టిటిడిపై రాయపాటి ఆగ్రహానికి కారణం తెలిసింది!

టిటిడి పాలక మండలి సభ్యుడు, పార్లమెంటు సభ్యులు రాయపాటి సాంబశివరావు ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ బోర్డు సభ్యులకు ఆవగింత విలువ కూడా లేదని వాపోయారు. అధికారులదే పెత్తనమని వాక్రుచ్చారు. ‘ఇక్కడ జెఈవోలు, ఈవోలదే పెత్తనంగా ఉంది. మాదెవరిదీ పెత్తనంకాదు. ఛైర్మన్‌ డమ్మీ అయిపోయారు. బోర్డు సభ్యులను పట్టించుకునేవారు లేరు. ఇక్కడికి వస్తే పట్టించునే అధికారి లేరు. ఉదయాన వస్తే ఇప్పటిదాకా వచ్చి పలకరించిన నాథుడు లేరు. నేను ఒకప్పుడు 30 ఏళ్ల క్రితం నాగిరెడ్డి ఛైర్మన్‌గా ఉన్నప్పుడు బోర్డు సభ్యునిగా ఉన్నా. ఇప్పటికీ ఇప్పటికీ చాలా తేడావుంది. అప్పట్లో బోర్డు సభ్యులకు చాలా గౌరవం ఉండేది’ అని వాపోయారు.

రాయపాటి ఆగ్రహం వెనుక కారణాలు ఆలస్యంగా బయటకు వచ్చాయి. ఆయన చేసిన చిన్న సిఫార్సును బోర్డు పక్కనపెట్టేసింది. వాస్తవంగా అది టిటిడిపై ఆర్థిక భారం తగ్గించేదే. అయినా పట్టించుకోలేదు. అందుకే ఆయనకు కోపం వచ్చినట్లుంది. ఆ వివరాల్లోకి వెళితే…

టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టుకు డైరెక్టర్‌గా వారణాసిలోని బెనారస్‌ హిందూ యూనివర్సిటీలో తెలుగు విభాగాధిపతిగా ఉన్న బి.విశ్వనాథ్‌ను నియమించాలని 05.06.2018 నాటి పాలక మండలి సమావేశంలో తీర్మానించారు. అయితే…శ్రీనివాస వాజ్ఞ్మయ ప్రాజెక్టు అధికారిగా పని చేస్తున్న తిరుపతికి చెందిన మేడసాని మోహన్‌ను ఆ పదవిలో నియమించాలంటూ రాయపాటి సిఫార్సు చేశారు. మేడసానికి గతంలో అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్‌గా పని చేసిన అనుభవం ఉందని, అంతేకాకుండా విశ్వనాథ్‌ను ఆ పోస్టులో నియమిస్తే…ఆయనకు యుజిసి స్కేలు కింద నెలకు రూ.2 లక్షల దాకా వేతనం చెల్లించాల్సివుంటుందని, ఇది టిటిడికి ఆర్థికంగా భారంకూడా అవుతుందని పేర్కొన్నారు. పాత నిర్ణయాన్ని పున:సమీక్షించి, మేడసాని మోహన్‌ను ఆ పదవిలో నియమించాలని ఈవోకు లేఖ రాశారు. దీనిపైన 26.06.2018 నాటి బోర్డు సమావేశంలో చర్చించారుగానీ….పాత నిర్ణయాన్నే అమలు చేయాలని నిర్ణయించారు. రాయపాటి విజ్ఞప్తిని బుట్టదాఖలు చేశారు. దీంతో ఆయనకు కొపం వచ్చినట్లుంది.

అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఎక్కడో బెనారస్‌ యూనివర్సిటీలో ఉన్న వ్యక్తిని తీసుకురావాలని ఎందుకు అనుకుంటున్నారో తెలియదు. ఎంత పెద్ద సిఫార్సు ఆయనకు ఉందోగానీ…నెలకు రూ.2 లక్షల జీతం భరించడానికి సిద్ధమై డైరెక్టర్‌గా నియమించాలని నిర్ణయించారు. అన్నమాచార్య ప్రాజెక్టును సాధారణ అధికారులైనా నడపగలరు. విశ్వనాథ్‌కు ఇచ్చే వేతనంలో నాలుగో వంతు ఇచ్చినా పని చేయడానికి చాలామందే ఉంటారు. అలాంటిది రూ.2 లక్షల వేతనంతో విశ్వనాథ్‌ను ఎందుకు తీసుకొస్తున్నారనేది ప్రశ్న. ఎవరికి పలుకుబడి ఉంటే వాళ్లు…అడ్డదారుల్లో టిటిడిలోకి రావచ్చు. శ్రీవారి నిధులు దుర్వినియోగం అయినా ఫర్వాలేదు…సిఫార్సులు ఉన్నవారిని టిటిడిలోని కీలక పదవుల్లో నియమిస్తారనేందుకు ఉదాహరణ ఇది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*