టిటిడిలో అంతులేని కథలా రాజస్థాన్ డిగ్రీల వివాదం..!

ధర్మచక్రం ప్రతినిధి – తిరుపతి
టిటిడి ఇంజినీరింగ్ విభాగంలో రాజస్థాన్ బిటెక్ డిగ్రీల వివాదం‌ ఎంతకూ ఎడతెగడం లేదు.‌ ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది. తాజాగా మరోసారి ఈ వివాదం చర్చనీయాంశంగా మారింది.

ఇంజినీరింగ్ డిప్లొమా అర్హతలతో అసిస్టెంట్ ఇంజినీర్లుగా ఉద్యోగాలు పొందిన వారు… డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరుగా ప్రమోషన్ల కోసం రాజస్థాన్ కి చెందిన ఓ యూనివర్శటీ నుంచి దూర విద్య విధానంలో బిటెక్ పూర్తి చేశారు. వీరంతా తమ డిగ్రీలను పరిశీలించి, ఎస్.ఆర్.లో నమోదు చేయాల్సిందిగా కోరారు. అప్పటి ఈవో ఏపివిఎన్ శర్మ, రాజస్థాన్ డిగ్రీల చెల్లుబాటు గురించి తెలుసుకోడానికి యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ కి, అఖిల భారత సాంకేతిక విద్యామండలికి లేఖ రాశారు.‌ అటువంటి యూనివర్శటీ ఏదీ లేదని, ఆ డిగ్రీలకు గుర్తింపు లేదని యుజిసి తేల్చేసింది. దీంతో డిగ్రీలను పక్కకు పెట్టేశారు. ఇదంతా 2007లో జరిగింది.

ఆ తరువాత రమణాచారి ఈవోగా వచ్చారు. దీంతో మరోసారి రాజస్థాన్ డిగ్రీల ఫైలు కదిలింది. అప్పుడు కూడా అనేక తర్జనభర్జనల‌ అనంతరం…డిగ్రీలు చెల్లుతాయని గానీ చెల్లవనిగానీ రాజస్థాన్ డిగ్రీలను‌ అబయన్స్ లో పెట్టేశారు.‌ ఆపై ఐవైఆర్ కృష్ణారావు వచ్చారు. ఆయనా రాజస్థాన్ డిగ్రీలను‌ పట్టించుకోలేదు.‌‌ ఆయన మారిపోయిన తరువాత ఎల్.వి. సుబ్రమణ్యం ఈవోగా వచ్చాక…రాజస్థాన్ డిగ్రీలు పొందినవారు హైకోర్టును‌ ఆశ్రయించారు. తమ డిగ్రీలను‌ అబయన్స్ లో పెట్టడం వల్ల ప్రమోషన్లు పొందలేక పోతున్నామని కోర్టుకు విన్నవిం చుకున్నారు. ఆ డిగ్రీలపై సరైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోర్టు టిటిడిని‌ ఆదేశించింది. దీంతో కొందరికి ప్రమోషన్లు వచ్చాయి.

ఇదిలావుండగా… దేశంలోని చాలాచోట్ల రాజస్థాన్ యూనివర్శటీ దూరవిద్య డిగ్రీలు వివాదాస్పం‌ అవడంతో వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది.‌ ఈ డిగ్రీలు చెల్లుబాటు కానప్పటికీ…మానతా దృక్పథంతో, ప్రభుత్వ‌‌ సాంకేతిక విద్యామండలి‌ నేతృత్వంలో మరోసారి పరీక్షలు నిర్వహించాలని దిశానిర్దేశం చేసింది. ఈ పరీక్షల్లో తొలి ప్రయత్నంలో పాస్ అయిన వారికి…వాళ్లు మొదట్లో ఎప్పుడైతే డిగ్రీ పొందినట్లు సర్టిఫికెట్లు సమర్పంచారో…ఆనాటి నుంచే డిగ్రీలను గుర్తించాలని చెప్పింది. రెండో ప్రయత్నంలో ఉత్తీర్ణులైతే…కొత్తగా పాసైనట్లు గుర్తించాలని సహేతుకమైన తీర్పును వెలువరించింది.

దీంతో…టిటిడిలో రాజస్థాన్ డిగ్రీలతో ప్రమోషన్లు పొందివ వారి వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. ఇటువంటి వారికి రివర్సన్ ఇస్తారనుకుంటున్న తరుణంలో మరోసారి వివాదం హైకోర్టుకు వెళ్లింది. దీంతో…సరైన నిర్ణయం తీసుకుని న్యాయం చేయాలంటూ మరోసారి హైకోర్టు తీర్పు వెలువరిచింది. ఈ తీర్పు రాజస్థాన్ డిగ్రీలు పొందిన వారికి అనుకూలంగా భావిస్తూ…ఆ డిగ్రీలు చెల్లుబాటు అవుతాయని సంబంధిత వ్యక్తులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. రెండో ప్రయత్నంలో ఉత్తీర్ణులై వారిని కూడా 2007 లోనే ఉత్తీర్ణులైనట్లు గుర్తిస్తూ వారికి ప్రమోషన్లు ఇవ్వడానికీ సిద్ధమైనట్లు సమాచారం. ఇది సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకమని, హైకోర్టు తాజా తీర్పు వల్ల నష్టపోతున్న ఇంజినీర్లు చెబుతున్నారు. దీనిపై హైకోర్టుకు వెళ్లి, సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను న్యాయస్థానం ముందు ఉంచడానికి సన్నద్ధమవుతున్నారు.

ఇదిలావుండగా ఈ వివాదంలో టిటిడి అధికారులు స్థిరమైన నిర్ణయం తీసుకోలేకున్నారు. మొన్నటి దాకా…రెండో ప్రయత్నంలో ఉత్తీర్ణులైన వారి సర్టిఫికెట్లను పరిగణనలోకి తీసుకోడాని అంగీకరించని‌ అధికారులు ఇప్పుడు అవే సర్టిఫికెట్లతో ప్రమోషన్లు ఇవ్వడానికి సిద్ధపడటం వెనుక ఆంతర్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. హైకోర్టులో టిటిడి తరపున సరగా వాదనలు వినిపించలేదని ఆరోపిస్తున్నారు. కొందరు రాజకీయ నేతలు, అధికారులు కుమ్మక్కయి…హైకోర్టు తీర్పును అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శిస్తున్నారు. తీర్పు మార్చిలో వచ్చినప్పటికీ…హైకోర్టుకు సెలవులున్న సమయంలో దాని అమలుకు పూనుకున్నారని వాపోతున్నారు. ఇటువంటి చర్యల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని అంటున్నారు.

రాజస్థాన్ డిగ్రీల వ్యవహారంలో సుప్రీం తీర్పునకు లోబడే నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు పోస్టుల్లో ప్రమోషన్లకు….డైరెక్ట్ ‌రిక్రూట్మెంట్ వారికి, కన్వర్షన్ వారికి పాటించాల్సిన నిష్పత్తిని కూడా పాటించడం లేదని ఆరోపిస్తున్నారు. ఆరు పోస్టుల్లో ఒక పోస్టు మాత్రమే కన్వర్షన్ వారికి ఇవ్వాల్సి ఉండగా…దీన్ని పాటించడం లేదని చెబుతున్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తమ వాదన వినిపించేందుకు హైకోర్టును ఆశ్రయిస్తామని కూడా చెబుతున్నారు. ఏదిఏమైనా టిటిడి అధికారులకు స్థిరమైన నిర్ణయం లేకపోవడం వల్ల ఈ వివాదం రావణ కాష్టంలా రగులుతూనే ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*