టిటిడి ఈవోగా తొలి నిర్ణయంతోనే జవహర్‌ రెడ్డి ముద్ర..!

తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్‌ జవహర్‌ రెడ్డి, మూడు రోజుల్లోనే పాలనలో తనదైన ముద్ర వేశారు. నిర్ణయాలు తీసుకోవడంలో స్వతంత్రంగా, నిర్మొహమాటంగా వ్యవహరించగలరన్న అభిప్రాయాన్ని కలిగించగలిగారు. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలపై జవహర్‌ రెడ్డి తీసుకున్న సంచలన నిర్ణయమే ఇందుకు కారణం. ఇప్పుడు ఇదే సర్వత్రా చర్చనీయాంశంగా ఉంది.

తిరుమల శ్రీనివాసుని వార్షిక బ్రహ్మోత్సవాలు ఇటీవలే జరిగాయి. కోవిడ్‌ నిబంధనలను దృష్టిలో ఉంచుకుని ఆలయంలోనే ఏకాంతంగా ఉత్సవాలు నిర్వహించారు. ఈనెల 16 నుంచి స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలను ఏకాంతంగా కాకుండా, తిరు మాడవీధుల్లో ఊరేగింపులతో, భక్తుల సమక్షంలో నిర్వహిస్తామని టిటిడి ప్రకటించింది. కరోనా ప్రమాదం పొంచివుండగా….ఇటువంటి నిర్ణయం తీసుకోవడంపై అందరూ ఆశ్చర్యపోయారు.

నవరాత్రి బ్రహ్మోత్సవాలను మాడవీధుల్లో నిర్వహించాలని ఎక్కడ నిర్ణయించారో తెలియదు. మొన్నటిదాకా ఈవోగా ఉన్న అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ వెళ్లిపోయాక, కొత్త ఈవో నియామకం జరగక మునుపు టిటిడి అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు కూడా చేశారు. మాడ వీధుల్లో భక్తులు భౌతిక దూరం పాటిస్తూ కూర్చోడానికి వీలుగా వృత్తాలు గీశారు. బందోబస్తు కోసం పోలీసులు చర్యలు చేపట్టారు. విద్యుత్‌ దీపాలంకరణల, ఫలపుష్ప ప్రదర్శన ఏర్పాటు కోసం ఇంజినీరింగ్‌, గార్డెన్‌ విభాగాలు పనులు ప్రారంభించాయి. ఇవన్నీ చూశాక నవరాత్రి బ్రహ్మోత్సవాలు మాడ వీధుల్లోనే జరుగుతాయన్న భావనకు అందరూ వచ్చేశారు.

ఇంతలో ఈవోగా జవహర్‌ రెడ్డి నియామకం జరిగింది. ఆయన ఈనెల 10వ తేదీన బాధ్యతలు చేపట్టారు. వెంటనే నవరాత్రి బ్రహ్మోత్సవాలపై దృష్టి సారించారు. అప్పటికే అధికారులు చేసిన నిర్ణయాన్ని పున: సమీక్షించాలని నిర్ణయించుకున్నారు. అటు టిటిడి, ఇటు జిల్లా అధికారులతో చర్చించిన అనంతరం నవరాత్రి బ్రహ్మోత్సవాలను కూడా ఏకాంతంగానే నిర్వహించాలని ఈవో జవహర్‌ రెడ్డి నిర్ణయించారు. ఒకరకంగా ఇది సంచలన నిర్ణయమనే చెప్పాలి.

తనకు ఎదురులేదని, ఎటువంటి నిర్ణయమైనా తీసుకోగలనని చెప్పుకుంటూ హడావుడి చేసిన అధికారికి జవహర్‌ రెడ్డి నిర్ణయంతో గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అయింది. అప్పటికే నవరాత్రి బ్రహ్మోత్సవాలు భక్తుల మధ్య నిర్వహించాలని నిర్ణయించాం కనుక…ఆ నిర్ణయమే అమలైపోతుందని భావించారు. జవహర్‌ రెడ్డి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.

మొన్నటి దాకా ఈవోగా ఉన్న సంఘాల్‌ పట్టీపట్టనట్లు ఉండిపోయారు. ఒక విధంగా చెప్పాలంటే…ఆయన పేరుకు ఈవో అయినా నిర్ణయాల్లో ఆయన పాత్ర నామమాత్రమనే చెప్పాలి. ఈ పరిస్థితుల్లో జవహర్‌ రెడ్డి స్వతంత్రంగా వ్యవహరిస్తారా….లేక ఎవరికో కట్టుబడి పని చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. మొదటి నిర్ణయంతోనే తాను స్వతంత్రంగా పనిచేయగల సత్తా ఉన్న అధికారన్న సంకేతాలను ప్రజల్లోకి పంపగలిగారు.

నవరాత్రి బ్రహ్మోత్సవాలనూ ఏకాంతంగా నిర్వహించాలని ఈవో జవహర్‌ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రత్యేకించి టిటిడి ఉద్యోగులు ఎతంగానో సంతోషిస్తున్నారు. రోజూ వేలాది కరోనా కేసులు నమోదువుతున్న నేపథ్యంలో వేలాది భక్తుల మధ్య బ్రహ్మోత్సవాలు నిర్వహించడమంటే ప్రమాదం కొని తెచ్చుకున్నట్లేనని ఉద్యోగులు భయపడ్డారు. తమ మనసులో మాట చెప్పినా ఎవరూ వినరన్న భావనతో మిన్నకుండిపోయారు. ఈ పరిస్థితుల్లో జవహర్‌ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగులు, అర్చకులు ఊపిరి పీల్చుకున్నారు.

జవహర్‌ రెడ్డి మొన్నటి దాకా ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖను నడిపించిన అధికారి. కరోనాను కట్టడి చేయడంలో కేరళ తరువాత ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సమర్థంగా పని చేసిందన్న ప్రశంసలు దక్కడానికి జవహర్‌ రెడ్డి పనితీరే కారణం. ఆయన అత్యంత ప్రణాళికాబద్ధంగా కరోణాను కట్టడి చేయగలిగారు. ఆయనే ఈవోగా రావడంతో ఎంతో మేలు జరిగిందని చెప్పాలి. కరోనా ప్రమాదం సమసిపోలేదని తెలిసిన ఆయనకు, వేలాది భక్తులు గుమిగూడితే తలెత్తే ప్రమాదం ఎంతటిదో బాగా తెలుసు. అందుకే నవరాత్రి బ్రహ్మోత్సవాలనూ ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయించారు.

కరోనా నేపథ్యంలో బ్రహ్మోత్సవాలు మాడ వీధుల్లో నిర్వహిస్తే ఎదురయ్యే ఇబ్బందులేమిటో కూలంకషంగా తెలుసుకున్నారు. దర్శనం టికెట్లు ఉన్న వారినే మాడవీధుల్లోకి అనుమతించాలని అధికారులు నిర్ణయించినప్పటికీ…. బ్రహ్మోత్సవాలకు తిరుమల, తిరుపతి వాసులను అనుమతించకుంటే తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. దీన్ని కూడా ఆయన పరిగణనలోకి తీసుకున్నట్లున్నారు. అందుకే ఈ బ్రహ్మోత్సవాలనూ ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయించారు.

ఏదిఏమైనా జవహర్‌ రెడ్డి తన సమర్ధతను ఒకటి రెండు రోజుల్లోనే చాటుకున్నారు. అదేవిధంగా…వస్తూవస్తూ టిటిడి ఉద్యోగుల బ్రహ్మోత్సవ బహుమానం ఫైల్‌ను క్లియర్‌ చేసుకొచ్చారు. ఇక్కడికొచ్చాక తొలి సంతకం బ్రహ్మోత్సవ బహుమానం ఫైలుపైనే చేశారు. కోవిడ్‌ ప్రమాదం తప్పించడం, బ్రహ్మోత్సవ బహుమానం ఇవ్వడం…ఈ రెండు నిర్ణయాలతో ఉద్యోగుల్లో సానుకూల భావన కలిగించారు. రానున్న రోజుల్లో జవహర్‌ రెడ్డి మరింత సమర్ధవంతంగా పని చేస్తారన్న విశ్వాసం సర్వత్రా వ్యక్తమవుతోంది.

ఆదిమూలం శేఖర్‌, ఎడిటర్‌, ధర్మచక్రం

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*