టిటిడి ఆధీనంలోకి స్విమ్స్‌ … స్వాగతించాలా! వ్యతిరేకించాలా!!

  • ఆదిమూలం శేఖర్‌, సంపాదకులు, ధర్మచక్రం

తిరుపతిలోని స్విమ్స్‌ ఆస్పత్రిని పూర్తిస్థాయిలో టిటిడి ఆధీనంలోకి తీసుకోవాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. దీన్ని టిటిడిలోని కొన్ని ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఆస్పత్రి నిర్వహణ బాధ్యతల నుండి ప్రభుత్వం తప్పుకుని, బాధ్యత అంతా టిటిడిపైనే మోపడం సరికాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్విమ్స్‌ను టిటిడిలో విలీనం చేయడాన్ని ఎలా చూడాలి? స్వాగతించాలా…లేక వ్యతిరేకించాలా? అనే దానిపై ధర్మచక్రం కథనం.

రాయలసీమ ప్రాంత ప్రజలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో స్విమ్స్‌ను స్థాపించారు. సాధారణ ఆస్పత్రులు మాత్రమే ఉన్నత రుణంలో, ప్రైవేట్‌ ఆస్పత్రులు కూడా పెద్దగా లేని పరిస్థితుల్లో ఏర్పాటైన స్విమ్స్‌….నిజంగానే రాయలసీమ ప్రాంతానికి…ప్రత్యేకించి తిరుపతి ప్రాంతానికి వరంలా మారింది. అయితే…ఆస్పత్రిని మరింతగా అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టలేదు. దీంతో స్విమ్స్‌ పనితీరు రానురానూ తీసికట్టుగా మారింది. ఎంత అధ్వానంగా తయారైనా ఇప్పటికీ సాధారణ, మధ్యతరగతి ప్రజలకు స్విమ్స్‌ మాత్రమే పెద్ద దిక్కుగా ఉంది.

స్విమ్స్‌కు అవసరమైన నిధులన్నీ టిటిడినే భరిస్తోంది. ప్రభుత్వం నుంచి ఏడాదికి కోటి రూపాయల సాయం మాత్రమే అందుతోంది. టిటిడి చూసుకుంటుందిలే అని ప్రభుత్వం, ప్రభుత్వం చూసుకుంటుందిలే అని టిటిడి ఉంటున్నాయి. దీంతో సరైన నిర్వహణ కొరవడింది. ఈ నేపథ్యంలో ఆస్పత్రి మొత్తాన్ని టిటిడి ఆధీనంలోకి తీసుకుని, మెరుగ్గా నిర్వహించాలన్న ప్రతిపాదన వచ్చింది. ఇదే తిరుపతిలోని బర్డ్‌ ఆస్పత్రి పూర్తిగా టిటిడి ఆధ్వర్యంలోనే నడుస్తోంది. అద్భుతమైన పనితీరును కనబరచి, దేశస్థాయిలో ఖ్యాతి గడించింది. స్విమ్స్‌నూ పూర్తిగా టిటిడి ఆధీనంలోకి తీసుకొస్తే…అద్భుతంగా తీర్చిదిద్దవచ్చన్న ఆలోచనతో కొత్త ప్రతిపాదన వచ్చింది.

వేలూరులోని సిఎంసి ఆస్పత్రిని క్రిస్టియన్‌ మిషనరీ నిర్వహిస్తోంది. దేశంలోని ఏ కార్పొరేట్‌ ఆస్పత్రికి తీసిపోని రీతిలో సిఎంసి సేవలు అందిస్తోంది. టిటిడి ఉద్యోగుల‌కు తీవ్ర అనారోగ్యం చేసినా సిఎంసికి వెళుతున్న ప‌రిస్థితి ఉంది. టిటిడి తలచుకుంటే సిఎంసిని మించిన ఆస్పత్రిని తిరుపతిలో రూపొందించవచ్చు. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి అవసరమైన మౌలిక సదుపాయాలుగానీ, వైద్యులుగానీ, సిబ్బందినిగానీ సమకూర్చడం టిటిడికి పెద్ద సమస్య కాదు. ఇదే ప్రభుత్వం చేయాలంటే చాలా సమస్యలుంటాయి. ప్రభుత్వానికి అనేక ఆస్పప్రతులుంటాయి. అటువంటప్పుడు స్విమ్స్‌ను ప్రత్యేకంగా చూడటం సాధ్యంకాదు. అదే టిటిడి అయితే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలదు.

ఒకప్పుడు టిటిడి తిరుపతిలో పలు విద్యాసంస్థలు నెలకొల్పింది. పాఠశాలలు, జూనియర్‌ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు నెలకొల్పింది. వీటిలో వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. తిరుపతి విద్యాకేంద్రంగా విరాజిల్లుతోందంటే…దానికి కారణం దేవస్థానమే. టిటిడి చొరవ తీసుకుంటే తిరుపతిని వైద్య కేంద్రంగానూ అభివృద్ధి చేయవచ్చు.

ఈ బాధ్యతను టిటిడి ఇప్పటికే చేపట్టివుండాల్సింది. తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యశాలలూ ఏర్పాటు చేసి వైద్యం అందించివుండాల్సింది. టిటిడి ఎందుకో ఆవైపు దృష్టి పెట్టలేదు. ఈ విషయంలో సత్యసాయి ట్రస్టును ఆదర్శంగా చెప్పుకోవాలి. ఈ ట్రస్టు పుట్టపర్తిలో సూపర్‌ స్పెషాలిటీ వైద్యశాలను ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో విశేషమైన సేవలు అందిస్తోంది. ఒక చిన్న ట్రస్టు అంత బాగా చేయగలిగినపుడు… టిటిడి ఎంత చేయవచ్చునో ఊహించుకోవచ్చు.

టిటిడి నిధులను గరుడ వారధి నిర్మాణం కోసం ఖర్చు చేయకూడదని కొందరు, చెరువుల అభివృద్ధికి కేటాయించకూడదని కొందరు, దేవస్థానం నిధులతో రోడ్లు వేయకూడదని మరికొందరు వాదనలు తెస్తున్నారు. ఈ పరిస్థితుల్లో స్విమ్స్‌ ఆస్పత్రి నిర్వహణ బాధ్యతలను టిటిడి చేపట్టకూడదని మరో వాదన తేవడం సమంజసం కాదు. ఇవన్నీ తిరుపతి ప్రాంత అభివృద్ధికి ఆటంకంగా మారుతాయనడంలో సందేహం లేదు. ఒకప్పుడు ఇటువంటి వాదనలు తెరపైకి వచ్చివుంటే….తిరుపతిలో ఇన్ని విద్యాసంస్థలు ఏర్పాటయ్యేవా?

ఏ ధార్మిక సంస్థ అయినా…ఆధ్యాత్మిక చింతనకు ఆలంబన మాత్రమే కాదు….ప్రజల సామాజిక సేవా కార్యక్రమాలను అందించేదిగానూ ఉండాలి. ఈ దృక్పథం నుంచే ఒకప్పుడు టిటిడి నిధులతో చెరువులను అభివృద్ధి చేసి రైతులకు నీళ్లు ఇచ్చిన పరిస్థితి ఉంది. అంతెందుకు దేశంలోనే అత్యంత కరువు ప్రాంతమైన అనంతపురంలో ప్రజల దాహార్తి తీరిందంటే….సామాజిక బాధ్యతతో సత్యసాయి ట్రస్టు చేపట్టిన తాగునీటి పథకాలే అని చెప్పాలి.

అందుకే…టిటిడి కూడా తన పరిధిలో సాధ్యమైనంత ఎక్కువగా సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టాలి. స్థానిక ప్రజలకు విద్య, వైద్యం, తాగునీరు వంటివి కల్పించేందుకు చొరవ తీసుకునేలా ప్రోత్సహించాలి. ఈ దృష్టి కోణం నుంచే స్విమ్స్‌ను టిటిడి ఆధీనంలోకి తీసుకోవాలన్న ప్రతిపాదనను అందరూ స్వాగతించాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*