టిటిడిలో హౌస్ బిల్డింగ్‌ లోన్‌ మాయాజాలం..! దళారుల మోసానికి ఉద్యోగులకు శిక్ష..!!

  • నకిలీ డాక్యుమెంట్లతో చాలామందికి రుణాలు
  • చక్రం తిప్పిన దళారులు
  • అమాయకులైన కింది స్థాయి ఉద్యోగులే టార్గెట్‌
  • విచారణలో దొరికిపోయిన ఉద్యోగుల అవస్థలు
  • పెన్షన్‌ సెటిల్‌ కాకుండా ఇబ్బందులు

తిరుమల తిరుపతి దేవస్థానంలో అవకతవకలకు కొదువేలేదు. తవ్వేకొద్దీ అవినీతి అక్రమాలు వెలుగు చూస్తూనే ఉంటాయి. తాజాగా హౌస్‌ బిల్డింగ్‌ లోన్‌ (హెచ్‌బిఎల్‌) పేరుతో జరిగిన మాయాజాలం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇల్లు కట్టకుండానే హౌస్‌ బిల్డింగ్‌ లోన్‌ కింద లక్షలాది రూపాయలు మంజూరు చేయించుకుని ఇతర ఖర్చులకు వాడేసుకున్నారు కొందరు ఉద్యోగులు. ఈ వ్యవహారంలో చక్రం తిప్పిన కొందరు దళారులు….లక్షలు సులువుగా లక్షలు సంపాదించుకున్నారు. ఈ మాయ బయటపడటంతో ఉద్యోగులు ఇబ్బందిపడుతున్నారు.

టిటిడి తమ ఉద్యోగులకు హౌస్‌ బిల్డింగ్‌ లోన్‌ మంజూరు చేస్తుంది. ఎవరైనా ఉద్యోగులు ఇల్లు కట్టుకున్నా, కొనుగోలు చేసినా…..సంబంధిత డాక్యుమెంట్లను సమర్పించి లోన్‌ తీసుకోవచ్చు. దీన్ని ఆసరా చేసుకుని కొందరు దళారులు టిటిడి ఉద్యోగులపై వల విసిరారు. కింది స్థాయిలో పనిచేసే అమాయకులైన ఉద్యోగులను ప్రత్యేకించి అప్పుల్లో కూరుకుపోయిన వారిని, వ్యసనాలకు బానిసలుగా మారిన వారిని గుర్తిస్తారు. మీరు ఇల్లు కట్టకుండానే లక్షల రూపాయల హౌస్‌ బిల్డింగ్‌ లోను ఇప్పిస్తామని చెబుతారు. రెండున్నర లక్షలు లోన్‌ వస్తే అందులో రూ.50 వేల నుంచి లక్ష దాకా తమకు ఇవ్వాలని షరతు పెడతారు. దీనికి అంగీకరించిన వారి పేరుతో నకిలీ డాక్యుమెంట్లను ఆ దళారులే సృష్టిస్తారు. తిరుపతి ప్రాంతంలో ఎక్కడైనా ఇళ్ల నిర్మాణం జరుగుతుంటే….ఆ ఇంటి వద్ద సదరు ఉద్యోగిని నిలబెట్టి ఫొటోలు తీస్తారు. వాటిని టిటిడిలో సమర్పిస్తారు. దీంతో లోను మంజూరైపోతుంది.

ఈ విధంగా దళారులు వందల మందికి హౌస్‌ బిల్డింగ్‌ లోను మంజూరు చేయించినట్లు తెలుస్తోంది. సాధారణంగా లోను కోసం ఉద్యోగులు సమర్పించే డాక్యుమెంట్లను పరిశీలించిన తరువాతే లోను మంజూరు చేయాల్సివుంటుంది. అయితే….లోను మంజూరు చేసే స్థానంలో ఉన్న కొందరు ఉద్యోగులు దళారుల నుంచి తృణమో ఫణమో తీసుకుని డాక్యుమెంట్లను చూసీచూడకుండా రుణాలు మంజూరు చేసినట్లు తెలుస్తోంది. తిరుపతి ప్రాంతంలో 10 మందికిపైగా దళారులు ఇదే పని చేసి లక్షలు ఆర్జించినట్లు సమాచారం.

ఈ వ్యవహారం చాలా ఏళ్ల క్రితమే రట్టయింది. విచారణ జరపగా 2010-11లోనే 100 మందికిపైగా బోగస్‌ పత్రాలతో రుణాలు పొందినట్లు తేలింది. విచారణలో తప్పించుకున్నవారూ చాలామందే ఉంటారని తెలుస్తోంది. అదలావుంచితే….బోగస్‌ పత్రాలతో రుణాలు తీసుకున్నవారిపైన టిటిడి చర్యలు తీసుకుంది. రుణంగా తీసుకున్న మొత్తాన్ని రికవరీ చేసింది. అదేవిధంగా కొందరిని ఒక ఇంక్రిమెంట్‌ కట్‌ చేసింది. ఇప్పుడు సమస్య ఏమంటే…..అప్పట్లో తెలిసో తెలియకో బోగస్‌ పత్రాలతో రుణాలు తీసుకున్న చాలా మంది రిటైర్‌ అయ్యారు. అయితే….వారికి ఉద్యోగ విరమణానంతర ప్రయోజనాలేవీ రాలేదు. పెన్షన్‌ సెటిల్‌ కాలేదు. దీంతో వారంతా టిటిడి ఉన్నతాధికారుల చుట్టూ తిరుగుతున్నారు.

అమాయకులను అడ్డుపెట్టుకుని లక్షలు సంపాదించుకున్న దళారులు దర్జాగా వుండగా…వాళ్లను నమ్మి రుణాలు తీసుకుని, దొరికిపోయి వడ్డీతో సహా తిరిగి చెల్లించినా ఇప్పుడు పెన్ఫన్‌ సెటిల్‌ కాకుండా ఇబ్బందిపడుతున్నారు ఉద్యోగులు. కొందరికి ఒక ఇంక్రిమెంట్‌ కట్‌ చేసి క్రమశిక్షణ చర్యలు పూర్తిచేసిన అధికారులు…మరి కొందరి విషయంలో మాత్రం చర్యలపై నాన్చుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఉద్యోగ విరమణ చేసినవారు కుటుంబాలు గడవక, పెన్షన్‌ సెటిల్‌మెంట్‌ కోసం టిటిడి పరిపాలనా భవనం చుట్టూ తిరుగుతున్నారు. తమపై తీసుకునే చర్యలేవో తీసుకుని, తమకు రావాల్సిన ప్రయోజనాలను ఇవ్వాలని వారు కోరుతున్నారు. చిన్న విషయంలో విచారణకు పదేళ్ల సమయం తీసుకోవడం ఏమిటని ఆవేదన‌ వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ విరమణ చేసినవారిలో ఇప్పటికే కొందరు చనిపోయారు. అయినా ఆ కుటుంబాలకు ఇవ్వాల్సిన ప్రయోజనాలు అందలేదు. ఇప్పటికైనా టిటిడి ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కరించాల్సిన అవసరం ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*