టిటిడితో సమరమా…స్నేహమా?

టిటిడిలో జరుగుతున్న అవాంఛనీయ పరిణామాలపై చర్చించేందుకు స్వామీజీలు సిద్ధమయ్యారు. శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులతో గొంతుకలిపేందుకు మఠాధిపతులు, పీఠాధిపతులు ఆదివారం తిరుపతికి తరలివస్తున్నారు. తిరుమల శ్రీవారికి కైంకర్యాలు ఆగమోక్తంగా జరగడం లేదని, శ్రీవారి అన్నప్రసాదాశాల పోటును గుప్తనిధుల కోసం తవ్వేశారని, స్వామివారి ఆభరణాలు మాయమవుతున్నాయని రమణ దీక్షితులు ఎత్తిచూపుతున్న లోపాలను సరిదిద్దుకునేందుకు బదులు…ఆయన్ను రాత్రికి రాత్రి ప్రధాన అర్చక పదవి నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో టిటిడిపై జాతీయ స్థాయిలో దుమారం రేగింది. టిటిడిపైన శ్రీవారి భక్తుల్లో అపనమ్మకం ఏర్పడే పరిస్థితి తలెత్తింది. అయినా దీన్ని రాజకీయ కోణంలోనే చూస్తూ….రమణ దీక్షితులుపై క్రిమినల్‌ కేసులు బనాయించడానికి టిటిడి రెడీ అయింది.

టిటిడిలో జరుగుతున్న పరిణామాలపై దేశ వ్యాపితంగా ఉన్న మఠాధిపతులు, పీఠాధిపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయంపై రాజకీయ పెత్తనం గురించి మొదటి నుంచి స్వామీజీలంతా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి ఆలయాన్ని వ్యాపార కేంద్రంగా మార్చేశారన్నది తొలి నుంచి చిన్నజీయర్‌ స్వామి వంటివారు చేస్తున్న ఆరోపణ. ఈ క్రమంలోనే రమణ చెబుతున్నారు. ఇటీవల హైదరాబాదులో పలువురు మాఠాధిపతులు, పీఠాధిపతులు సమావేశమయ్యారు. ఆదివారం తిరుపతిలో సమావేశమై శ్రీవారి ఆలయ పరిరక్షణకు, తప్పుల దిద్దుబాటుకు చేపట్టాల్సిన చర్యలపై ఇటు టిటిడికి, అటు ప్రభుత్వానికి సూచనలు చేస్తూ డిక్లరేషన్‌ ప్రకటించాచాలని నిర్ణయించారు. టిటిడిలో జరుగుతున్న పరిణామాలు భక్తుల విశ్వాసాలకే విఘాతం కలిగించేలా ఉన్నాయని, భక్తుల్లో ఆందోళన వ్యక్తమవుతోందని చెబుతున్నారు. ఈ అనుమానాలను నివృత్తి చేయడానికి ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలను ఈ సమావేశంలో చర్చిస్తామని స్వాములు చెబుతున్నారు.

ఇదిలావుండగా…రమణ దీక్షితులు వెనుక బిజెపి, వైసిపి ఉన్నాయని; రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు అందరూ కలిసి కుట్ర చేస్తున్నారని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నారు. టిటిడిని స్వాధీనం చేసుకోడనికి కేంద్ర ప్రభుత్వం పన్నాగం పన్నుదోందని ఊరూరా ప్రచారం చేస్తున్నారు. తిరుమలలో అన్నీ సవ్యంగా ఉన్నా రాజకీయ ప్రయోజనాల కోసమే రాద్ధాంతం చేస్తున్నారని తెలుగుదేశం నాయకులు పదేపదే చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆదివారం తిరుపతిలో జరగనున్న స్వామీజీల సమావేశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. స్వామీజీలు తిరుపతి డిక్లరేషన్‌లో ఎలాంటి డిమాండ్లు ముందుకు తెస్తారనేది ఆసక్తికరంగా మారింది. భక్తుల అనుమానాలను నివృత్తి చేయడానికి అవసరమైన చర్యలను ప్రభుత్వానికి సూచిస్తామని అంటున్నారు. అంటే…రమణ దీక్షితులు డిమాండ్‌ చేస్తున్నట్లు సిబిఐ విచారణను స్వామీజీలూ కోరే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే…తిరుమల వివాదం మరింత జఠిలంగా మారుతుంది. స్వామీజీలు ఎలాంటి డిమాండ్లు చేయబోతున్నారు, ప్రభుత్వం ఎలా స్పందించబోతుంది, భవిష్యత్తు పరిణామాలు ఎలావుండబోతున్నాయి అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారుతున్న అంశం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*