టిటిడి అధికారులకు త్వరలో ఎలక్ట్రిక్‌ కార్లు..!

  • తొలి దశలో 40 కార్లు కొనుగోలు
  • ఒక్కో కారుకు ఈఎంఐ రూ.23,600
  • ఆరేళ్ల తరువాత కార్లు టిటిడి సొంతం
  • ప్రభుత్వ రంగ సంస్థ ఈఈఎస్‌ఎల్‌తో ఒప్పందం

తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) తమ అధికారులకు సంప్రదాయ డీజిల్‌ – పెట్రోల్‌ వాహనాలకు బదులు ఎలక్ట్రిక్‌ వాహనాలను సమకూర్చనుంది. తొలి దశలో 40 ఎలక్ట్రిక్‌ కార్లను ఈఎంఐ పద్ధతిలో (నెలవాయిదాల పద్ధతిలో) కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎనర్జీ ఎఫిసియన్షీ సర్సీస్‌ లిమిటెడ్‌ అనే ప్రభుత్వరంగ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోనుంది.

పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని క్రమేపీ డీజిల్‌ – పెట్రోలు వాహనాలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో టిటిడి కూడా తమ అవసరాలకు ఎలక్ట్రిక్‌ వాహనాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది.

ప్రస్తుతం టిటిడిలో 60 మంది అధికారులకు అద్దె కార్లు వినియోగిస్తున్నారు. వీరిలో 40 మంది రోజూ తక్కువ దూరం ప్రయాణిస్తున్నారు. మిగతా 20 మంది దూర ప్రాంతాలకు వెళుతుంటారు. దీంతో తొలిదశలో స్థానికంగా తిరిగే 40 మంది అధికారులకు ఎలక్ట్రిక్‌ వాహనాలను సిద్ధం చేయాలని నిర్ణయించారు.

మన దేశంలో టాటా, మహేంద్రా కంపెనీలు ఎలక్ట్రిక్‌ వాహనాలు తయారు చేస్తున్నాయి. టాటా టిగోర్‌, మహేంద్రా వెరిటో అనే రెండు కార్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఆ కంపెనీల నుంచి ఈఈఎస్‌ఎల్‌ తీసుకుని టిటిడికి అందజేస్తుంది. ఒక్కో కారుకు నెలకు ఈఎంఐ కింద రూ.23,600 చొప్పున ఆరేళ్లపాటు చెల్లించాల్సివుంటుంది.

ఈ వాహనాల్లోని బ్యాటరీ ఒకసారి ఛార్జ్‌ చేస్తే 100 కిలోమీటర్లు తిరగొచ్చు. బ్యాటరీని ఒకసారి ఛార్జీ చేయడానికి 7 గంటల సమయం పడుతుంది. అదే డిసి ఛార్జింగ్‌ స్టేషన్‌లోనైతే ఒకటిన్నర గంటలో ఛార్జింగ్‌ పూర్తవుతుంది. బ్యాటరీని ఒకసారి ఛార్జ్‌ చేయడానికి 18 యూనిట్ల విద్యుత్‌ ఖర్చవుతుంది. అంటే రూ.125 అవుతుంది. ఎలక్ట్రిక్‌ కారులో ప్రయాణానికి కిలోమీటరుకు రూ.1.25 వ్యయమవుతుందని అంచనా. ఎలక్ట్రిక్‌ కార్ల బ్యాటరీను ఛార్జి చేయడానికి తిరుమల, తిరుపతిలో ఛార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సివుంటుంది. దీనికి రూ.15 లక్షలకుపైగా ఖర్చవుతుంది.

ప్రస్తుతం నెలకు రూ.24,000, రూ.35,000 రెండు పద్ధతుల్లో కార్ల అద్దె చెల్లిస్తున్నారు. పెట్రోల్‌, డ్రైవర్‌ అన్నీ వాహన యజమానివే. ఈ లెక్కన 40 వాహనాలకు ఏడాదికి రూ.1.15 కోట్ల నుంచి రూ.1.65 కోట్లు వ్యయం అవుతోంది. అదే ఎలక్ట్రిక్‌ వాహనాలకు ఏడాదికి రూ.2.30 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఆరేళ్ల తరువాత ఈఎంఐ చెల్లించాల్సిన అవసరం ఉండదు. అప్పుడు ఖర్చు ఇందులో సగం తగ్గిపోతుంది. అందుకే ఎలక్ట్రిక్‌ కార్లు తీసుకోవాలని టిటిడి పాలక మండలి నిర్ణయించింది.

తొలి దశలో 40 కార్లు కొనుగోలు చేయాలనుకుంటున్న టిటిడి క్రమేపీ అన్ని కార్లనూ ఎలక్ట్రిక్‌ కార్లుగా మార్చనుంది. ఈఈఎస్‌ఎల్‌తో ఒప్పందం పూర్తయి, ఎలక్ట్రిక్‌ కార్లు రావడానికి కొంత సమయం పట్టవచ్చుగానీ….తిరుమల ఘాట్‌ రోడ్డులో ఎలక్ట్రిక్‌ కార్లు రయ్‌ రయ్‌ మనడం మాత్రం ఖాయం.

ధర్మచక్రం ప్రతినిధి, తిరుపతి

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*