టిటిడిలో ఏపి ఆన్‌లైన్‌ సిబ్బంది కష్టాలు

టిటిడిలో సమయ నిర్దేశిత సర్వదర్శనం – టైంస్లాట్‌ సర్వదర్శనం కౌంటర్ల నిర్వహణ కాంట్రాక్టు తీసుకున్న ఏపి ఆన్‌లైన్‌ సంస్థ ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇష్టమొచ్చిన వారిని తీసుకోవడం, ఇష్టంలేని వారిని తొలగించడం వంటి చర్యలకు పూనుకుంటోందని ఆవేదన చెందుతున్నారు. అదేవిధంగా ముందుగా చెప్పిన దానికంటే తక్కువ వేతనం ఇస్తున్నారని వాపోతున్నారు.

కార్మికుల తొలగింపు…
ఉచిత దర్శనం భక్తులకూ టైంస్లాట్‌ కేటాయించడం కోసం తిరుమల, తిరుపతి, కాలినడక మార్గాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వీటి నిర్వహణ బాధ్యతను ఏపి ఆన్‌లైన్‌ అనే సంస్థకు అప్పగించారు. ఒకేసారి వందకుపైగా కౌంటర్లు ఏర్పాటు చేయడంతో ఒక్కో కౌంటర్‌కు ముగ్గురు వంతున 300 మందికిపైగా ఆపరేటర్లు, సూపర్‌వైజర్లను ఆ సంస్థ నియమించుకుంది. కొత్త సంస్థ వస్తుండటంతో చాలా మంది అప్పటికే పని చేస్తున్న సంస్థలను విడిచిపెట్టి ఏపి ఆన్‌లైన్‌లో చేరారు. తీరా దేవస్థానం కౌంటర్ల సంఖ్యను తగ్గించేసింది. దీంతో సిబ్బంది మిగిలిపోయారు. ఏ కారణాలూ లేకుండా 60 మందికిపైగా ఆపరేటర్లను, సూపర్‌వైజర్లను కొన్ని నెలలకే వీధులపాలు చేశారు. ప్రస్తుతం 258 మంది మాత్రమే పని చేస్తున్నట్లు సమాచారం. ఇదేమిటని ప్రశ్నిస్తే…టిటిడి అధికారులే తొలగించమని చెప్పారంటూ తప్పించుకుంటున్నారు. తిరుమలలో గదుల కేటాయింపు కౌంటర్లు కూడా తమకే వస్తాయని, అప్పుడు మళ్లీ తీసుకుంటామని చెప్పి కొందరని పంపేశారు. మహిళలనైతే ఇబ్బందులకు గురిచేసి సాగనంపేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం 38 మంది మహిళలు పని చేస్తున్నారు. మొదటో 44 మంది ఉండేవాళ్లు. వేధింపులు తాళలేక ఆరుగురు మానేశారు. తెల్లవారిజామున 5 గంటలకే పనిలోకి రావాలని ఒత్తిడి చేస్తున్నారని, దీంతో మహిళలు పని మానేస్తున్నారని చెబుతున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే….మహిళలను నియమించుకోవొద్దని టిటిడి అధికారులు ఆదేశించారని, అందుకే తొలగిస్తున్నామని కూడా చెబుతున్నారట.

జీతంలో కోత..
తమను తీసుకునేటప్పుడు ఆపరేటర్‌కు రూ.13,000; సూపర్‌వైజర్‌కు రూ.15,000 ఇస్తామని చెప్పారని…అయితే ఇప్పుడు రూ.7,800 మాత్రమే ఇస్తున్నారని సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. అదేవిధంగా గాలిగోపురం కౌంటర్లలో పనిచేసే వారికి రూ.1,500 పెట్రోల్‌ అలవన్సు ఇస్తామని హామీ ఇచ్చారని, తీరా ఇప్పుడు అలాంటివేమీ లేవంటూ చేతులెత్తేశారని అంటున్నారు. ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే…అవసరానికి మించి పనిలో పెట్టుకున్నామని, కొందరిని తొలగించిన తరువాత పూర్తి జీతాలు చెల్లిస్తామంటూ తప్పించుకుం టున్నారని సిబ్బంది తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. గతంలో ఓ సంస్థలో పనిచేస్తూ అక్రమాలకు పాల్పడటంతో అక్కడ తొలగించిన వారినీ నియమించుకున్నారని, అయినా టిటిడి విజిలెన్స్‌ అధికారులు పట్టించుకోలేదని సమాచారం. ఉద్యోగం పేరుతో కొందరి వద్ద రూ.30 వేల నుంచి రూ.40 వేలు వసూలు చేసుకున్నారని, అలాంటి వారు కూడా ఇప్పుడు ఉద్యోగం ఉంటుందో పోతుందో అని ఆందోళన చెందుతున్నారని సిబ్బంది చెబుతున్నారు. టిటిడి ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని ఏపి ఆన్‌లైన్‌ సిబ్బంది వేడుకుంటున్నారు.

2 Comments

  1. S This is Correct… I am also one of the Employer in Ap Online but ippudu nakuda edo Saaku cheppi Pumpinchesaaru. Ippudu Na Badha evariki cheppukovali artam kavadam ledu

  2. S This is Correct… I am also one of the Employer in Ap Online. TTD vigilance cheparu ani but ippudu nakuda edo Saaku cheppi Pumpinchesaaru. Ippudu Na Badha evariki cheppukovali artam kavadam ledu

Leave a Reply

Your email address will not be published.


*