టిటిడి ఉద్యోగులకు ఈ‌ భరోసా సరిపోదు..!

కరోనా విపత్తు వేళ ప్రాణాలకు తెగించి తిరుమల లో ఉద్యోగం చేస్తున్న టిటిడి ఉద్యోగులకు భరోసా కల్పిస్తూ టిటిడి పాలకమండలి రెండు రోజుల క్రితం ఒక నిర్ణయం‌ తీసుకుంది. టీటీడీ ఉద్యోగుల కోసం ప్రత్యేక కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఉద్యోగులందరికీ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పింది. తాజాగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, తిరుమలలో పనిచేసే ఉద్యోగులకు పౌష్టికాహారం అందించడానికి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి గానీ…ఇప్పటికే ప్రకటించిన విషయాల్లో ఆచరణ లోపభూయిష్టంగా ఉందని‌ అంటున్నారు. సరిచేయాలని కోరుతున్నారు.

ప్రధానంగా తిరుమలలో విధులకు హాజరయ్యే ప్రతి ఉద్యోగికి అలిపిరిలోనే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఆ పరీక్షల ఫలితాలు వెల్లడించడంలో జాప్యం జరుగుతోందని చెబుతున్నారు. డ్యూటీలో చేరాక ఎప్పుడో ఫలితం చెబుతున్నారని, దీనివల్ల ప్రయోజనం లేదని‌ అంటున్నారు. ఇంటివద్ద నుంచి వచ్చిన ఉద్యోగికి అలిపిరిలో కాకుండా, ఎక్కడైనా అతిథిగృహాల వద్ద పరీక్షలు నిర్వహిం చాలని, కొన్ని‌ గంటల్లో ఫలితాలు వెల్లడించి, విధులకు పంపాలని కోరుతున్నారు. ఒకవేళ టెస్టు ఫలితం రావడానికి ఆలస్యమయ్యే పరిస్థితి ఉంటే… ఉద్యోగులు‌ అక్కడే నిరీక్షించడానికి ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.

ఇక తిరుమలలో మంచి వసతి, భోజనం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కరోనా విరామం‌ తరువాత, దర్శనాలు ప్రారంభమైనప్పటి నుంచి,‌ తిరుమలలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు మంచి భోజనం కరువయింది. ఎంప్లాయిస్ క్యాంటీన్ లో రోజూ సాంబారు అన్నం, పెరుగన్నం మాత్రమే పెడుతున్నారని వాపోతున్నారు. ఏడు‌ రోజులు‌ తిరుమలలోనే ఉండి పని చేయాల్సి రావడం, ప్రైవేటు హోటళ్లు లేకపోవడంతో ఎంప్లాయిస్ క్యాంటీన్ లోనే భోంచేయాల్సివుంది. ప్రతిరోజూ, రెండు పూటలా సాంబారు అన్నం, పెరుగన్నం తినలేక…కొందరు సొంతంగా ఆఫీసులు, కాటేజీల్లో స్టవ్ పెట్టుకుని వండుకుని‌‌ తింటున్నారు. దీనికి‌‌ అదనపు ఖర్చు‌‌ అవుతోంది. టీ తాగాలన్నా‌ క్యాంటీన్ కు వెళ్లాల్సిన పరిస్థితి. పని వదలిపెట్టి క్యాంటీన్ కు వెళ్లే అవకాశం ఉండదు. దీంతో ఉద్యోగులు చాలామంది టీ కూడా లేకుండా పని చేస్తున్నారు. పనిచేసే చోటికే టీ, స్నాక్స్ వంటివి పంపితే బాగుంటుందని ఉద్యోగులు కోరుతున్నారు.

ఇదిలావుండగా…ఇకపైన 15 రోజులు‌ కంటిన్యూగా పనిచేసేలా మార్పు చేయాలని మొన్నటి బోర్డు సమావేశంలో నిర్ణయించారు. దీనిపైన ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కరోనా వేళ అన్ని రోజులు కుటుంబాన్ని వదిలేసి ఉండటం ఇబ్బందని‌ అంటున్నారు. పిల్లలు, వృద్ధలు బాగోగులు ఎలా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల షిఫ్ట్ తగ్గించాలని కోరుతుంటే…15 రోజులకు పెంచడం సరికాదని వాపోతున్నారు. దీనిపై పునరాలోచన చేయాలని కోరుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*