టిటిడిలో సిఎం‌ ఆదేశాలు అమలు కావడం లేదా…అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారా..!

ఎక్కడైనా ప్రజాప్రతినిధులకు దారిచూపి నడిపించేది అధికారులే. అందుకే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆ మధ్య జిల్లా కలెక్టర్లు, ఎస్పీలే తనకు కళ్లూ చెవులని చెప్పుకున్నారు. ఇది టిటిడికి కూడా వర్తిస్తుంది. ఇక్కడికి ఎవరు ఛైర్మన్‌గా వచ్చినా, పాలక మండలిలో ఎవరున్నా… నిర్ణయాలలో దిశా నిర్దేశం చేయాల్సింది టిటిడి ఉన్నతాధికారులే. అయితే కొంతకాలంగా టిటిడిలో జరుగుతున్నది ఏమిటి..! ప్రభుత్వ ప్రతిష్ట ఇనుమడించేలా ఉందా, దుగజార్చేలా ఉందా…!!

టిటిడిలో సిఎం జగన్ మోహన్ రెడ్ది ఆదేశాలు అమలు కావడం లేదని, ఇప్పటికీ చంద్రబాబు నిర్ణయాలనే అమలు చేస్తున్నారని శ్రీవారి‌ ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ‌విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అక్రమంగా తొలగించిన 20 మంది వంశపారంపర్య అర్చకులను విధుల్లోకి తీసుకోవాలని సిఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించినా…ఈవో‌ అనిలా కుమార్ సింఘాల్, అదనపు ఈవో ధర్మారెడ్డి పట్టించుకోవడం లేదని ట్విట్టర్ వేదికగా ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది.

రమణ దీక్షితులు స్పందన అతిగా ఉన్నప్పటికీ…ఆ అపరిస్థితికి కారణాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రమణ దీక్షితుల పునర్ నియామకమే‌ అత్యంత అసాధారణంగా జరిగింది. స్వయంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతోనే రమణ దీక్షితులు నియామకం‌ జరిగింది. అటువంటి వ్యక్తిని డమ్మీ చేశారు. ప్రభుత్వ మనిషిగా ముద్రపడిన ఆయన్ను నామమాత్రం చేశారు. ఆలయంలోని‌ అర్చకుల మధ్య ఉన్న‌ ఆధిపత్య పోరులో అధికారులూ భాగమైపోయారు. ఎప్పుడో రిటైర్డ్ అయిన‌‌ డాలర్ శేషాద్రికి పెద్దపీట వేసి నడిపిస్తున్నారు. ఆయనకు ఇచ్చే గౌరవం కూడా దీక్షితులుకు ఇవ్వడం లేదు.

అసలు రమణ దీక్షితులును పునర్ నియమిస్తూ ముఖ్యమంత్రిగా జగన్ తీసుకున్న నిర్ణయం ఇష్టంలేనట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇది నిరాధారంగా చెబుతున్న మాటలు కావు. తిరుమల శ్రీనివాసుని‌ ఆభరణమైన పింక్ డైమండ్ పోయిందని రమణ దీక్షితులు ఆరోపణలు చేసిన సంగతి‌ తెలిసిందే. అయితే…అటువంటి డైమండ్‌ ఏదీ లేదని, ఆభరణాలన్నీ సురక్షితంగా ఉన్నాయని ఓ అధికారి పనిగట్టుకుని‌ టివీలకు చెప్పారు. ఇది రమణ దీక్షితుల్ని తప్పుబట్టడమా లేక తనను టిటిడికి పంపించిన ముఖ్యమంత్రిని తప్పు బట్టమా..!

ఈ పరిస్థితుల్లో ఆయన…అసహనంతో స్పందిస్తున్నారు. వంశపారంపర్య పర్చకులను కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే‌ టిటిడిలో ఆ నిర్ణయాన్ని ఎందుకి అమలు చేయరో తెలియదు. ఈ‌ కారణంతో అమలు చేయడం లేదని‌ కూడా చెప్పరు. ఇక సిఎం మాటకు ఏమి విలువ ఇచ్చినట్లు..! లడ్డూల వివాదం సందర్భంగానూ దీక్షితులు విమర్శలు చేశారు. టిటిడికి సంబంధించినంత వరకు గత ప్రభుత్వానికీ, ఈ ప్రభుత్వానికీ తేడా ఏమీ లెదని వ్యాఖ్యానించారు. రమణ దీక్షితులు వంటి వారిని కలుపుని వెళ్లడంలో అధికారులకు ఉన్న సమస్య ఏమిటో అర్థంకాదు.

ఒక‌ రమణ దీక్షితులు ‌అంశమే‌ కాదు…అధికారుల ధోరణి వల్ల టిటిడి, ప్రభుత్వం మాటపడాల్సి వస్తోంది.‌ అటువంటి ఉదంతాలు కొన్ని చూద్దాం…

టిటిడికి సంబంధించి దేశంలో ఎక్కడెక్కడో ఉన్న చిన్నచిన్న అస్తులను విక్రయించాలని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో, అప్పటి పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ఈ తీర్మానాన్ని అమలు చేసే పనిని ఈ బోర్డు నెత్తికి ఎత్తుకుంది. ఇటువంటి నిర్ణయం వల్ల ఎటువంటి పరిణామాలు తలెత్తుతాయో లోతుగా అధ్యయనం చేయలేదు. విమర్శలు వెల్లువెత్తడంతో ఆఖరికి వెనుకడుగు వేశారు. సరైన కసరత్తు లేకుండా తీసుకున్న నిర్ణయం వల్ల జగన్ ప్రభుత్వం ఈ ఏడాది పాలనలో ఎప్పుడూ లేనంత అప్రతిష్టపాలయింది.

కరోనాతో దేశ ప్రజలంతా కష్టాల్లో ఉన్న సమయంలో…టిటిడిలో పని చేస్తున్న నాలుగు వేల మంది‌ అవుట్ సోర్సింగ్ కార్మికులను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఇది రాష్ట్రంలో దుమారం రేపింది. కార్మికులకు మేలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్…ఇలా‌ కార్మికుల కడుపుకొడుతున్నారంటూ విమర్శలు హోరెత్తాయి. ఆఖరికి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. దీనివల్ల తిరుపతిలో వైసిపికి రాజకీయంగా పెద్ద నష్టమే జరిగిందని చెప్పాలి. ఇది ఎంతటి అనాలోచిత నిర్ణయమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

శ్రీవారి దర్శనానికి శ్రీవాణి పేరుతో కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. దీనిపైనా దుమారం లేచింది. అసలు బ్రేక్ దర్శనాలే రద్దు చేయాలని సామాన్య భక్తులు కోరుకుంటున్న తరుణంలో ఈ విధంగా రూ. 10 వేల టికెట్ ప్రవేశపెట్టడం వివాదాస్పదం అయింది.

టిటిడి ఉద్యోగులకు భోజనం పెట్టే క్యాంటీన్ లో ధరలు ఒకేసారి నాలుగు రెట్లు పెంచారు. దీంతో ఉద్యోగుల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఆఖరికి ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు.‌ దీనివల్ల ఉద్యోగుల్లో వ్యతిరేకత రావడం మినహా ఏ ప్రయోజనమూ లేదు. ఉద్యోగుల భోజనం మీద పెట్టే ఖర్చు ఖర్చు చాలా తక్కువ. ఈ విషయాన్నీ తెలుసుకోకుండా…నిర్ణయం తీసుకుని వ్యతిరేకతను మూటగట్టు కున్నారు.

వైకుంఠ ద్వారాలు మూడు రోజులు బదులు పది రోజులు తెరిచే ఆంశమూ వివాదమయింది. ఇప్పటి దాకా కొనసాగుతున్న సంప్రదాయాలు మంటగలు పుతున్నారన్న విమర్శలు వచ్చాయి.‌ ఈ ప్రతిపాదననూ ఆఖరు నిమిషంలో వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అప్పటికే టిటిడికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

ముందే చెప్పినట్లు టిటిడి ఛైర్మన్ కు గానీ, పాలక మండలికి గానీ మార్గదర్శనం చేయాల్సింది అధికారులే. మరి ఆ అధికారులు ఏం చేస్తున్నాట్లు..! ఇటు టిటిడి పరువు, అటు ముఖ్యమంత్రి ప్రతిష్ట పోతుంటే ఈ అధికారులు ఏం చేస్తున్నట్లు..!

ఇదే ధోరణి కొనసాగితే…ప్రభుత్వాన్ని ముంచడానికి ప్రతిపక్షాలు అవసరం లేదు. టిటిడి అధికారులే సరుపోతారు. ఏకపక్ష ధోరణులతో, నియంతృత్వ పోకడలతో రోజుకో వివాదం తెచ్చిపెట్టి టిటిడి పరువు, ప్రభుత్వ ప్రతిష్ట మంటగలపగలరు. చేయని తప్పులకు ముఖ్యమంత్రి జగన్ ను దోషిగా నిలబెడతారు. ఎన్ని చెప్పుకున్నా ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సింది ప్రభుత్వమే.

  • ధర్మచక్రం ప్రతినిధి, తిరుపతి

1 Comment

  1. దీక్షితులు గారు లేవనెత్తిన అంశాలు కీలకమైనవి. ఈ వ్యవహారం జగన్ కు తెలియదు అనుకోలేము. ముఖ్యమంత్రి కాగానే దీక్షితులు గారిని తిరిగి నియమిస్తున్నట్లు చేసిన ప్రకటన ప్రచారార్భాటం తప్ప చిత్తశుద్ధి లేదు.జగన్ అతితెలివి ప్రదర్శిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.


*