టిటిడిలో అధికారులదే పెత్తనం! ఛైర్మన్‌ కూడా డమ్మీనే : రాయపాటి

టిటిడిలో జరుగుతున్న వ్యవహారాలపై ఎంపి, పార్లమెంటు సభ్యులు రాయపాటి సాంబశివరావు తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. టిటిడిలో పెత్తనమంతా అధికారులదేనని, ఛైర్మన్‌ సహా బోర్డు మొత్తం డమ్మీయే అని అన్నారు. తిరుమలలో తనను కలిసిన విలేకరులతో ఆయన సంభాషించారు. ప్రత్యేక హోదా, అవిశ్వాసం తదితర అంశాలపై అభిప్రాయాలు చెప్పిన ఆయన…టిటిడి వ్యవహారాలపైనా మాట్లాడారు.

మహాసంప్రోక్షణ సమయంలో భక్తులకు దర్శనం ఆపేయాలని గత బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దీంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు…బోర్డు తన నిర్ణయాన్ని 24.07.2018నాటి సమావేశంలో పున: సమీక్షించుకుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు తిరుమలకు వచ్చిన రాయపాటి… మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

మహాసంప్రోక్షణ సమయంలో దర్శనాలు ఆపేయాలని గత సమావేశంలో తీసుకున్న నిర్ణయంపై స్పందిస్తూ….’ఇక్కడంతా వన్‌వే ట్రాఫిక్‌లాగా ఉంది. ఆఫీసర్ల ఇష్టం. ఇక్కడ ఏ విషయాలూ చెప్పరు. వాళ్ల ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకుంటారు. మహాసంప్రోక్షణ దర్శనాల విషయంలోనూ ఇలాగే నిర్ణయం తీసుకుని మాకు చెప్పారు. ఆ రోజుల్లో ఆలయంలో పూజలు ఎక్కువగా ఉంటాయని, 1500 మంది రుత్వికులు వస్తారని, భక్తులను దర్శనానికి అనుమతిస్తే పూజలు సరిగా జరగవని చెప్పారు. భక్తుల దర్శనాలు ఆపేస్తామని ప్రకటించారు. చర్చ లేకుండా ప్రకటించారు. ఇక్కడంతా ఎలావుందంటే వన్‌వే ట్రాఫిక్‌లాగా ఉంది.’ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

‘ఇక్కడ జెఈవోలు, ఈవోలదే పెత్తనంగా ఉంది. మాదెవరిదీ పెత్తనంకాదు. ఛైర్మన్‌ డమ్మీ అయిపోయారు. బోర్డు సభ్యులను పట్టించుకునేవారు లేరు. ఇక్కడికి వస్తే పట్టించునే అధికారి లేరు. ఉదయాన వస్తే ఇప్పటిదాకా వచ్చి పలకరించిన నాథుడు లేరు. నేను ఒకప్పుడు 30 ఏళ్ల క్రితం నాగిరెడ్డి ఛైర్మన్‌గా ఉన్నప్పుడు బోర్డు సభ్యునిగా ఉన్నా. ఇప్పటికీ ఇప్పటికీ చాలా తేడావుంది. అప్పట్లో బోర్డు సభ్యులకు చాలా గౌరవం ఉండేది’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదిలావుండగా…మహాసంప్రోక్షణ సమయంలో దర్శనాలు నిలిపివేయాలని ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంపైన మిగతా సభ్యులు కూడా అధికారులను నిలదీసినట్లు సమాచారం. బోర్డు సమావేశంలోనే కాకుండా విడిగా కూర్చుని కూడా దీనిపై చర్చించినట్లు తెలిసింది. మొత్తంమ్మీద అధికారులు తమను తప్పుదారి పట్టించారన్న అభిప్రాయం సభ్యుల్లో వ్యక్తమయింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*