టిటిడి ఉద్యోగులపై బోర్డుకు కోపమా..?

టిటిడిలో పనిచేసే రెగ్యులర్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులపై ధర్మకర్తల మండలికి కోపమో తాపమోగానీ….ఓ మంచి ప్రతిపాదను తిరస్కరించింది. ప్రతిఏటా ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానం ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. అయితే…బ్రహ్మోత్సవాల తరువాత బోర్డు తీర్మానం చేయడం, ఆపై ప్రభుత్వానికి పంపడం, ప్రభుత్వం నుంచి అనుమతి రావడం…ఇవన్నీ జరగడానికి కొన్ని నెలల సమయం పట్టేది. సెప్టెంబర్‌ – అక్టోబర్‌లో ఉత్సవాలు జరిగితే…బ్రహ్మోత్సవ బహుమానం ఇచ్చే సరికి ఏ జూన్‌-జులై అయ్యేది. అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులకైతే మరీ ఆలస్యం జరిగేది. బ్రహ్మోత్సవ బహుమానం వెంటనే ఇవ్వాలంటూ కార్మికులు ఆందోళనలు చేసిన ఉదంతాలూ ఉన్నాయి.

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని టిటిడి అకౌంట్స్‌ విభాగం మంచి ఆలోచన చేసింది. బ్రహ్మోత్సవాలకు ముందుగా జరిగిన పాలక మండలి సమావేశంలోనే… బహుమానానికి సంబంధించిన తీర్మానాన్ని పెట్టింది. ఎటూ బ్రహ్మోత్సవ బహుమానం ఇవ్వాలికాబట్టి…ఉత్సవాల ప్రారంభానికి ముందే దీనికి సంబంధించిన తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపితే…రెండో బ్రహ్మోత్సవం ముగిసిన వెంటనే…నగదు చెల్లించవచ్చన్న అభిప్రాయంతో ప్రతిపాదనను బోర్డు ముందుకు తీసుకెళ్లారు. ఇటీవల సమ్మె నోటీసు ఇచ్చిన ఉద్యోగులపై ధర్మకర్తల మండలికి, అధికారులకు కోపం ఉన్నట్లుంది…అందుకే ఈ మంచి తీర్మానానికి ఆమోద ముద్ర వేయలేదు.

ఈ తీర్మానాన్ని బోర్డు ఆమోదించి ప్రకటించివుంటే…టిటిడికి ఉద్యోగుల్లో మంచిపేరు వచ్చేది. తమ గురించి అధికారులు, ధర్మకర్తల మండలి ఆలోచిస్తోందని సంతోషించివుండేవారు. పైసా ఖర్చులేకుండా ఉద్యోగ కార్మికుల అభిమానాన్ని చూరగొనే అవకాశాన్ని ధర్మకర్తల మండలి ఎందుకు వదులుకున్నదో అర్థంకాదు. ఉత్సవాలకు మునుపు బహుమానం ప్రకటించివుంటే…ఉద్యోగులు మరింత ఉత్సాహంగా పనిచేసేవారు. ఏమి ఆలోచించారోగానీ…ఓ మంచి ప్రతిపాదనను తిరస్కరించారు.

బ్రహ్మోత్సవ బహుమానం గురించి కొన్ని వివరాలు…
1990 నుంచి బ్రహ్మోత్సవ బహుమానం ఇస్తున్నారు. ఆ ఏడాది బేసిక్‌ పేలో 15 రోజుల వేతనాన్ని ఇచ్చారు. ఎలాంటి పరిమితులూ లేవు. ఆ తరువాత 1991 నుంచి 1998 దాకా బేసిక్‌ పేలో 15 రోజుల వేతనం అంటూనే కనిష్టం రూ.500 – గరిష్టం రూ.1000 అని పరిమితులు పెట్టారు. 1999 నుంచి 2004 దాకా రూ.1000-రూ.2000 చేశారు. 2005లో రూ.1500 – రూ.3,000గా సవరించారు. 2006 నుంచి క్యాడర్‌తో సంబంధం లేకుండా నిర్ణీత మొత్తం ఇస్తూ వస్తున్నారు. 2006లో రూ.3000తో మొదలుపెట్టి 2009 దాకా ఏడాదికి రూ.1000 పెంచుతూ వచ్చారు. 2010లో రూ.6,500, 2011లో రూ.7,500 ఇచ్చారు. అప్పటిదాకా రెగ్యులర్‌ ఉద్యోగులకు మాత్రమే బ్రహ్మోత్సవ బహుమానం ఇచ్చేవారు. అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు కార్మికుల ఆందోళనల ఫలితంగా 2012లో తిరుమలలో పనిచేసే అవుట్‌ సోర్సింగ్‌ / కాంట్రాక్టు కార్మికులకు మాత్రమే ఇచ్చారు. ఆ ఏడాది రెగ్యులర్‌ ఉద్యోగులకు రూ.8000 ఇస్తే, మిగతావారికి రూ.4000 ఇచ్చారు. 2013 నుంచి తిరుపతిలో పనిచేసేవారికి కూడా ఇవ్వడం ప్రారంభించారు. రెగ్యులర్‌ ఉద్యోగులకు ఇచ్చేదాంట్లో సగం మాత్రమే అవుట్‌ సోర్సింగ్‌ వాళ్లకు ఇస్తూవస్తున్నారు. 2013లో రూ.10,000 – రూ.5,000 ఇచ్చారు. 2014లో రూ.11,000 – రూ.5,500; 2015లో రూ.12,200 – రూ.6,100; 2016లో రూ.12,500 – రూ.6,250; 2017లో రూ.13,125 – రూ.6,552 ఇచ్చారు. ఈ ఏడాది ఎంతోకొంత పెంచి ఇవ్వనున్నారు. ఉద్యోగ కార్మికుల బ్రహ్మోత్సవ బహుమానానికి రూ.రూ.21 కోట్లు దాకా ఖర్చవుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*