టిటిడి ఎంప్లాయిస్ బ్యాంకు ఎన్నికల గంట మోగింది

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టిటిడి ఎంప్లాయిస్ బ్యాంకు ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయింది. ఎన్నికల అధికారి బ్రహ్మానందరెడ్డి బుధవారం ఉదయం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈనెల 19 తేదీన పోలింగ్ జరగనుంది. ఈనెల 11వ తేదీ 10 గంటల నుంచి నాలుగు గంటల వరకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ జరుగుతుంది. 12వ తేదీ పరిశీలన చేపడతారు. 13వ తేదీ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. 13వ తేదీ సాయంత్రం 5 గంటల పైన పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. వెంటనే అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. 19 తేదీ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. తిరుపతిలో గోవిందరాజస్వామి హైస్కూల్లో, తిరుమల ఎస్వి హై స్కూల్ లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. పోలింగ్ అనంతరం మూడు గంటల నుండి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఓట్ల లెక్కింపు గోవిందరాజస్వామి హై స్కూల్ లోనే జరుగుతుంది. అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు.

టీటీడీ ఎంప్లాయిస్ బ్యాంకు కు సంబంధించి మొత్తం ఏడుగురు డైరెక్టర్లను ఎన్నుకోవాలి. టీటీడీ బ్యాంకులో 7,500 మంది దాకా సభ్యులుగా ఉన్నారు. గత పాలకవర్గం గడువు 2019 ఫిబ్రవరితో ముగిసింది. అప్పటి నుండి ఎప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారని అందరూ ఎదురుచూస్తున్నారు. అనేక కారణాల రీత్యా సహకార శాఖ అధికారులు ఎన్నికలను వాయిదా వేస్తూవచ్చారు. సహకార శాఖ అధికారి, బ్యాంకు జనరల్ మేనేజర్, అకౌంట్స్ అధికారితో త్రిసభ్య కమిటీ వేసి బ్యాంకు పాలనా వ్యవహారాలు నడిపించారు. టీటీడీ ఉద్యోగుల ఒత్తిడి మేరకు ఎట్టకేలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు.

ఈసారి బ్యాంకు డైరెక్టర్ గా పోటీ చేయడం కోసం చాలామంది పోటీపడుతున్నారు. ఏడు పోస్టులకు 20 మంది దాకా పోటీచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీటీడీ లోని ఉద్యోగ సంఘాలు ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేశాయి. ఉద్యోగ సంఘాలతో నిమిత్తం లేకుండా స్వతంత్రంగా పోటీ చేస్తున్న వారూ ఉన్నారు. వాస్తవంగా మార్చిలోనే ఎన్నికలు జరుగుతాయని భావించి అభ్యర్థులు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఎన్నికలు వాయిదా పడడంతో అందరూ నీరుగారిపోయారు. ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ మొదలవడంతో మళ్లీ హడావిడి ప్రారంభమైంది.

PDF Embedder requires a url attribute

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*