టిటిడి ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ విభాగం వైఫల్యం! పేరు గొప్ప ఊరు దిబ్బ‌లా టిసిఎస్‌!!

– యథేచ్ఛగా ఆన్‌లైన్‌ మోసాలు
– పసిగట్టలేకున్న ఐటి అధికారులు

తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ విభాగం అత్యంత కీలకంగా మారింది. గదులు బుక్‌ చేసుకోవాలన్నా, దర్శనం టికెట్లు కావాలన్నా, శ్రీవారి సేవా టికెట్లకు పేరు నమోదు చేసుకోవాలన్నా, డొనేషన్లు ఇవ్వాలన్నా ప్రతి దానికీ ఆన్‌లైన్‌ సదుపాయాన్ని టిటిడి అందుబాటులోకి తెచ్చింది. అయితే…దీన్ని పటిష్టంగా అమలు చేయలేకపోవడంలో వైఫల్యం చెందడంతో ఆన్‌లైన్‌ అక్రమాలకు అడ్డులేకుండాపోతోంది. ఒకరే వందలాది టికెట్లు బుక్‌ చేసుకుంటున్నా గుర్తించలేనంత అసమర్థంగా ఉంది టిటిడి ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ విభాగం.

శ్రీవారి దర్శనాన్ని సులభతరం చేసే ప్రక్రియలో భాగంగా ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీని విరివిగా ఉపయోగించుకోవడం మొదలుపెట్టారు. ఒకప్పుడు శ్రీవారిని దర్శించుకోవాలంటే తిరుమలకు వచ్చి, ఇక్కడ క్యూలైన్లలో వేచివుండటం తప్పనిసరి. ఆ తరువాత సుదర్శనం కంకణాలు ప్రవేశపెట్టారు. తిరుపతిలో కంకణం కట్టించుకుంటే…తమకు కేటాయించిన సమయానికి క్యూలోకి వెళితే సరిపోయేది. ఇటువంటి కౌంటర్లు దేశ వ్యాపితంగా టిటిడి సమాచార కేంద్రాల్లో మాత్రమే ఉండేవి. ఆ తరువాత రూ.300 శీఘ్రదర్శనం టికెట్లును టిటిడి సమాచార కేంద్రాలు, పోస్టాఫీసులు, మీసేవ కేంద్రాలు వంటిచోట దొరికే ఏర్పాటు చేశారు. ఆపై ఎవరైనా ఎక్కడి నుంచయనా టికెట్లు బుక్‌ చేసుకునే వెసులుబాటు కల్పించారు. సెల్‌ఫోన్‌ యాప్‌ను రూపొందించి, స్మార్ట్‌ ఫోన్‌ ద్వారానూ టికెట్లు బుక్‌ చేసుకునే సదుపాయం ఇప్పుడు అందుబాటులో ఉంది. ఒకమాటలో చెప్పాలంటే టిటిడికి సంబంధించిన ప్రతి సేవనూ ఆన్‌లైన్‌లో పొందే అవకాశం కల్పించారు.

ఒకప్పుడు టిటిడి ఉద్యోగులే శిక్షణ పొంది ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ వ్యవహారాలను చూసేవారు. అన్నీ ఆన్‌లైన్‌ అయిన తరువాత అత్యంత నిపుణత కలిగిన వారి అవసరం ఏర్పడటంతో…టిటిడి ఐటి విభాగం మొత్తాన్ని పపంచ ప్రఖ్యాతిగాంచిన టిసిఎస్‌ (టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్‌) చేతిలో పెట్టారు. టిసిఎస్‌ నుంచి ఉద్యోగులను నియమించుకుని లక్షలాది రూపాయల వేతనాలను ప్రతినెలా టిటిడి చెల్లిస్తోంది. టిటిడి చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఆఫీసర్‌ అనే పోస్టును కూడా కొత్తగా సృష్టించారు. టిసిఎస్‌ నుంచి వచ్చిన వ్యక్తిని ఆ పోస్టులో నియమించారు. అంతేకాదు…టిటిడికి అసరమైన అనేక సాఫ్ట్‌వేర్లను కోట్లాది రూపాయలు వెచ్చింది టిసిఎస్‌ వద్దనే కొనుగోలు చేస్తున్నారు.

ఇంత చేసినా….టిసిఎస్‌ పని అంత సమర్థవంతంగా లేదు. సాఫ్ట్‌వేర్‌ ఎంత లోపభూయిష్టంగా ఉందో అనేక సార్లు వెల్లడవుతోంది. ఒకే వ్యక్తి ఆన్‌లైన్‌లో వందలాది టికెట్లు బుక్‌ చేసుకుని అక్రమాలకు పాల్పడుతున్న దళారులు దొరికనపుడల్లా టిసిఎస్‌ డొల్ల తనం బయటపడుతోంది. సోలాపూర్‌కు చెందిన ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో సుప్రభాతం తదితర సేవల టికెట్లు ఏదోఒక పేరుతో బుక్‌చేసి, బ్లాక్‌మార్కెట్‌లో విక్రయించేవాడు. తాజాగా తిరుపతిలోని టిటిడి కాల్‌సెంటర్‌లో పనిచేసే ఓ ప్రైవేట్‌ ఉద్యోగి ఇదే తరహాలో….సుప్రభాతం టికెట్లను వందల సంఖ్యలో బుక్‌చేసి విక్రయించినట్లు వెలుగులోకి వచ్చింది.

ప్రస్తుతం శ్రీవారి సేవా టికెట్లు అంత తేలిగ్గా దొరకడం లేదు. నెలలో మొదటి శుక్రవారం నాడు ఆ నెలకు సంబంధించి సేవా టికెట్లను విడుదల చేస్తారు. భక్తులు తమకు ఏ టికెట్లు కావాలంటే ఆ టికెట్టుకు తమ పేరు నమోదు చేసుకోవాలి. ఇలా వారం రోజులు గడువు ఇచ్చి, నమోదు చేసుకున్న వారి పేర్ల నుంచి ఎలక్ట్రానిక్‌ లాటరీ పద్ధతిలో టికెట్లు కేటాయిస్తారు. వంద టికెట్లు ఉంటే వందలాది మంది పేర్లు నమోదు చేసుకుంటారు. నెలల తరబడి ప్రతినెలా పేరు నమోదు చేసుకుంటున్నా….ఒక్కసారి కూడా తమకు టికెట్టు దొరకలేదని డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో ఫిర్యాదు చేసిన భక్తులున్నారు. అలాంటిది…సోలాపూర్‌లో పట్టుబడిన దళారిగానీ, తిరుపతిలో దొరికిన కాల్‌సెంటర్‌ ఉద్యోగిగానీ వందల సంఖ్యలో సేవా టికెట్లు ఎలా పొందగలిగారనేది ప్రశ్న.

కాల్‌ సెంటర్‌ ఉద్యోగి ఈ నెలలోనే 16 టికెట్లు వచ్చాయని చెబుతున్నారు. అంటే..అతను ఎన్ని పేర్లు ఎలక్ట్రానిక్‌ లాటరీకి బుక్‌ చేసుకుని ఉంటాడు? కనీసం వంద పేర్లయినా నమోదు చేసివుంటాడు. ప్రతినెలా ఇదే విధంగా బుక్‌ చేస్తుండటం వల్లే అతనికి పదుల సంఖ్యలో టికెట్లు లభ్యమవుతున్నాయి. ఇక్కడ ఉదయించే ప్రశ్న ఏమిటంటే….ఒక కంప్యూటర్‌ నుంచి లేదా ఒక నిర్ధిష్ట ప్రాంతం నుంచి వందల సంఖ్యలో టికెట్లకు పేర్లు నమోదు అవుతుంటే…దాన్ని టిటిడి ఐడి విభాగం ఎందుకు గుర్తించలేకపోయింది? కంప్యూటర్‌ ఐపి అడ్రెస్‌ ద్వారా గుర్తించే అవకాశం లేదా? ఇప్పుడు కూడా టిటిడి విజిలెన్స్‌ అధికారులు పట్టుకోబట్టి దళారులు దొరికారు తప్ప ఐటి విభాగం గుర్తించినది ఏమీలేదు. ఇంత లోపభూయిష్టంగా ఉంటే…ఆ సాఫ్ట్‌వేర్‌ను ఎలా విశ్వసించాలి? అసలు ఎలక్ట్రానిక్‌ లాటరీ సవ్యంగా ఎందని ఎలా నమ్మాలి? ఐటి విభాగానాకి, దళారులకు మధ్య లింకులున్నాయన్న అనుమానాలు ఎందుకు తలెత్తకూడదు? ఇటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది టిటిడి ఐటి విభాగమే. ఇంకా చెప్పాలంటే టిసిఎస్‌ సంస్థ పేరుతో ఇక్కడి వ్యవహారాలు చూస్తున్న అధికారులే!

టిటిడి అధికారులు చెప్పాల్సింది ఏమంటే…అసలు టిసిఎస్‌ ఎవరికైనా జవాబుదారిగా ఉందా? అయినా ఒక టిసిఎస్‌నే ఎందుకు నమ్ముకోవాలి? ఇతర సంస్థలను ఎందుకు ఆహ్వానించకూడదు? లోపరహితమైనా సాఫ్ట్‌వేర్‌ రూపొందించడమేగాదు…దాన్ని సమర్థవంతంగా నడిపించగల వ్యవస్థను ఎప్పుడు ఏర్పాటు చేస్తారు. ఇంకో విషాదం ఏమంటే….5జికి వెళ్లిపోతున్న తరుణంలో కూడా టిటిడిలో ఇంటర్నెట్‌ వేగం నత్తను నడిపిస్తుంటుంది. మెయిల్‌ చేయడం కంటే వెళ్లి ఫైల్‌ ఇచ్చి రావడమే మేలనేలా ఉంటుంది. ఎందుకిలా? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ టిటిడి సమాధానాలు వెతకాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*