టిటిడిలో కొత్త వివాదానికి అటవీ శాఖ ఆజ్యం.!

తిరుమల ఘాట్ రోడ్డులో రెండు రోజుల క్రితం చిరుతపులి ఇద్దరు భక్తులపై దాడి చేసిన నేపథ్యంలో…అటవీ శాఖ చేస్తున్న ప్రతిపాదనలు టిటిడిలో కొత్త వివాదానికి దారితీసేలావుంది. అటవీ శాఖ చేస్తున్న సూచనలు అమల్లోకి వస్తే పెద్ద దుమారం రేగే సంకేతాలు కనిపిస్తున్నాయి.

చిరుత పులి దాడి నేపథ్యంలో మంగళవారం టిటిడి విజిలెన్స్, ఫారెస్ట్ ప్రభుత్వ అటవీ శాఖ అధికారులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా ప్రభుత్వం ఫారెస్ట్ అధికారులు రెండు సూచనలు చేశారు. తిరుమల ఘాట్ రోడ్ లో సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 7 గంటల దాకా ద్విచక్ర వాహనాలు అనుమతించకూడదన్నది మొదటి సూచన. కాల్ నడకదారిలో రాత్రి 8 గంటల నుంచి ఉదయం ఆరు గంటల దాకా యాత్రికులను అనుమతించకూడదని సూచన చేశారు. ఈ సూచనలు పైన చర్చించి తుది నిర్ణయం తీసుకోవాల్సివుంది.

ఫారెస్ట్ అధికారుల సూచనలను టీటీడీ అంగీకరించి అమలులోకి తీసుకు వస్తే పెద్ద వివాదమే రేగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తిరుమలకు రోజు లకు పైగా ద్విచక్ర వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రధానంగా స్థానికులు, టీటీడీ ఉద్యోగులు, వ్యాపారులు ద్విచక్ర వాహనాలలో తిరుపతి నుంచి తిరుమలకు వచ్చి వెళుతుంటారు. రాత్రి పది గంటల వరకు కూడా ద్విచక్ర వాహనాల రాకపోకలు సాగుతూ ఉంటాయి. అలాంటిది సాయంత్రం ఏడు గంటల తర్వాత ద్విచక్ర వాహనాలు ఆపివేస్తే ఇబ్బందులు ఎదురవుతాయని స్థానికులు, ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

ఇక నడక దారిలో అర్ధరాత్రి వరకు కూడా భక్తులు ప్రయాణిస్తుంటారు. వాతావరణం చల్లగా ఉంటుందన్న కారణంగా ఉదయం, సాయంత్రం పూట నడవడానికి ఆసక్తి చూపుతుంటారు. అటువంటిది సాయంత్రం 8 గంటల తరువాత నడక దారిలో భక్తులను అనుమతించుకుంటే ఇబ్బందులు ఎదురవుతాయి. రోజు వేలమంది భక్తులు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది.

అయినా అడవి జంతువులు దాడి చేస్తున్నాయన్న పేరుతో తిరుమలకు భక్తుల రాకపోకలను నియంత్రించాలని అనుకోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అడవి జంతువులు పగటిపూట కూడా భక్తులపై దాడి చేసే అవకాశం ఉంటుంది. అందుకే భక్తుల రాక పోకలను నియంత్రించడం గాక… ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచిస్తున్నారు. అటు నడకదారిలో అయినా, ఇటు ఘాట్ రోడ్డులో అయినా అక్కడక్కడ భద్రతా సిబ్బందిని నియమిస్తే ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. అదేవిధంగా వాహనాలు ఒంటరిగా కాకుండా గుంపులుగా పంపడం వల్ల అడవి జంతువులు దాడి చేసే అవకాశం ఉండదని అంటున్నారు.

దశాబ్దాలుగా తిరుమల కాలిబాటలో, అదేవిధంగా ఘాట్ రోడ్డులో కోట్ల మంది భక్తులు ప్రయాణించినా…. ఇప్పటిదాకా వన్యమృగాలకు ఒకరైనా బలైన ఉదంతాలు లేవని, ఎప్పుడో ఒకప్పుడు జరిగే చిన్న చిన్న ఘటనలతో తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడం సరైనది కాదని భక్తులు అభిప్రాయపడుతున్నారు.

తిరుమల కనుమదారిలో, నడక దారిలో కనిపించే కోతుల కోసం భక్తులు అరటి పండ్లు వంటి ఆహారం వేస్తున్నారు. ఈ ఆహారం కోసం పందులు వంటి అడవి జంతువులు వస్తున్నాయి. ఈ జంతువులను వేటాడేందుకు చిరుత పులులు వస్తున్నాయి. భక్తులు ఎక్కడపడితే అక్కడ ఆహారం వేయకుండా నియంత్రించగలిగితే… చిరుతల రాకను అడ్డుకోవచ్చని అటవీ అధికారులు చెబుతున్నారు. ఈ అంశం పైన టీటీడీ దృష్టి సారించాల్సిన అవసరం కనిపిస్తోంది.

అటవీ అధికారులు ఎన్నైనా చెప్పవచ్చు కానీ… తిరుమలకు ఉన్న ప్రాధాన్యత, రద్దీని దృష్టిలో ఉంచుకొని టీటీడీ అధికారులు ఎన్ని తీసుకోవలసిన అవసరం ఉంది. సాధ్యమైనంతవరకు భక్తులకు ఇబ్బంది లేకుండా, భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి. అంతేగాని రాకపోకలపై నే ఆంక్షలు విధిస్తే తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కోక తప్పదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*