టిటిడి ఉద్యోగాల వివాదం… కడప జిల్లాకు 75 శాతం రిజర్వేషన్ : వైసిపికి లాభమా..!

కడప జిల్లా పరిధిలోని టిటిడి అనుబంధ ఆలయాలలో కొన్ని నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసారు. అందులో కడప జిల్లాకు 75 శాతం కోటాగా నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో టిటిడి ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాయలసీమ మేధావుల ఫోరం డిమాండ్ చేస్తోంది.

రాయలసీమకు నష్టం…..
టిటిడిలోని దిగువ శ్రేణి నియామకాలు జోనల్ పద్ధతిలో జరపాలి. అందువల్ల నాలుగు రాయలసీమ జిల్లాలకు ప్రయోజనం కలుగుతుంది. జిల్లాలవారీగా 75 శాతం పద్దతి పాటిస్తే నేడు రాయలసీమ లోని కడప జిల్లా వారే కదా అనుకోవచ్చు. కానీ టిటిడి అనుబంధ ఆలయాలు 13 జిల్లాలలో ఉన్నాయి. వాటిలో నియామకాలు జరిగినపుడు 75 శాతం పాటిస్తే 9 జిల్లాలలో జరిగే నియామకాలలో రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతుందని ప్రభుత్వం టిటిడి అధికారులు గుర్తించాలి. దేశంలోని ఇతర రాష్ట్రాలలో ఉన్న అనుబంధ ఆలయాలలో జరిగే నియామకాల పరిస్థితి ఏమిటి అన్న ప్రశ్నకు టిటిడి సమాధానం చెప్పాలి. టిటిడి కేంద్రం రాయలసీమలోని తిరుపతిలో ఉన్నది. తిరుపతి కేంద్రంగా నియామకాలు జరిగితే అన్ని అవకాశాలతో 75 శాతం రాయలసీమకు దక్కుతుంది. జిల్లాల వారీగా చేపడితే సీమకు నష్టం జరుగుతుంది. క్రమంగా రాయలసీమ వాసుల హక్కుగా ఉన్న టిటిడిలోని అవకాశాలను రాయలసీమ వాసులు కోల్పోయే ప్రమాదం ఉంది.

చట్టం ముందు నిలబడదు….
టిటిడిలో కడప జిల్లా కేంద్రంగా విడుదల చేసిన నోటిఫికేషన్ కు చట్టబద్ధత ఉండదు. టిటిడిలో సంబంధిత ఉద్యోగాలు దాదాపు 300 దాకా కాళీలు ఉన్నాయి అని తెలుస్తుంది. అలాంటిది ఒక జిల్లాకు పరిమితం కావడం అందులో కేంద్రంలోని ఖాళీలు జోలికి పోకుండా నోటిఫికేషన్ విడుదల చేయడం వల్ల పారదర్శకత లోపించింది. శాశ్వత నియామకాల్లో జోనల్ వ్యవస్థకు చట్టబద్ధత ఉన్నది కానీ జిల్లాల వారీగా స్థానికతకు లేదు.

అధికార పార్టీ నేతలు స్పందించాలి…
రాయలసీమకు నష్టం జరిగే జిల్లాల వారీగా నియామకాల పద్ధతికి స్వస్తి చెప్పి జోనల్ పద్దతిలో జరిగేలా టిటిడిలో నిర్ణయం జరిగేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకునేల అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు తమవంతు ప్రయత్నాలు చేయాలి. జరగబోయే నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని రాయలసీమ ప్రజలు ప్రభుత్వం పై ఒత్తిడి చేయాలి

-మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి
సమన్వయకర్త,
రాయలసీమ మేధావుల ఫోరం

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*