగా వార్షిక బడ్జెట్‌ కలిగిన టిటిడికి ఈవోగా ఐఎఎస్‌ అధికారి ఉన్నారు. తిరుమల, తిరుపతి జెఈవోలుగా ఐఏఎస్‌ అధికారులను నియమిస్తున్నారు. ఇప్పుడు నాలుగో ఐఏఎస్‌ అధికారిని నియమించారు. మూడో జెఈవోను నియమించడం టిటిడి చరిత్రలో ఇదే తొలిసారి.

విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాని భావించే ఈ విభాగానికి ఐఎఎస్‌ అధికారిని నియమించి ఉండొచ్చని అంటున్నారు. ఇటీవలే స్విమ్స్‌ ఆస్పత్రిని టిటిడి తన ఆధీనంలోకి తీసుకుంది. దీన్ని రాయలసీమ, నెల్లూరు, ప్రశాశం జిల్లాల్లో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిగా అభివృద్ధి చేయాలని టిటిడి నిర్ణయించింది. అదేవిధంగా ప్రతిష్టాత్మక బర్డ్‌ ఆస్పత్రి కూడా టిటిడి నిర్వహిస్తోంది. ఇంకా సెంట్రల్‌ ఆస్పత్రి, తిరుమలోని అశ్వని ఆస్పత్రి టిటిడి నిర్వహణలో ఉన్నాయి.

ఇక విద్యారంగం విషయానికొస్తే….తిరుపతి ఎస్‌వి హైస్కూల్‌, తిరుమల ఎస్‌వి హైస్కూల్‌, పద్మావతి హైస్కూల్‌, ఓరియంటల్‌ హైస్కూల్‌, ఎస్‌వి ఆర్ట్స్‌ కాలేజీ, ఎస్‌జిఎస్‌ ఆర్ట్స్‌ కాలేజీ, పద్మావతి ఉమెన్స్‌ కాలేజీ, ఓరియంటల్‌ కాలేజీ, ఎస్‌వి జూనియర్‌ కాలేజీ, పద్మావతి జూనియర్‌ కాలేజీ….ఇవన్నీ నిర్వహిస్తోంది. ఇంకా పలు వేద పాఠశాలూ టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్నాయి.

వీటన్నింటి పర్యవేక్షణకు టిటిడి విద్యాశాఖ అధికారిని నియమిస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు ఏకంగా ఐఏఎస్‌ అధికారిని నియమించారు. అప్పటిదాకా తిరుపతి జెఈవోనే వీటి పర్యవేక్షణ చూస్తున్నారు. ఆయన టిటిడిలో పని చేస్తున్న 22 వేల మంది సర్వీసు వ్యవహారాలు కూడా చూస్తున్నారు. తిరుపతి జెఈవోకు పనిభారం ఎక్కువగా ఉందన్న అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలోనే….ఎడ్యుకేషన్‌, హెల్త్‌ విభాగాలకు ప్రత్యేక జెఈవోను నియమించినట్లు తెలుస్తోంది. అయితే… నాలుగో ఐఏఎస్ అధికారి నియామకాన్ని ఎవరూ ఊహించలేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*