టిటిడి ఉద్యోగుల దుస్థితికి సాక్ష్యం భవ్య ..! వైద్యం ఎప్పటికీ అందని ద్రాక్షేనా..!!

టిటిడిలో ఉద్యోగమంటే…బయట నుంచి చూసేవారికి గొప్పగా అనిపిస్తుంది. అయితే…బయట పల్లకి మోత…ఇంట్లో ఈగల మోత అన్నట్లు ఉంది టిటిడి ఉద్యోగుల పరిస్థితి. అనారోగ్యంపాలైనా, ప్రమాదానికి గురైనా సరైన వైద్యం అందని దుస్థితిలో ఉన్నారు టిటిడి ఉద్యోగులు. ఇందుకు తాజా సాక్ష్యం జూనియర్‌ అసిస్టెంట్‌ భవ్య దీనావస్థ.

తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న సి.భవ్య గత ఆదివారం స్వామివారి దర్శనం కోసం ద్విచక్ర వాహనంలో తిరుమలకు బయలుదేరారు. మార్గమధ్యంలో ప్రమాదవశాత్తు కిందపడిపోయారు. వెనుకే వస్తున్న బస్సు ఆమె కాలిపైన ఎక్కేసింది.

తీవ్రంగా గాయపడిన ఆమెను చికిత్స కోసం స్విమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఆమె ఉన్న పరిస్థితికి చికిత్స అందించల సదుపాయాలు స్విమ్స్‌లో లేవు. వెంటనే చెన్నై అపోలోకి తరలించారు. ఆమె కుడికాలు మోకాలు దాకా తీసేయాల్సివచ్చింది. ఈ వైద్యానికి రూ.10 లక్షలు ఖర్చవుతుందని అపోలో వైద్యులు తేల్చి చెప్పారు. అప్పోసప్పో చేసి వైద్యం చేయించుకున్నారు భవ్య.

నిన్నటిదాకా హాయిగా నడుస్తూ తిరుగున్న భవ్య…ఇప్పుడు ఒక కాలు కోల్పోయి నడకలేని పరిస్థితికి చేరుకుంది. ఇదే పెద్ద మానసిక క్షోభ. దీనికి తోడు వైద్యం కోసం లక్షల రూపాయలు సమకూర్చుకోవడం ఎంతటి ఇబ్బందో అర్థం చేసుకోవచ్చు.

సమస్య ఏమంటే…ఏ ప్రభుత్వ ఉద్యోగికో ఇటువంటి పరిస్థితి దాపురిస్తే వెంటనే ఉచితంగా వైద్యం చేయించుకునే అవకాశం ఉంది. హెల్త్‌ కార్డుల ద్వారా నగదు రహిత వైద్య సేవలు పొందడానికి వీలుంది. పైసా ఖర్చు లేకుండా చికిత్స చేయించుకోవచ్చు.

టిటిడి ఉద్యోగులకు అటువంటి సదుపాయం లేదు. టిటిడిలో 8,500 మంది రెగ్యులర్‌ ఉద్యోగులు పని చేస్తున్నారు. ఈ ఉద్యోగులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల్లో వైద్యం ఒకటి. ఎటువంటి జబ్బు వచ్చినా తిరుపతిలోని స్విమ్స్‌కు వెళ్లాలి. అక్కడేమో నైపుణ్యంగల వైద్యులు లేరు. అవసరమైన వైద్య సదుపాయాలు లేవు. ప్రాణాలు నిలబెట్టు కోవాలంటే… భవ్య మాదిరి ఏ చెన్నైకో, వేలూరుకో, బెంగుళూరుకో, హైదరాబాద్‌కో వెళ్లక తప్పని అనివార్యత.

తమకూ నగదు రహిత వైద్య సేవలు పొందడానికి వీలుగా హెల్త్‌ కార్డులు ఇవ్వాలని టిటిడి ఉద్యోగులు కోరుతున్నారు. ఇదిగో అదిగో అంటూ దశాబ్దాలు గడిపేస్తున్నారు తప్ప…ఇప్పటిదాకా కార్డులు ఇచ్చిన పాపానపోలేదు. చెన్నై, బెంగుళూరు, వెల్లూరు, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లోని కార్పొరేట్‌ ఆస్పత్రులతో టిటిడి కనీసం ఒప్పందం చేసుకున్నా ఎంతోకొంత వెసులుబాటు ఉంటుంది. ఆ ఒప్పంద ప్రయాత్నాలూ ఇప్పటిదాకా కార్యరూపం దాల్చలేదు.

ఈ పరిస్థితుల్లో అత్యవసరంగా బయటి ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుంటున్న టిటిడి ఉద్యోగులు…సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకుని, ఆ తరువాత రీయింబర్స్‌మెంట్‌ కోసం బిల్లులు సమర్పిస్తున్నారు. బిల్లులు పెట్టిన తరువాత టిటిడిలోని కమిటీ పరిశీలించి, ఆపై బోర్డుకు పెట్టిన బిల్లులు చెల్లిస్తున్నారు. దీనికి నెలల గడచిపోతున్నాయి. ఒక్కోసారి పెట్టిన ఖర్చు మొత్తం రావడం లేదు. ఏదోపేరు చెప్పి కోత విధిస్తున్నారు. ఒక్కోసారి బిల్లులు తిరస్కరిస్తున్న పరిస్థితీ ఉంది. అప్పుడు ఏ బోర్డు సభ్యున్నో పట్టుకుని పాస్‌ చేయించుకోవాల్సి వస్తోంది.

భవ్య విషయంలోనూ…మొత్తం బిల్లును రీయింబర్స్‌ చేయాలని టిటిడి ఉద్యోగ సంఘాల నేతలు ఎం.నాగార్జున, జి.వెంకటేశం, చీర్ల కిరణ్‌, తదితరులు తిరుపతి జెఈవో బసంతకుమార్‌ను కలిశారు. తమ తోటి ఉద్యోగులకు పెద్ద ఆపద వచ్చినపుడు నాయకులు వెళ్లి అధికారులను ప్రాదేయపడాల్సివస్తోంది.

ఇలాంటి వాటితో ఉద్యోగులు విసిగిపోతున్నారు. ఉద్యోగులకు వైద్యం అందించడంలో అలసత్వం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కొత్త ప్రభుత్వంలోనైనా తమకు హెల్త్‌ కార్డులు వస్తాయన్న ఆశతో ఉద్యోగులు ఉన్నారు. ఈ విషయంలో ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి చొరవ తీసుకోవాలి. ఉద్యోగులకు తక్షణం హెల్త్‌ కార్డులు ఇప్పించాలి.

– ఆదిమూలం శేఖర్‌, ఎడిటర్‌, ధర్మచక్రం ప్రతినిధి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*