టిటిడిపై సుబ్రమణ్యస్వామి కేసు వచ్చేవారంలో దాఖలు

టిటిడిలో ప్రభుత్వ జోక్యం, పురాతన కట్టడ పరిరక్షణ, అక్రమాలు తదితర అంశాలపై విచారణ జరిపించాలని కోరుతూ ఎంపి సుబ్రమణ్యస్వామి వారం రోజుల్లో సుప్రీంలో కేసు దాఖలు చేయనున్నారు. టిటిడి, యమునా నది కాలుష్యంపై పిటిషన్ల తయారీ పూర్తయిందని, వారం రోజుల్లో సుప్రీంకోర్టులో దాఖలు చేస్తానని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. శ్రీవారి ఆలయంలో బంగారు ఆభరణాలు మయమయ్యాయని, పోటులో తవ్వకాలు జరిగాయని, స్వామివారికి కైంకర్యాలు సక్రమంగా జరగడం లేదని శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులుగా పనిచేసిన రమణ దీక్షితులు తీవ్రమైన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపైన స్పందించిన సుబ్రమణ్యస్వామి సుప్రీంలో కేసు వేస్తానని ప్రకటించి నెలకుపైగా గడిచింది. ఈ కాలంలో పిటిషన్‌ తయారు చేస్తున్నట్లు రెండుమూడు సార్లు ట్విట్టర్‌లో పెట్టారు. ఆ పని పూర్తయిందని, వారం రోజుల్లో కోర్టు మెట్లు ఎక్కుతానని ఆయన తాజాగా జులై 3వ తేదీన ట్విట్‌ చేశారు. ఇదిలావుండగా ఇప్పటికే దాదాపు ఇదే అంశాలలో ఇద్దరు వ్యక్తులు రాష్ట్ర హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు మంళవారం (3న) విచారణకు వచ్చింది. ప్రాథమిక విచారణ అనంతరం….ప్రభుత్వానికి, టిటిడి బోర్డుకు నోటీసులు ఇస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. మూడు వారాల్లో సమగ్ర వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని టిటిడిని కోర్టు ఆదేశించింది. దీనికి ముందు రాష్ట్ర ప్రభుత్వమే హైకోర్టుకు లేఖ రాసింది. సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించి, శ్రీవారి ఆభరణాలపై వస్తున్న అపోహలను తొలగించాలని కోరింది.

టిటిడిలో జరుగుతున్న వ్యవహారాలపై సిబిఐ విచారణ జరిపించాలన్నది రమణ దీక్షితులు చేస్తున్న డిమాండ్‌. హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేసిన వ్యక్తులు కూడా ఇదే అభ్యర్థించారు. సుబ్రమణ్య స్వామి కూడా సిబిఐ వంటి సంస్థ విచారణనే కోరే అవకాశాలున్నాయి. అయితే సిబిఐ విచారణ పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది. సిబిఐ అంటేనేను అది కేంద్ర ప్రభుత్వ జేబు సంస్థ అనే భావన సర్వత్రా ఉంది. ఇప్పటికే బిజెపితో విడిపోయినప్పటి నుంచి తెలుగుదేశం ఆ పార్టీపై విమర్శలు గుప్పిస్తోంది. రాజకీయ కక్షతో తనపై కేసులు బనాయించే అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదేపదే చెబుతూ వచ్చారు. అందుకే సిబిఐకి అవకాశం ఇవ్వకూడదనే….హైకోర్టు జడ్జితో జ్యుడిషియల్‌ విచారణ జరిపించాలని కోర్టును కోరారు. పిటిషనర్లు, రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం ఎలావున్నా….కోర్టులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయనేదే కీలకం కానుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*