టిటిడిలో మిలిటరీని మించిన రూల్స్‌! ఉద్యోగులకు ప్రతిక్షణమూ టెన్షనే!

టిటిడిలో పని చేయడం కంటే…మిలటరీలో పని చేయడం మేలు…అనుకునేలా ఉన్నాయి ఇక్కడ జరుగుతున్న ఉదంతాలు. యాత్రీకుల క్యూకాంప్లక్స్‌లో ఫ్యాన్‌ అర్థగంట పాటు పని చేయలేదనే కారణంగా ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్‌ చేశారు ఉన్నతాధికారులు. ఫ్యాన్‌ స్విచ్‌ వేయడంలో అలక్ష్యం చేశారని ఈ చర్యలు తీసుకున్నారు. సస్పెన్షన్‌కు గురియిన ఉద్యోగుల్లో ఒకరు తీవ్ర అస్వస్థతకు గురయి ఆస్పత్రిలో చేరారు. ఫ్యాన్‌ స్విచ్‌ వేయనందుకే ఉద్యోగిని సస్పెండ్‌ చేసిన చరిత్ర భారత దేశంలో మరే ప్రభుత్వ విభాగంలోనూ జరిగివుండదేమో. ఆ రోజు డ్యూటీలో లేని ఉద్యోగినీ సస్పెండ్‌ చేయడం మరీ విచిత్రం. దీంతో కడుపు మండి ఆందోళనకు దిగుతామని ఉద్యోగులు హెచ్చరించడంతో…గంటల వ్యవధిలోనే ఆ ఉత్తర్వులను టిటిడి ఉపసంహరించుకుంది.

ఇది ఒక ఉదాహరణ మాత్రమే. టిటిడి పని చేయడం ఉద్యోగులకు కత్తిమీద సాములా మారుతోంది. క్షణం క్షణం టెన్షన్‌తో పని చేయాలని దుస్థితి. ఎవరు ఎలాంటి ఫిర్యాదు చేస్తారో, ఏ రోజు సస్పెడ్‌ అవుతామో తెలియని పరిస్థితి. ఒకప్పుడు 30 వేల మంది – 40 వేల మంది దర్శనానికి వచ్చేటప్పుడు టిటిడిలో 16 వేల మంది ఉద్యోగులు ఉండేవారు. ఇప్పుడు రోజూ 70 వేల మందికిపైగా వస్తున్నారు. సెలవు రోజులు, విశేషదినాలలో లక్ష మందికిపైగా వస్తున్నారు. అయితే ఇప్పుడు ఉన్నది మాత్రం రెగ్యులర్‌ ఉద్యోగులు తొమ్మిది వేల మంది మాత్రమే. అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు కింద 13,500 మంది ఉన్నారు. మొత్తంగా చూసినా 23 వేల మంది ఉంటారు. ఈ సంఖ్య విద్యాసంస్థలు, వైద్యశాలలు, కల్యాణమండపాలు, పరిపాలనా భవనం వంటివి అన్నింటనీ కలుపుకుంటేనే. ఇక భక్తుల సేవ కోసమే కేటాయించిన ఉద్యోగుల 3వేలు – 4 వేలకు మించరు. లక్ష మందికి సేవలు అందించాలంటే ఈ సంఖ్య ఏమాత్రం సరిపోదు. ఉదాహరణకు గదుల నిర్వహణ తీసుకుందాం. ఒక్కో అటెండరు కనీసం 100 గదులు చూసుకోవాలి. యాత్రికుడు సిఆర్‌వో ఆఫీసులో గది కేటాయింపు లేఖ తెస్తే….గది చూపించాలి. గది ఖాళీ చేసి వెళుతున్నప్పుడు గదిని తనిఖీ చేసుకోవాలి. తాళీలు తీసుకోవాలి. ఖాళీ అయిన గదులను శుభ్రం చేయించాలి. ఒక అటెండరు 20 – 30 గదులను మించి చూసుకోలేరు. అయినా తిరుమలలో 100 గదులకు ఒకరినే ఇస్తున్నారు. ఇక ఆలయం లోపలా సిబ్బంది కొరత తీవ్రంగా ఉంటుంది. భక్తులు చిన్న ఫిర్యాదు చేయకూడదు ఆగమేఘాలపై చర్యలు తీసుకుంటారు. ఫ్యాన్‌ స్విచ్‌ వేయకపోవడం చర్యలు తీసుకోవాల్సినంత తప్ఫా? అయినా కిందిస్థాయి ఉద్యోగులపై అజమాయిషీ పేరుతో ఇవువంటి చర్యలకు పూనుకుంటున్నారు. ఇక అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు కార్మికులకు దినదినగండమే. ఆ మధ్య కల్యాణకట్టలో ఒకేసారి 400 మందిని ఒక్కసారిగా తొలగించారు. గుండుగీసినపుడు….భక్తులు సంతోషంతోనో, సంప్రయాదాన్ని పాటిస్తూనో ఇచ్చే నాలుగు రూపాయలు తీసుకున్నందుకు ఇటువంటి చర్యలు తీసుకున్నారు. ఇలాంటివి ఎన్నో…! టిటిడిలో ఏడువేలకుపైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయమని ఎప్పటి నుంచో టిటిడి ఉద్యోగ సంఘాలతో పాటు రాయలసీమ ప్రాంత నిరుద్యోగులు కోరుతున్నారు. టిటిడిలో ఒక ఉద్యోగి రిటైర్‌ అవుతున్నారంటే ఇక ఆ పోస్టు భర్తీ చేయరు. అందుకే ఉన్న ఉద్యోగులపై పనిభారం పెరిగిపోతోంది. ఈ ఒత్తిడి తట్టుకోలేక…గుండె జబ్బులకు గురయి మరణిస్తున్నవారి సంఖ్య ఇటీవల కాలంలో పెరుగుతోంది. టిటిడి పరిపాలనా భవనం ఎదుట ‘ఆకస్మిక మరణం’ అంటూ ఏ రోజు ఏ ఉద్యోగి ఫొటో చూడాల్సివస్తుందో తెలియదు.

టిటిడిని ఒక విధంగా సున్నితంగా మార్చేస్తున్నారు. అది అన్ని ప్రభుత్వ విభాగాలు వంటిది కాదన్నట్లు వ్యవహరిస్తున్నారు. మీడియా కూడా ఇందుకు కారణం అవుతోంది. ఇక్కడ జరిగే ప్రతి చిన్న విషయాన్నీ సంచలనం చేసేస్తున్నారు. దీని ప్రభావం ఉద్యోగులపైన పడుతోంది. ఫ్యాన్‌ స్విచ్‌ ఆన్‌ చేయనందుకే ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్‌ చేస్తే…పెద్ద పెద్ద అధికారులు ఇక్కడ చేస్తున్న తప్పిదాలకు ఎంత పెద్ద శిక్ష వేయాలని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇదే విధానాన్ని ఉన్నతాధికారులకూ వర్తింపజేస్తే టిటిడిలో ఒక్క అధికారి కూడా మిగలరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు టిటిడిలో ఉద్యోగ సంఘాలు బలంగా ఉండేవి. కరుణాకర రెడ్డి ఛైర్మన్‌గా ఉన్నప్పుడు గుర్తింపు సంఘ ఎన్నికలూ నిర్వహించారు. ఇటీవల కాలంలో ఉద్యోగ సంఘాలు చాలా బలహీనపడ్డాయి. దీనికి కారణం….దేవుడు, భక్తులు అంటూ ఉద్యోగులు గొంతెత్తకుండా నొక్కేస్తున్నారు. అందుకే ఇటీవల కాలంలో అనేక సమస్యలు వస్తున్నాయి. ఆ మధ్య వైకుంఠ ఏకాదశి రోజు ఉద్యోగులను ఆలయంలోకి వెళ్లనీకుండా కట్టడి చేశారు.దర్శనం కోసం వెళితే అవమానకరంగా మాట్లాడారు. ‘ఐడి నెంబరు నోట్‌ చేసుకో…అతని సంగతి తరువాత చూద్దాం’ అంటూ బెదిరించారు. అప్పుడే ఉద్యోగులు భగ్గుమన్నారు. ఇకపై ఇలాంటివి పునరావృతం కానీయబోమని ఈవో హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించుకున్నారు. కానీ…ఇప్పుడు ఇంకో పద్ధతిలో ఉద్యోగుల పట్ల ఉన్న చిన్నచూపును, లెక్కలేనితనాన్ని బయటపెట్టుకున్నారు. ఇంకా ఉద్యోగులకు కేటాయించే దర్శనం టికెట్లు, గదులను రద్దు చేసేశారు. దీనిపైనా ఉద్యోగులు పోరాడాల్సివచ్చింది. గతంలో సమస్య పరిష్కారం ఆందోళన చేసిన ఉద్యోగ సంఘాల నాయకులను శంకరగిరి మాన్యాలు పట్టించి వేధించిన చరిత్ర ఉంది. అందుకే ఉద్యోగుల సంఘాల నాయకులు బెదిరిపోతున్నారు. మానవత్వంతో పరిష్కరించాల్సిన సమస్యనూ అత్యంత కఠినంగా పరిగణిస్తున్నారు. అందుకే ఈ సమస్యలు.

టిటిడిలో లెక్కకు మించి ఉద్యోగ సంఘాలున్నాయి. విభాగాల వారీగా, క్యాడర్‌ల వారీగా, కులాల వారీగా అనేక సంఘాలున్నాయి. ఏదైనా సమస్య వచ్చినపుడు ఎవరో ఒకరు చొరవతీసుకుని, అందరినీ పిలిచి మాట్లాడాల్సివస్తోంది. అలాకాకుండా గుర్తింపు సంఘం అంటూ ఒకటి ఉంటే…ఉద్యోగుల తరపున మాట్లాడే అవకాశం ఉంటుంది. ఆర్‌టిసి, సింగరేణి వంటి సంస్థల్లో ఉద్యోగులకు గుర్తింపు సంఘాలున్నాయి. క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహిస్తుంటారు. ఆధ్యాత్మిక సంస్థ అనే పేరుతో టిటిడిలో ఎన్నికలు నిర్వహించడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వమూ, టిటిడి పాలక మండలి, ఉన్నతాధికారులు ఆలోచించాల్సింది ఏమంటే…ఉద్యోగులపై పని భారం తగ్గించాలి. భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్య పెంచాలి. అన్నింటికంటే మించి…ఉద్యోగులతో స్నేహపూరిత వాతావరణంలో పని చేయించుకోవాలి. ఉద్యోగులను సంస్థలో భాగంగా చూడాలి. ఇదే సమయంలో ఉద్యోగ సంఘాలు ఐక్యంగా ఉండాలి. అవుట్‌ సోర్సింగ్‌, కాంక్రాక్టు కార్మికులనూ కలుపుకుని హక్కులు, సదుపాయల సాధన కోసం పని చేయాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*