టిటిడి ఈవో సింఘాలపై బాబుకు ఎంత ఘాటు ప్రేమయో..!

– రెండు నెలల క్రితమే పదవీ పొడిగింపు ఉత్తర్వులు

– ఎన్నికల దృష్ట్యా ముందుజాగ్రత్త

టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక అభిమానాన్ని పదేపదే చాటుకుంటున్నారు. బంగారు తరలింపు వివాదంలో సిఘాల్ ను బహాటంగానే సమర్ధించిన సంగతి తెలిసిందే. టిటిడి బంగారం వివాదంలో తన అనుమతి లేకుండా విచారణ కమిటీని ఎలా వేస్తారని పిఎస్ ఎల్.వి.సుబ్రమణ్యం ను తప్పుబట్డిన చంద్రబాబు… విచారణ నివేదికలో ఈవో అనిల్ కుమార్ సిఘాల్ ను తప్పుబట్టడంపై ఫైర్ అయ్యారు. ఈవో ఏ తప్పూ చేయకున్నా ఆయన్ను ఎలా తప్పుబడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ నివేదికకు ఆమోద ముద్ర వేయకుండా పక్కన పెట్డారు.

చంద్రబాబు ఒక అధికారిని బహాటంగా సమర్ధించిన ఉదంతాలు ఎన్నడూ లేవంటారు. ఎంత‌ సానుకూలంగా పని చేసున అధికారి విషయంలోనూ బాబు బహిరంగంగా మద్దతు ఇవ్వరని ఆయన్ను గురించి బాగా తెలిసినవారు చెబుతారు. అనిల్ కుమార్ సింఘాల్ విషయంలో మాత్రం అందుకు భిన్నంగా స్పందించారు.

ఇప్పుడు ఇదంతా ఎందుకంటే…ఈవో సింఘాల్ విషయంలో మరో ప్రత్యేక శ్రద్ధ కూడా చంద్రబాబు తీసుకున్నారు. సింఘాల్ ను టిటిడి ఈవోగా నియమిస్తూ 2018, మే 6వ తేదీన ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇది ఏడాది కాలాని మాత్రమే పరిమితం చేస్తూ ఇచ్చిన జీవో. సాధారణంగా గడువు ముగియడానికి ఒకటి రెండు రోజుల ముందుగా పొడిగించడం గానీ, బదిలీ చేయడంగానీ చేస్తారు. అయితే సింఘాల్ విషయంలో రెండు నెళ ముందుగానే పొడిగింపు ఉత్తర్వులు ఇచ్చారు. 08.05.2020 దాకా సింఘాల్ ని ఈవోగా కొనసాగించేలా 08.03.2019 న జీవో ఇచ్చారు.

ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి కొద్ది రోజులు ముందుగా ఈ జీఓ జారీ చేసారు. మొదటి సంవత్సరం గడువు ముగిసే…మే దాకా ఆగితే ఎన్నికల కోడ్ వల్ల ఉత్తర్వులు ఇచ్చే అవకాశం సిఎం చేతిలో ఉండదు.‌అందుకే ముందుజాగ్రత్తగా మార్చిలోనే పొడిగంపు జీవో ఇచ్చారన్నమాట. ఆ విధంగా చంద్రబాబు నాయుడు ఈవో సింఘాల్ మీద ఉన్న ప్రేమను చాటుకున్నారు.

అసలు సింఘాల్ నియామకం సమయంలోనే అనేక అంశాలు చర్చనీయాంశం అయ్యాయి. ఉత్తరాదికి చెందిన వ్యక్తిని టిటిడి ఈవోగా ఎలా నియమిస్తారని కొందరు స్వామీజీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలుగువారినే ఈవోగా నియమించాలన్న డిమాండ్ ఇక్కడి ఐఎఎస్‌ అధికారుల నుండి వచ్చింది. అయినా సింఘాల్ వైపే చంద్రబాబు మొగ్గారు. ఆయన్నే టిటిడి ఈవోగా నియమించారు. బిజెపి ఒత్తిడి వల్లే సింఘాల్ ను నియమించారన్న ప్రచారం అప్పట్లో జరిగింది. అయితే…సింఘాల్, సిఎం చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా మసలుకోవడంతో ఆయన మద్దతు లభించిందని, అందుకే మరో ఏడాది పొడిగింపు కూడా వచ్చిందని పరిశీలకులు అంటున్నారు.

ఏదేమైనా శ్రీవారికి పరమ భక్తుడైన సింఘాల్ మరో ఏడాది పాటు వెంకన్న సేవలో తరించనున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*