టిటిడిలో రాజులు మారినా…సామంతులు మారరు..!

  • లోకల్‌ అడ్వయిజరీ కమిటీలు ఉన్నాయా..రద్దయ్యాయా…

రాష్ట్రంలో ప్రభుత్వం మారింది…దీంతో టిటిడి పాలకులూ మారారు. గత ప్రభుత్వం నియమించిన టిటిడి ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ సహా సభ్యులంతా రాజీనామా చేశారు. ఆ స్థానంలో కొత్త ఛైర్మన్‌గా వైవి సుబ్బారెడ్డి నియమితులయ్యారు. ఒకటి రెండు రోజుల్లో సభ్యుల నియామకమూ జరగనుంది. అయితే….దేశంలోని వివిధ ప్రాంతాల్లో టిటిడి నిర్మించిన శ్రీవారి ఆలయాల పర్యవేక్షణ కోసం ఏర్పాటైన లోకల్‌ అడ్వయిజరీ కమిటీలు (ఎల్‌ఏసిలు) మాత్రం మారలేదు. ఆ కమిటీలను మార్పుతారో లేదో కూడా తెలియడం లేదు. ఈ కమిటీల పనితీరు మాత్రం వివాదాస్పదం అవుతోంది. ఢిల్లీలోని కమిటీ నిబంధనలకు విరుద్ధంగా కోట్లాది రూపాయలు ఖర్చుచేసినట్లు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎల్‌ఏసిల గురించి ధర్మచక్రం ప్రత్యేక కథనం.

ఢిల్లీ, చెనై, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లోని టిటిడి ఆలయాల నిర్వహణ పేరుతో ఏర్పాటు చేసిన లోకల్‌ అడ్వయిజరీ కమిటీలు (ఎల్‌ఏసి) మొదటి నుంచీ వివాదాస్పదంగానే ఉన్నాయి. తమ పలుకుబడితో ఈ కమిటీల్లో స్థానం దక్కించుకున్న బడా పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు టిటిడి అధికారులు, ఉద్యోగులపైనే పెత్తనం చేస్తున్న పరిస్థితులు వస్తున్నాయి. దీనికి టిటిడి పాలక మండలే ఆస్కారం కల్పిస్తోంది. దీంతో టిటిడి ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహం, నిరసన వ్యక్తమవుతున్నాయి.

టిటిడికి దేశ వ్యాపితంగా ఆలయాలు, ప్రార్థనా మందిరాలు ఉన్నాయి. ఇంకా కొత్త ఆలయాలను నిర్మిస్తోంది. దేశంలో ఎక్కడెక్కడో ఉన్న ఆలయాలను తిరుపతి నుంచి పర్యవేక్షించడం కష్టమనే పేరుతో ఎక్కడికి అక్కడ లోకల్‌ అడ్వయిజరీ కమిటీలు – స్థానిక సలహా మండళ్లు ఏర్పాటు చేయాలని 2011లో నిర్ణయించింది. అక్కడి ఆలయాల అభివృద్ధికి సంబంధించి ఏమి చేయాలో సలహాలు ఇవ్వడం వరకే ఈ కమిటీలు పరిమితమని స్పష్టంగా అప్పట్లో నిర్ణయించారు. అయితే రానురానూ స్థానిక ఆలయాలు ఈ కమిటీల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. సాధారణంగా అన్ని ఆలయాలకు టిటిడి అధికారులైన డిప్యూటీ ఈవోలుగానీ, ఏఈవోలుగానీ ఉంటారు. సలహా మండళ్లు వీరికి సహాయకారిగా మాత్రమే ఉండాలి.

అధికారాలన్నీ కట్టబెట్టి… : స్థానిక సలహా మండళ్లకు అపరిమితమైన అధికారాలు ఇస్తూ ఇటీవల టిటిడి పాలక మండలి నిర్ణయం తీసుకుంది. అక్కడి ఆలయాల్లో ఏమి చేయాలన్నా ఈ కమిటీలదే తుది నిర్ణయం. ఆలయంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఈ కమిటీ ముందుగా నిర్ణయాలు చేయాలి. ఆలయ అవసరాలనుబట్టి అర్చకులను, ఉద్యోగులను నియమించుకునే అధికారం కమిటీకి ఉంటుంది. ఈ కమిటీకి ప్రత్యేక బ్యాంకు అకౌంట్‌ పెడుతున్నారు. ఈ ఖాతా నుంచి అక్కడి ఖర్చులు పెట్టుకోవచ్చు. స్థానిక ఆలయాల్లోని దేవుళ్లకు ఎవరైనా ఆభరణాలు ఇవ్వాలన్నా ముందుగా ఈ కమిటీలనే సంప్రదించాలి. టిటిడి డిప్యూటీ ఈవో అయినా, ఏఈవో అయినా, ఇతర ఉద్యోగులైనా కమిటీ ఛైర్మన్‌ పెత్తనం కిందే పని చేయాలి. ఇటువంటి అధికారాలను కల్పిస్తూ టిటిడి నిర్ణయం తీసుకుంది.

సామంతులు కాదు…సర్వ స్వతంత్రులు : వ్యాపారి-గుర్రం కథలాగా టిటిడిలోకి కొంచెం కొంచెంగా ప్రవేశించి టిటిడి అధికారులకే చోటు లేకుండా ఆక్రమించుకుంటున్నారు ఈ కమిటీ ఛైర్మన్లు. ఇందుకు ఉదాహరణ చెన్నై అడ్వయిజరీ కమిటీనే. ఈ కమిటీ ఛైర్మన్‌ ఆ మధ్య టిటిడికి ఒక నోటు సమర్పించారు. దాని ప్రకారం…లోకల్‌ అడ్వయిజరీ కమిటీ (ఎల్‌ఏసి) పేరును టిటిడి తమిళనాడు అడ్వయిజరీ కమిటీగా మార్చాలని కోరారు. కన్యాకుమారిలోనూ టిటిడి ఆలయం నిర్మించారు. దానికి ప్రత్యేక కమిటీ వేయకుండా చూసేందుకు ఈ ప్రతిపాదన చేశారు. అంటే తమిళనాడులో ఎక్కడ టిటిడి ఆలయాలు, విద్యాసంస్థలు, కల్యాణమండపాలు ఏవి ఉన్నా…ఈ కమిటీకే అధికారాలు ఉంటాయన్నమాట. సలహా మండలి సభ్యులకు తిరుమలలో ప్రత్యేక దర్శనానికి ఎలాంటి వెసులుబాటులూ లేవు. సలహా మండలి సభ్యులకు ప్రత్యేక దర్శనం కల్పించాలంటూ డిమాండ్‌ తీసుకొచ్చారు. 2011లో కమిటీలు ఏర్పాటు చేసినపుడు…ఏ కమిటీ కూడా మీడియా ముందుకు వెళ్లి సమావేశాలు నిర్వహించకూడదని ఉంది. కానీ ఇప్పుడు ఈ లోకల్‌ కమిటీలే టిటిడి పాలక మండళ్లు అయినట్లు ఫోజుపెడుతూ విలేకరుల సమావేశాలూ నిర్వహిస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే…తాము సామంతులం కాదని…సర్వస్వతంత్రులం అనే విధంగా వ్యవహరిస్తున్నాయి. దీనికి టిటిడి బోర్డు కూడా తలూపుతోంది.

ఉద్యోగులపైనా పెత్తనం : అసలు ఈ లోకల్‌ కమిటీలను ఏ చట్ట ప్రకారం నియమించారని టిటిడి ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. టిటిడి పాలక మండలి ఏర్పాటు చట్టప్రకారం జరుగుతుంది. టిటిడి మొత్తానికి ఒకటే పాలక మండలి. ఆలయానికొక పాలక మండలి అనేది చట్టంలో ఎక్కడా లేదు. నిధులు ఖర్చు చేసే అధికారం పాలక మండలికి తప్ప ఎవరికీ లేదు. కానీ ఇప్పుడు ఏకంగా సలహా మండళ్ల పేరుతోనే అకౌంట్స్‌ తెరవడానికి సిద్ధమయ్యారు. అదేవిధంగా టిటిడి ఉద్యోగులు ఈ కమిటీల పెత్తనం కింద పని చేయాల్సివస్తోంది. డిప్యూటీ ఈవోలు, ఏజీవోలు నామమాత్రంగా మిగిలిపోతున్నారు. అవసరమైతే ఇంకొంతమంది అధికారులను ఆయా ఆలయాల వద్ద నియమించవచ్చు. అంతేగానీ… సలహా మండళ్ల పేరుతో ఎవరికో పెత్తనం ఇవ్వడం తగదని అంటున్నారు. టిటిడి లోకల్‌ కమిటీలకు ఇచ్చిన అపరిమితమైన అధికారాలను వెనక్కి తీసుకోవాలని టిటిడి ఉద్యోగ సంఘాలు మొదటి నుంచి డిమాండ్‌ చేస్తున్నాయి.

కమిటీల్లో సభ్యులుగా బడా పారిశ్రామికవేత్తలు, వ్యాపారులే…: టిటిడి ఏర్పాటు చేస్తున్న స్థానిక సలహా మండళ్లు పలుకుబడి కలిగిన వారికి సామాజిక హోదా కల్పించడానికి సాధనాలుగా మారుతున్నాయి. రాజకీయ పలుకుబడి కలిగిన వారు ప్రభుత్వంపై ఒత్తిడి చేసి సభ్యులుగా నియమితులవుతున్నారు. టిటిడి నిబంధనల ప్రకారం ఒక్కో సభ్యుడు వరుసగా రెండు పర్యాయాలకు మించి ఉండకూడదు. మొత్తం సభ్యుల్లో 50 మంది కొత్తవాళ్లు రావాలి. ఇటువంటి నిబంధనలున్నాయి. టిటిడి బోర్డులో సభ్యత్వం ఎంత ప్రతష్టాత్మకమైనదో…ఈ సలహా కమిటీల సభ్యత్వమూ అంత ప్రతిష్టాత్మకంగా మార్చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని ఆలయాల్లో జరిగే ఉత్సవాల్లో టిటిడి ఛైర్మన్‌ పాల్గొనే వీలుండదు. అక్కడ సలహా మండలి ఛైర్మనే టిటిడి ఛైర్మన్‌లాగా వ్యవహరిస్తున్నారు. సాధారణ భక్తులతో కమిటీలు ఏర్పాటు చేస్తే అర్థం చేసుకోవచ్చుగానీ…రాజకీయ ఒత్తిళ్లతో అత్యంత పలుకుబడి కలిగిన, కోటీశ్వరులైన వారినే సభ్యులుగా నియమిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

ఈ కమిటీలు ఉన్నాయా..రద్దయ్యాయా…: గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటయిన లోకల్‌ అడ్వయిజరీ కమిటీలు ఉన్నాయా లేక రద్దయ్యాయా అనేది తెలియడం లేదు. ఈ కమిటీలు ఈవో ఆదేశాలతో ఉనికిలోకి వస్తున్నాయి. అందువల్ల వాటిని రద్దు చేసే అధికారం కూడా ఈవోకే ఉంటుంది. ప్రభుత్వం మారిన నేపథ్యంలో, కొత్త బోర్డు ఏర్పాటైన పరిస్థితుల్లో లోకల్‌ అడ్వయిజరీ కమిటీలనూ పున: వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉంది.

– ఆదిమూలం శేఖ‌ర్‌, సంపాద‌కులు, ధ‌ర్మ‌చ‌క్రం వార‌ప‌త్రిక‌

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*