టిటిడి అధికారి – ఓ జడ్జి – శేఖర్‌ రెడ్డి – ముఖ్యమంత్రి : మాజీ న్యాయమూర్తి ఈశ్వరయ్య చెప్పిన సంధించిన ప్రశ్నలు

న్యాయమూర్తుల నియామకాల్లో బిసిలు, ఎస్‌సిలు, బ్రాహ్మణులకు అన్యాయం చేశారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఇటీవల సంచలన విమర్శలు చేసి వార్తలకెక్కిన రిటైర్డ్‌ హైకోర్టు న్యాయమూర్తి, జాతీయ బిసి కమిషన్‌ మాజీ ఛైర్మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య మరోసారి తూటాల వంటి మాటలు పేల్చారు. తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన….’రమణ దీక్షితులు చేస్తున్న విమర్శలతో టిటిడి ప్రతిష్ట దెబ్బతింటోందని కొందరు మాట్లాడుతున్నట్లు వార్తల్లో చూశాను. వాస్తవంగా టిటిడి ప్రతిష్టను దిగజార్చుతున్నది ఎవరు?’ అని ప్రశ్నిస్తూ ఓ ఉదంతాన్ని వివరించారు. పెద్దనోట్లు రద్దయిన సందర్భంగా, అప్పుడు టిటిడి పాలక మండలిలో సభ్యుడిగా ఉన్న తమిళనాడుకు చెందిన శేఖర్‌ రెడ్డి వద్ద వందల కోట్లు పట్టుబడిన విషయాన్ని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తిని పాలక మండలిలో నియమించింది చంద్రబాబు నాయుడు కాదా….అని ప్రశ్నించారు. టిటిడిలోని ఓ అధికారికి, ఓ న్యాయమూర్తికి, ముఖ్యమంత్రికి ఉన్న సంబంధాల గురించి ఆయన నిలదీశారు. ఢిల్లీలో న్యాయమూర్తి ఇంట్లో వివాహం జరిగితే….దీర్ఘకాలంగా టిటిడిలో కొనసాగుతున్న అధికారి, శేఖర్‌ రెడ్డి అన్నీతామై వ్యవహరించారని చెప్పారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై జస్టిస్‌ ఈశ్వరయ్య సామాజిక కోణంలోనూ విమర్శలు గుప్పించారు. తమ సామాజికవర్గానికి చెందిన వారినే న్యాయమూర్తులుగా నియమింపజేసుకున్నారని చెప్పారు. బిసిలు, ఎస్‌సిలు, ఎస్‌టిలు న్యాయమూర్తులుగా పనికిరారా అని ప్రశ్నించారు. అటు టిటిడి అధికారి – జడ్జి – చంద్రబాబు – శేఖర్‌ రెడ్డి గురించి ఈశ్వరయ్య చేస్తున్న విమర్శలు చర్చనీయాంశంగా మారనున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*