టిటిడి అధికారులపై సోషల్‌ మీడియా విజయం!

తిరుమల శ్రీవారి ఆలయంలో మహాసంప్రోక్షణం సందర్భంగా ఆగస్టు 11 నుంచి 16వ తేదీ దాకా భక్తులను దర్శనానికి అనుమతించకూడదని టిటిడి తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమయిన సంగతి తెలిసిందే. టిటిడి అధికారులకు, టిడిపి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే మీడియా…ఈ నిర్ణయంలోని హేతుబద్ధతను ప్రశ్నించడానికి ఏమాత్రం ఆసక్తిచూపనప్పటికీ….సోషల్‌ మీడియా టిటిడి తీసుకున్న నిర్ణయం ఎంత అసంబద్ధమైనదో ఎత్తిచూపుతూ ఎకిపారేసింది. దీంతో ఆఖరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి జోక్యంతో టిటిడి అధికారులు తమ నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఆశుభంగా భావించే గ్రహణాలు వంటి సందర్భాల్లో ఆలయాలను మూసేసి, దర్శనాలు ఆపేయడం పరిపాటి. అయితే….12 ఏళ్లకు ఒకసారి జరిగే విశేష ఉత్సవాల సందర్భంగా భక్తులను దర్శనానికి అనుమతించకూడదని తీసుకున్న నిర్ణయంలో ఏమాత్రం హేతుబద్ధత లేదు. ఇదే విషయాన్ని సోషల్‌ మీడియా ఎత్తిచూపింది. టిటిడి నిర్ణయంపై సోషల్‌ మీడియా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నదంటూ ఆ రోజే ధర్మచక్రం ప్రత్యేక కథనాన్ని రాసింది.

సోషల్‌ మీడియా దుష్ఫ్రచారం చేసిందని టిటిడి ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ ఆరోపించారుగానీ….వాస్తవంగా సామాజిక మాధ్యలు సరిగానే స్పందించాయి. ఎందుకంటే టిటిడి తీసుకున్న నిర్ణయం అనేక అనుమానాలకు తావిచ్చేలావుంది. వందల సంవత్సరాల నుంచి ప్రతి 12 ఏళ్లకు ఒకసారి మహాసంప్రోక్షణం జరుగుతూనే ఉంది. ఎన్నడూ భక్తులను అనుమతించకుండా ఆపిన ఉదంతాలు లేవు. మరి ఇప్పుడు ఎందుకు ఆపుతున్నారు…అనేది ప్రాథమికమైన ప్రశ్న. దీనికి సరైన సమాధానం అధికారుల వద్ద లేదు.

మహాసంప్రోక్షణ సమయంలో రోజుకు 30 వేల మందికి దర్శనం చేయించగలమని జెఈవో శ్రీనివాసరాజు ప్రకటించారు. బోర్డు ఇందుకు భిన్నంగా నిర్ణయం తీసుకుంది. రెండు వారాల్లోనే ఎందుకంత మార్పు? పోటులో తవ్వకాలు జరిగాయని రమణ దీక్షితులు ఆరోపించారు. అలాంటి వాటిని సరిచేసుకోడానికే భక్తులను అనుమతించడం లేదని సోషల్‌ మీడియా అనుమానాలు వ్యక్తం చేసింది. అందులో తప్పేముంది? సిసి కెమెరాలు ఆపేస్తున్నారన్న వార్తలూ వచ్చాయి. ఇవన్నీ కూడా భక్తులకు అనుమానాలు కలిగించాయి.

సోషల్‌ మీడియాలో వచ్చిన అభిప్రాయాలను ఫీడ్‌ బ్యాక్‌గా టిటిడి భావించాలి. అంతేతప్ప….అదేదో దుష్ప్రచారం అనుకుంటే పొరపాటే అవుతుంది. టిటిడి నిర్వహిస్తున్న కాల్‌సెంటర్‌కూ అభిప్రాయాలు వచ్చివుంటాయి. ఏ ఒక్కరూ దర్శనాలను ఆపేయడాన్ని సమర్థించివుంటారని అనుకోలేం. సోషల్‌ మీడియాలోనూ అదే వ్యక్తమయింది. మరి అతి దుష్ప్రచారం ఎలా అవుతుంది?

ఏమైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకోవడం, వెంటనే ఈవో సింఘాల్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి…తమ నిర్ణయాన్ని పున: సమీక్షించుకుంటామని ప్రకటించడం ఆహ్వానించదగ్గ పరిణామాలు. ఇది కచ్చితంగా సోషల్‌ మీడియా విజయంగానే చెప్పాలి. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి.

మీడియా ప్రతినిధుల నుంచి ప్రశ్నలను ఆహ్వానించి, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు చేస్తే…ఈ విధంగా ఎదురుదెబ్బలు తగలవు. అయితే…మీడియా ప్రశ్నలంటేనే కొందరు అధికారులకు గిట్టదు. ‘మేము చెప్పింది రాసుకునివెళ్లండి’ అనే ధోరణితో ఉంటారు. ఎవరైనా ప్రశ్నిస్తే…కక్షసాధింపులకూ దిగుతారు. ఆ విలేకరికి షాపువుందా…హాకర్‌ లైసెన్సు ఉందా అని చూసి…ఇబ్బందిపెడుతుంటారు. అందుకే చాలామంది మీడియా ప్రతినిధులు ‘మాకెందుకులే’ అనుకుని తమ పని తాము చూసుకుని పోతుంటారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*