టిటిడిలో సమూల మార్పులు..! త్వరలో కొత్త అధికారులు..!!

ప్రభుత్వం మారిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి)లో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఉన్నత స్థాయి అధికారులతో పాటు….కీలకమైన స్థానాల్లో ఉన్న అధికారుల బదిలీకి రంగం సిద్ధమవుతోంది. జులై మొదటి వారంలో మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ టిటిడికి వచ్చి ఏడాది అవుతోంది. ప్రభుత్వం మారడంతో ఆయన బదిలీ తప్పకపోవచ్చునని భావించారు. అయితే….బిజెపి నేతల ద్వారా సింఘాల్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి చెప్పించుకున్నారని, అందువల్ల ఇంకో ఏడాది పాటు సింఘాల్‌నే కొనసాగించే అవకాశాలున్నాయని వార్తలొచ్చాయి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందురోజు జగన్‌ మోహన్‌ రెడ్డి శ్రీవారి దర్శనానికి వచ్చారు. అప్పుడు జగన్‌ ఈవోను తన కారులో ఎక్కించుకున్నారు. ఈవో కొనసాగుతారని చెప్పడానికి దీన్ని కూడా ఉదాహరణగా చూపించారు.

తాజాగా అందుతున్న సమాచారం ఏమంటే…ఈవో కూడా బదిలీ కానున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు. రమణ దీక్షితులు వివాదం ముసురుకున్నప్పుడు… వైసిపిలో జగన్‌ తరువాత రెండో స్థానంలో ఉన్నట్లు చెబుతున్న విజయసాయిరెడ్డి కొన్ని విమర్శలు చేశారు. దీంతో దీక్షితులుతో పాటు విజయసాయిరెడ్డిపైనా కేసులు పెట్టారు. ఈ వ్యవహారంలో ఈవో సింఘాల్‌ ఏకపక్షంగా వ్యవహరించారన్న ఆగ్రహం వైసిపిలో, ప్రత్యేకించి విజయసాయిరెడ్డిలో ఉంది. ఈ నేపథ్యంలో సింఘాల్‌ను బదిలీ చేయాలన్న నిర్ణయానికి జగన్‌ వచ్చినట్లు తెలుస్తోంది.

ఇక దీర్ఘకాలంగా తిరుమల జెఈవోగా పని చేస్తున్న శ్రీనివాసరాజుకు కూడా బదిలీ తప్పేలా లేదు. ఇప్పటికే ఎనిమిది సంవత్సరాలుగా ఆయన ఆ పోస్టులో కొనసాగుతున్నారు. ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు మారిన శ్రీనివాసరాజు స్థానం మాత్రం పదిలంగా ఉంది. టిటిడి వ్యవహారం ఏదైనా చర్చకు వస్తే….మొట్టమొదట శ్రీనివాసరాజు విషయమే ప్రస్తావనకు వస్తోంది. శ్రీనివాసరాజును బదిలీ చేయకుండా…ఎంతమందిని బదిలీ చేసినా ప్రభుత్వం విమర్శలు ఎదుర్కోక తప్పని పరిస్థితి. అందుకే…ఆయన్ను అక్కడి నుంచి కదిలించాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది.

ఇదే సమయంలో….ఈవో పోస్టుకుగానీ, తిరుమల జెఈవో పోస్టుకుగానీ పోటీ తీవ్రంగా ఉంటుంది. వైసిపి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ఐఏఎస్‌ల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉంది. ఈ రీత్యా కూడా ఈ ఇద్దరు అధికారులకు బదిలీ తప్పేలా లేదు.

ఇక తిరుపతి జెఈవో లక్ష్మీకాంతం ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ పోస్టులోకి ఎటూ కొత్త అధికారి వస్తారు. మొత్తంగా మూడు కీలక పోస్టుల్లోకీ రోజులు, నెలల తేడాలో కొత్త అధికారులు వస్తారనడంలో సందేహం లేదు.

ఇదిలావుండగా….డిప్యుటేషన్‌పై టిటిడిలో పని చేస్తున్న అధికారులకూ స్థాన చలనం తప్పేలా లేదు. హెల్త్‌ ఆఫీసర్‌, టిటిడి ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌, కొందరు డిప్యూటీ ఈవోలు, ఓఎస్‌డిల పేరుతో కొందరు పని చేస్తున్నారు. అదేవిధంగా నిఘా, భద్రతా విభాగంలో చాలా మంది పోలీసు అధికారులు డిప్యుటేషన్‌పై పని చేస్తున్నారు. ఇటువంటి అన్ని పోస్టుల్లోకి కొత్తవాళ్లు రాబోతున్నారు. ఆయా పోస్టుల్లో పని చేయడానికి ఆసక్తి చూపుతున్నవారు ఇప్పటికే అమరావతిలో పావులు కదుపుతున్నారు.

మరో కొత్త అంశం ఏమంటే….చీఫ్‌ ఇంజినీర్‌ పోస్టులోకి డిప్యుటేషన్‌ ఇంజినీర్‌ రానున్నట్లు చెబుతున్నారు. టిటిడిలో ఇంజినీరింగ్‌ పనుల్లో ఉన్న ప్రాధాన్యత రీత్యా ప్రభుత్వం నుంచి చీఫ్‌ ఇంజినీర్‌ను తీసుకొస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం సిఇగా ఉన్న చంద్రశేఖర్‌ రెడ్డి త్వరలో ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆ తరువాత ఈ పోస్టుకు డిప్యుటేషన్‌ ఉంటుంది. పిఆర్‌ఓ విభాగానికి సంబంధించి….చీఫ్‌ పిఆర్‌ఓ ఒకరిని నియమిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటిదాకా టిటిడిలో అటువంటి పోస్టు లేదు. గతంలో పిఆర్‌ఓ పోస్టుకే….డిప్యుటేషన్‌ తీసుకొచ్చిన ఉదంతాలున్నాయి.

ఎస్‌విబిసితో పాటు కొన్ని పోస్టుల్లోకి వచ్చేందుకు పలువురు సీనియర్‌ పాత్రికేయులూ పావులు కదుపుతున్నారు. ఇటువంటి వారిలో ముగ్గురు జర్నలిస్టులు వివిధ పోస్టుల్లోకి వచ్చే అవకాశం ఉంది.

టిటిడికి సంబంధించినంత వరకు….టిటిడిలో జులై నెలలో భారీ మార్పులు జరిగనున్నాయి. అనేక కొత్త ముఖాలు కీలక స్థానాల్లో కనిపించనున్నాయి. టిటిడి ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన రోజే వైవి సుబ్బారెడ్డి తిరుమలలో మాట్లాడుతూ…. టిటిడిలో సమూల ప్రక్షాళన జరుగుతుందని చెప్పారు. అందుకే ముఖ్యమంత్రి తనను ఛైర్మన్‌గా నియమించారని చెప్పారు. ఈ ప్రక్షాళన ఎలావుంటుందో జులైలో తేలిపోనుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*