టిటిడిలో అధికారుల అనుంగులకే ప్రశంసా పత్రాలు!

– సొంత పనులు చేసేవారికే అవార్డులు
– అధికారులు వివక్ష చూపుతున్నారంటున్న ఉద్యోగులు
– తమను పూర్తిగా విస్మరించడంపై కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది నిరసన

జనవరి 26 రిపబ్లిక్‌డే, ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏటా రెండు పర్యాయాలు టిటిడి ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు ఇస్తుంటారు. అయితే…ఇందుకోసం జరుగుతున్న ఎంపిక విధానం లోపభూయిష్టంగా ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. విభాగాధిపతులు తమకు అనుకూలంగా, అనుంగులుగా ఉన్న వారినే అవార్డుల కోసం ఎంపిక చేస్తున్నారన విమర్శలు వినిపిస్తున్నాయి.

లోపభూయిష్టంగా ఎంపిక విధానం…
అవార్డులు ఎవరికి ఇవ్వాలో నిర్ణయించడానికి ఓ కమిటీ ఉంది. మీ విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగుల జాబితా పంపండి అంటూ ముందుగా ఓ సర్క్యులర్‌ను అన్ని విభాగాధిపతులకు పంపుతారు. దీంతో విభాగాధిపతులు కొందరు పేర్లు ఎంపిక చేసి జాబితా పంపిస్తారు. ఎంపిక కమిటీ దాన్ని ఖరారు చేస్తుంది. అయితే…విభాగాధిపతులు తాము చెప్పినట్లు వినేవారిని, సొంత పనులు చేసిపెట్టేవారిని, ఇతరత్రా సహాయం అందించే వారినే ఎంపిక చేసి పేర్లు పంపుతున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వీసు కాలంలో ఒక్క రిమార్కు కూడా లేకుండా, నిజాయితీగా పని చేసే ఉద్యోగులు చాలా మంది ఒకసారి ప్రశంసా పత్రం అందుకోకుండానే రిటైర్డ్‌ అయిపోతున్నారని వాపోతున్నారు. ఇదే సమయంలో క్రమశిక్షణా చర్యలు ఎదుర్కొన్నవారు, డిఏ కేసులు పెండింగ్‌లో ఉన్నవారు అవార్డులకు ఎంపికవుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటిదాకా అవార్డులు అందుకున్న వారి వివరాలను పరిశీలిస్తే విజిలెన్స్‌ అధికారులకే అన్ని విషయాలూ తెలుస్తాయని అంటున్నారు. ఇప్పటిదాకా అవార్డులు అందుకున్న అందరూ అలాంటవారే అనేది కాదుగానీ…అధికారులను కాకాపట్టి వాటిని తెచ్చుకుంటున్నవారూ ఉన్నారనేది పలువురు ఉద్యోగులు చెబుతున్న అభిప్రాయాల్లోని సారాంశం.

దరఖాస్తు చేసుకునే విధానం ఉంటే…
అవార్డుకు అధికారులు ఎంపిక చేసే విధానం కాకుండా…ఉద్యోగులే దరఖాస్తు చేసుకునే పద్ధతి ఉంటే బాగుంటుందని పలువురు సూచిస్తున్నారు. నిర్ధిష్ట సర్వీసు కలిగి, ఎలాంటి మచ్చలేని, పనిలో సాధించిన ప్రగతిని తెలియజేస్తూ అవార్డుకు దరఖాస్తు చేసుకుంటే…వాటిని పరిశీలించి కమిటీ ఎంపిక చేయాలని కోరుతున్నారు. దీనివల్ల అధికారులు తమకు నచ్చని వారిని పక్కన పెట్టడానికి, వివక్ష చూపడానికి అవకాశం ఉండబోదని చెబుతున్నారు. రానున్న ఆగస్టు 15కు సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు. వచ్చే జనవరి 26 అవార్డులకైనా కొత్త విధానం తీసుకురావాలని ఉద్యోగులు కోరుతున్నారు.

అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టుకూ ఇవ్వాలి…
ఏ అవార్డు అయినా ప్రోత్సహించడానికే ఇస్తారు. టిటిడిలో రెగ్యులర్‌ ఉద్యోగులు 8,500 మంది ఉంటే అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులు 14 వేల మంది ఉన్నారు. ఈ 14 వేల మంది అవార్డులకు దూరంగా ఉండిపోతున్నారు. ఇంకా చెప్పాలంటే అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులే కీలకమైన పనుల్లో ఉన్నారు. రెగ్యులర్‌ కాదనే ఒక్క కారణంగా వారిని పక్కనపెట్టేస్తున్నారు. డిప్యుటేషన్‌పై వస్తున్న పోలీసులకు, ఇతర అధికారులకూ అవార్డులు ఇచ్చేటప్పుడు టిటిడిలోనే దశాబ్దకాలానికిపైగా పని చేస్తున్న వారికి ప్రశంసా పత్రం ఇవ్వడంలో అభ్యంతరం ఏమిటో అర్థంకాదు. ప్రశంసా పత్రం ఇచ్చినంత మాత్రాన వాళ్లేమీ శాశ్వత ఉద్యోగులైపోరు. అవసరమైతే కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ అని ఒక ప్రత్యేక విభాగం కిందే వారికి అవార్డులు ఇవ్వొచ్చు. టిటిడి ఉన్నతాధికారులు ఈ రెండు అంశాలను పరిశీలించాల్సిన అవసరం ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*