టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం

పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీపద్మావతీ వేంకటేశ్వరుల కైంకర్యాలను నిర్వహిస్తున్న అర్చక, కార్యనిర్వాహక, భద్రతాసిబ్బందికి, విశ్రాంత ఉద్యోగులకు, విద్యార్థినీ విద్యార్థులకు, భక్తకోటికి, శ్రీవారిసేవకులకు 73వ భారత స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

భారతదేశం వేద భూమి… కర్మ భూమి…. వేలాది సంవత్సరాల చారిత్రక, సాంస్క తిక వారసత్వ సంపద కలిగిన పుణ్యభూమి. మన భారతీయ జ్ఞాన విజ్ఞాన వారసత్వ సంపద విశ్వానికే తలమానికం.

ఎందరో యోధుల పోరాటాల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ప్రతిఒక్కరూ దేశ స్వాతంత్య్రాన్ని కాంక్షించారు. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్క భారతీయుడు ఒక సేనానిగా నిలిచాడు. నేడు ఆ మహాత్ముల త్యాగాలను మనందరం గుర్తుచేసుకుని వారికి ధన్యవాదాలు తెలియచేసుకుందాం. ఈ విశేష సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆశీస్సులతో తిరుమలకు వచ్చే భక్తులకు మరింత అంకితభావంతో విశేష సేవలందిద్దాం.

శ్రీవారి ఆలయం :

 • శ్రీవారి ఆలయం మరియు టిటిడి నిర్వహణలోని అన్ని ఆలయాలలో జీయంగార్లు, ఇతర ప్రముఖ ఆగమశాస్త్ర నిపుణుల సలహా మేరకు నిత్యకైంకర్యాలు ఆగమోక్తంగా నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నాం.

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు :

 • శ్రీ వేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది సెప్టెంబరు 30 నుండి అక్టోబరు 8వ తేదీ వరకు జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు విచ్చేసే భక్తకోటికి విశేషంగా సౌకర్యాలు కల్పించేందుకు టిటిడిలోని అన్ని విభాగాలు సన్నద్ధమవుతున్నాయి.
 • శ్రీవారి వాహన సేవలలో మరింత మెరుగ్గా కళాప్రదర్శనలు ఇచ్చేందుకు దేశంలోని వివిధరాష్ట్రాల అధికారులతో సంప్రదింపులు చేపట్టాం.

తిరుమలలో అభివృద్ధి కార్యక్రమాలు :

 • నారాయణగిరి ఉద్యానవనాలలో రూ.25 కోట్లతో క్యూలైన్లు, షెడ్లు, రూ.10 కోట్లతో రోడ్ల నిర్మాణాలను చేపట్టాం.
 • 3వ విడత రింగ్‌రోడ్డు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.
 • రూ.4.90 కోట్లతో శ్రీవారి పుష్కరిణికి ఇత్తడి గ్రిల్స్‌ ఏర్పాటు చేస్తున్నాం. వీటన్నింటిని బ్రహ్మోత్సవాలలోపు పూర్తి చేస్తాం.
 • తిరుమలలో ఇతర వసతి సముదాయాలే కాకుండా 3వ యాత్రికుల వసతి సముదాయం మరియు శ్రీపద్మనాభ నిలయం ద్వారా అదనంగా రోజుకు 3 వేల మంది భక్తులకు వసతి కల్పిస్తున్నాం.
 • శ్రీవారి సేవకుల సౌకర్యార్థం రూ.96 కోట్లతో శ్రీవారి సేవా భవన సముదాయాలను అందుబాటులోకి తీసుకువచ్చాం. తద్వారా రోజుకు 3 వేల మంది శ్రీవారి సేవకులకు వసతి కల్పిస్తున్నాం.

ఆధునిక సి.సి. కెమెరాలు :

 • భక్తుల భదత్రకోసం మొదటి దశలో 280 అత్యాధునిక సిసి కెమెరాలను ఏర్పాటు చేశాం. 2వ దశలో రూ.15.48 కోట్లతో 1,050 సిసి కెమెరాల ఏర్పాటు ప్రక్రియ ఈ సంవత్సరం పూర్తి చేస్తాం.

వి.ఐ.పి బ్రేక్‌ దర్శనంలో కేటగిరీలు రద్దు :

 • శ్రీవారి దర్శనానికి విచ్చేసే ప్రముఖులకు కేటాయించే విఐపి బ్రేక్‌ దర్శనంలో ఎల్‌1, ఎల్‌ 2 రద్దు చేయడం ద్వారా అదనంగా ఒక గంట సమయం ఆదా అవుతుంది. ఈ సమయంలో దాదాపు 5 వేల మంది సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నాం.

శ్రీవారి లడ్డూలు :

 • తిరుమలలో రోజుకు ఒక లక్ష లడ్డూలు అదనంగా భక్తులకు కౌంటర్ల ద్వారా అందిస్తున్నాం.

భక్తులు చెల్లించిన నాణేలు :

 • పరకామణిలో దాదాపు రూ.20 కోట్ల వరకు నిల్వ ఉన్న నాణేలను మరో 15 రోజుల్లో వివిధ బ్యాంకులకు తరలించేందుకు చర్యలు చేపట్టాం.

టిటిడి స్థానిక ఆలయాలు :

 • తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం ఆస్థానమండపంలో 600 మంది కూర్చునేందుకు వీలుగా ప్రత్యేక హాల్‌ను ఏర్పాటు చేశాం.
 • శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ఇతర అనుబంధ ఆలయాలకు భక్తుల సంఖ్య విశేషంగా పెరుగుతోంది. అందుకు అనుగుణంగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం.
 • హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌, తమిళనాడులోని కన్యాకుమారి, హర్యానాలోని కురుక్షేత్రంలో నూతనంగా నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయాలను అందుబాటులోకి తీసుకువచ్చాం. భక్తుల రద్దీకి తగినట్లు సౌకర్యాలు కల్పించాం.

మహాసంప్రోక్షణ :

 • 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు తిరుమలలోని శ్రీ వరాహస్వామివారి ఆలయం, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయం, శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయాల్లో నిర్వహించాం.

ఇతర ప్రాంతాలలో టిటిడి ఆలయాలు :

 • అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణపనులు జరుగుతున్నాయి.
 • విశాఖలో రూ.17 కోట్లతో నిర్మిస్తున్న శ్రీ వేంకటేశ్వర దివ్యక్షేత్రాన్ని ఈ ఏడాదిలో పూర్తి చేస్తాం.
 • ఏజెన్సీ ప్రాంతాలైన సీతంపేట, రంపచోడవరంలో రూ.9 కోట్లతో శ్రీవేంకటేశ్వర దివ్యక్షేత్రాల నిర్మాణ పనులు చేపట్టాం.
 • భువనేశ్వర్‌లో రూ.6.70 కోట్లతో శ్రీవారి ఆలయ నిర్మాణపనులు జరుగుతున్నాయి.
 • చెన్నైలో రూ.5.75 కోట్లతో శ్రీ పద్మావతి ఆలయ నిర్మాణపనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.
 • కడప జిల్లా గండిలోని శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయాన్ని టిటిడి పరిధిలోకి తీసుకున్నాం. శ్రావణమాసం ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నాం.

భక్తులకు అందుబాటులో నూతన భవనాలు :

 • తిరుచానూరులో రూ. 77 కోట్లతో నూతనంగా నిర్మించిన శ్రీ పద్మావతి నిలయం, తిరుమలలో రూ.43 కోట్లతో నిర్మిస్తున్న శ్రీ వకుళామాత విశ్రాంతి గృహాన్ని త్వరలో ప్రారంభిస్తాం.
 • అదేవిధంగా, తిరుచానూరులో టిటిడికి చెందిన శ్రీనివాస, పద్మావతి కల్యాణమండపాలను రూ.20 కోట్లతో ఆధునీకరిస్తున్నాం.

ధర్మప్రచారం :

 • ధర్మప్రచారంలో భాగంగా ఎస్‌సి, ఎస్‌టి, మత్స్యకార కాలనీల్లో ఆలయాల నిర్మాణం, ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు అర్చక శిక్షణ నిర్వహిస్తున్నాం.
 • అదేవిధంగా, రూ.7 కోట్ల నిధులతో 36 శ్రీవారి ఆలయాలు, రూ.25 కోట్లతో వివిధ ఆలయాల మరమ్మత్తులు, పునర్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
 • శ్రీవారి వైభవాన్ని, సనాతన ధర్మ ప్రచారాన్ని మరింత విస్తృతంగా ప్రచారం చేసేందుకు గత కొన్ని సంవత్సరాలలో శ్రీనివాస కల్యాణోత్సవాల ప్రాజెక్ట్‌ ద్వారా 577 శ్రీవారి కల్యాణాలను నిర్వహించాం. ఇందులో ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార ప్రాంతాలలో ఇప్పటివరకు 242 శ్రీవారి కల్యాణాలను నిర్వహించాం.

ఆన్‌లైన్‌లో సేవలు :

 • టిటిడి ముద్రించిన దాదాపు 2,700 ఆధ్యాత్మిక, భక్తి సంగీత ప్రచురణలను పాఠకులకు ఆన్‌లైన్‌లో ఉంచాం.
 • భవిష్యత్తులో టిటిడి ముద్రించే అన్ని పుస్తకాలను ఆన్‌లైన్‌లో ఉంచేందుకు చర్యలు తీసుకున్నాం.
 • జూన్‌ నెల నుండి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలోని 255 టిటిడి కల్యాణమండపాలకు ఆన్‌లైన్‌ బుకింగ్‌ సదుపాయం కల్పించాం.
 • టిటిడి స్థానిక ఆలయాలలో నిర్వహించే ఆర్జిత సేవలను భక్తులకు ఆన్‌లైన్‌లో అందుబాటులోనికి తీసుకువచ్చాం.
  టిటిడి సంస్థలకు ఐఎస్‌వో గుర్తింపు :
 • టిటిడి సంస్థలలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ 12 టిటిడి సంస్థలకు ఐఎస్‌వో (ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్‌ ఆర్గనైజేషన్‌) గుర్తింపు లభించింది. ఇందుకు కృషి చేసిన అధికారులకు, సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నాను.

శ్రీవాణి ట్రస్టు:

 • వివిధ ప్రాంతాలలో శ్రీవారి ఆలయాల నిర్మాణంకోసం ఏర్పాటుచేసిన శ్రీవేంకటేశ్వర ఆలయ నిర్మాణం ట్రస్టు (శ్రీవాణి)కు ఇప్పటివరకు 16,400 మంది దాతలు విరాళాలు అందించారు.

ఎస్వీబీసీ :

 • యువతలో భక్తిభావం, నైతిక విలువలు, సనాతన ధర్మం, పండుగలు, సాంప్రదాయాలు తదితర సేవలు సమర్థవంతంగా ప్రసారం చేస్తున్న శ్రీ వేంకటేశ్వర భక్తిఛానల్‌ కోసం రూ.25 కోట్లతో నిర్మిస్తున్న నూతన భవనాన్ని త్వరలో ప్రారంభిస్తాం.

విద్య :

 • టిటిడి విద్యాసంస్థల్లో నాణ్యమైన బోధన, వసతి, భోజన ఇతర సౌకర్యాలు కల్పించడంతో విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం బాగా పెరిగింది. విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం.
 • ఈ సంవత్సరం నుండి ఎస్వీ వేద విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు వేదవిద్యతోకూడిన ఎమ్మెస్సీ, ఎమ్‌ఏ (తెలుగు), పౌరోహిత్యం, వేదశాఖలలో డిప్లమో కోర్సులను అందుబాటులోనికి తీసుకువచ్చాం.
 • వేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ మొత్తాన్ని రూ.1 లక్ష నుండి రూ.4 లక్షల వరకు పెంచాం.
 • ఎంఫిల్‌, పిహెచ్‌డి కోర్సుల పరిశోధక విద్యార్థులకు స్టయిఫండ్‌ పెంచాం.

టిటిడి ఉద్యోగులు :

 • టిటిడి ఉద్యోగుల సంక్షేమం, ఆరోగ్యం, క్వార్టర్స్‌, ఇండోర్‌ స్టేడియం తదితర సౌకర్యాలపై ఎప్పటికప్పుడు ఉద్యోగులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటున్నాం.
 • ఇటీవల శ్రీవారి ఆలయాన్ని రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి తదితర ప్రముఖులు సందర్శించి భక్తులకు టిటిడి కల్పిస్తున్న సౌకర్యాలను అభినందించారు. దీన్ని ఉద్యోగులు స్ఫూర్తిగా తీసుకుని మరింత ఆదర్శవంతంగా సేవలందించి భక్తుల మన్ననలు పొందాలని కోరుతున్నా.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*