టిటిడి ఉద్యోగులపై చర్యలు సాధ్యమా..?

ఒకపార్టీ ఇచ్చిన రాజకీయ విందుకు టిటిడి ఉద్యోగులు హాజరయ్యారన్న అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ విందుకు వెళ్లిన ఉద్యోగులను గుర్తించి చర్యలు తీసుకోడానికి టిటిడి విజిలెన్స్‌ అధికారులు విచారణ జరుపుతున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే….ఉద్యోగులను గుర్తించినా చర్యలు తీసుకోవడం సాధ్యమా అనేది ప్రశ్న.

ప్రభుత్వ, అనుబంధ ఉద్యోగులెవరూ రాజకీయ పార్టీల కార్యకలాపాల్లో పాల్గొనడకూడదని చట్టాలు చెబుతున్నాయి. అంటే ఒక పార్టీ తరపున ప్రచారం చేయడంగానీ, ఒక పార్టీ గుర్తును ధరించడంగానీ, ఒక పార్టీ సభలు, సమావేశాల్లో పాల్గొనడంగానీ చేయకూడదు.

టిటిడి ఉద్యోగులు కొందరు ఇటీవల తిరుపతిలో ఒకచోట సమావేశమయ్యారు. ఆ సమావేశంలో ఓ పార్టీ అభ్యర్థి కూడా పాల్గొన్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియాలు బయటకు వచ్చాయి. దీని ఆధారంగా టిటిడి విజిలెన్స్‌ అధికారులు విచారణ జరుపుతున్నట్లు చెబుతున్నారు.

రాజకీయ పార్టీ నేతలను కలవడం తప్పుకాదు. పార్టీల నేతలతో చర్చించడం తప్పుకాదు. రాజకీయ పార్టీల పదవులు తీసుకోవడం, ఆ పార్టీ బ్యానర్‌ కింద జరిగే సభల్లో పాల్గొనడం వంటివే తప్పుగా పరిగణించాల్సివుంటుంది. బ్యానర్లు ఏవీ లేకుండా ఒక గెట్‌ టుగెథర్‌ వంటిదిది నిర్వహిసే…అందులో పాల్గొన్నంత మాత్రాన తప్పుకాబోదు.

తిరుపతిలో జరిగినది అటువంటి సమావేశమే. ఒక సామాజిక తరగతికి చెందిన వారు సమావేశమయ్యారు. పార్టీ జెండాలుగానీ, గుర్తులుగానీ ఏవీ అక్కడ లేవు. ఇందువల్ల…ఇది రాజకీయ ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసిన సమావేశమే అనుకున్నా, అక్కడ రాజకీయ అంశాలు చర్చకు వచ్చాయని అనుకున్నా…. పాల్గొన్న ఉద్యోగులపై చర్యలు తీసుకునే అధికారం టిటిడి అధికారులకు ఉండదు. ఈ విచారణ వృథా ప్రయాసే తప్ప…దానివల్ల ప్రయోజనం లేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*