టిటిడిపైకి శ్రీవారి భక్తుల దండయాత్ర..!

కలియుగ ప్రత్యక్ష దైవంగా పూజలందుకుంటున్న శ్రీవేంకటేశ్వరస్వామివారి ఖ్యాతిని తమ భజనల ద్వారా దశదిశలా ప్రచారం చేస్తున్న జానపద కళాకారులు దండికట్టి తిరుమల వైపు సాగుతున్నారు. ధర్మప్రచారం పేరుతో కోట్లు ఖర్చు చేస్తున్నా….ఏ లాభాపేక్ష లేకుండా స్వామిని కీర్తిస్తున్న ఆ భజన కళాకారుల సమస్యలు పరిష్కరించమని టిటిడి వైఖరిని నిరసిస్తూ….తమ సమస్యలను శ్రీవారికే నివేదించడానికి వేలాదిగా, పాదయాత్రగా తరలివస్తున్నారు. 7 సమస్యల పరిష్కారం కోసం, 7 కొండల స్వామి చెంతకు, 7 రోజుల మహాపాదయాత్ర పేరుతో మదనపల్లిలో 21.09.2018 ప్రారంభమైన జానపద కళాకారుల యాత్ర ఐదో రోజుకు తిరుపతి సమీపంలోకి చేరుకుంది.

చెక్క భజనలు, పండరి భజనలు, కోలాటాలు, కులుకు భజనలు, పిల్లంగట్లు, కావడి మేళం….ఇలా అనేక జానపద కళారూపాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ధర్మప్రచారం సాగిస్తున్న శ్రీవారి భక్తులైన కళాకారులు…లక్షలాది మంది ఉన్నారు. టిటిడి ధర్మ ప్రచార పరిషత్‌ (డిపిపి) ఈ కళాకారులను సరిగా వినియోగించుకోలేకపోతోంది. తమకు వాయిద్య పరికరాలు, మైక్‌సెట్లు వంటి కనీస సదుపాయాలు ఇవ్వాలని కోరుతున్నా టిటిడి అధికారులు పట్టించుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కళాకారులకు పోరాటం మేరకు…డిపిపి 1.20 లక్షల మంది జానపద కళాకారులను నమోదు చేసుకుంది. ఈ కళాకారుల చొరవతోనే తిరుమలలో అఖండ హరినామ సంకీర్తన వేదిక ఏర్పాటయింది. ఈ వేదికపై 24 గంటలూ హరినామ సంకీర్తన సాగుతోంది.

అఖండ హరినామ సంకీర్తన కోసం వస్తున్న భక్త బృందాలకు సరైన సదుపాయాలు కల్పించడంలోనూ డిపిపి అలసత్వం వహిస్తోంది. రోజుకు 12 బృందాలు అఖండ హరినామ సంకీర్తన వేదికపై భజన చేస్తుంటాయి. ఒక్కో బృందంలో 15 మంది ఉంటారు. చిత్తూరు జిల్లా నుంచి వచ్చే కళాకారులకు ఒకొక్కరికి 200, బయట జిల్లాల నుంచి వచ్చే వారికి రూ.250 మాత్రం బస్‌ఛార్జీల కింద చెల్లిస్తున్నారు. తిరుమల, తిరుమతి మధ్య ప్రయాణించడానికే రూ.110 అవసరం అవుతాయి. ఇక మదనపల్లి, కుప్పం తదితర ప్రాంతాల నుంచి వచ్చేవారు తమ జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకుని రావాల్సిందే. తమ నివాస ప్రాంతాల నుంచి వాస్తవిక బస్‌ ఛార్జీలు చెల్లించాలని కళాకారులు కోరుతున్నారు. దీనికి కూడా టిటిడి అధికారులు ఆమోదించడం లేదు. ప్రముఖ కళాకారుల పేరుతో ఒకొక్కరికి లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్న పరిస్థితి ఉంది.

జానపద కళాకారుల బృందాలను గుర్తించాలని, గురువులకు ఏడాదికి ఒకసారి సన్మానం చేయడం ద్వారా వారి ప్రతిభకు గుర్తింపు ఇవ్వాలని, టిటిడి నిర్వహించే మనగుడి వంటి కార్యక్రమాల్లో ఈ భజన కళాకారులను భాగస్వాములను చేయాలని వారు కోరుతున్నారు. బ్రహ్మోత్సవాలలో వాహన సేవల ముందు ప్రదర్శనలు ఇవ్వడానికి వేలాది బృందాలు సిద్దంగా ఉన్నాయి. అయినా అవకాశాలు ఇవ్వడం లేదు. రాష్ట్రంలోని దూర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి పిలిపిస్తున్నారు. అసలు రోజూ నాలుగు మాడ వీధుల్లో చెక్క భజనలు, కులుకు భజనలు, పండరి భజనలు వంటివి నిర్వహిస్తే….తిరుమల ఆధ్యాత్మికత మరింతగా శోభిల్లుతుంది. ఇలా అతి తక్కువ ఖర్చుతో వేలాది మంది ధర్మ ప్రచారం చేయడానికి సిద్ధపడితే వారిని ఉపయోగించుకోడానికి టిటిడి ఎందుకు వెనకాడుతోందో తెలియదు. ఇదంతా చేయగలిగితే…ధర్మ ప్రచారం మాత్రమే కాదు జానపద కళలను బతికించిన కీర్తి టిటిడికి దక్కుతుంది. రకరాకల కార్యక్రమాల పేరుతో కోట్లకు కోట్లు ఖర్చు చేస్తున్న టిటిడికి ఇదేమీ పెద్ద సమస్య కాదు.

జానపద కళాకారులను ధర్మ ప్రచారంలో ఉపయోగించుకుంటామని, సమస్యలు పరిష్కరిస్తామని గతంలో టిటిడి ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. ఆ తరువాత పట్టించుకోవడం లేదు. అందుకే….మహాపాదయాత్ర ప్రారంభించారు. మదనపల్లి నుంచి వెయ్యిమందికిపైగా కళాకారులు పాదయాత్రగా తిరుపతికి వస్తున్నారు. గురువారం (27.09.2018) 30 వేల మందితో తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం ఎదుట ప్రదర్శన నిర్వహించిన అనంతరం పాదయాత్రగానే తిరుమలకు చేరుకోనున్నారు. భజనల రూపంలో తమ గోడును శ్రీవారిని వినిపించనున్నారు.

ఈ మహాపాదయాత్రకు జానపద కళాకారుల సంఘం నాయకులు పిలిమామిడి యాదగిరి, వి.మునిచంద్ర తదితరులు నాయకత్వం వహిస్తున్నారు. ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించాలని టిటిడి అధికారులను కోరుతున్నారు. లేదంటే…నాలుగు మాడా వీధుల్లోనే తిష్టవేసి భజనలు సాగిస్తూ తమ గోడును శ్రీవారికి విన్నవిస్తామని చెబుతున్నారు. మరి టిటిడి అధికారులు స్పందిస్తారా? జానపద కళాకారుల సమస్యలు పరిష్కరిస్తారా?!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*