టిటిడి ఏఈవో లక్ష్మీనారాయణ యాదవ్‌ మరణం వెనుక…!

– ఆదిమూలం శేఖర్‌, సంపాదకులు, ధర్మచక్రం

టిటిడి అధికారుల సంఘం నాయకులు, సీనియర్‌ ఏఈవో లక్ష్మీ రాయణ యాదవ్‌ ఆకస్మిక మరణం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన అనారోగ్యంతో ఆస్పత్రిపాలై మరణించినట్లు చెబుతున్నా…గత కొన్ని రోజులుగా లక్ష్మీనారాయణ యాదవ్‌ అనుభవించిన మనోవేదన కూడా మరణానికి ఆయన్ను దగ్గర చేసిందన్న అభిప్రాయం టిటిడి ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది.

లక్ష్మీనారాయణ యాదవ్‌ చురుకైన, ధైర్యవంతుడైన అధికారి. ఆయన తన ఉద్యోగం తాను చూసుకోలేదు. టిటిడిలో అధికారుల హక్కుల కోసం పోరాడారు. ముఖ్యమైన పోస్టుల్లోకి ప్రభుత్వం నుంచి డిప్యుటేషన్‌పై తీసుకురావడాన్ని వ్యవతిరేకిస్తూ వచ్చారు ఆయన. ఈ అంశంపై అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి దృష్టికి కూడా తీసుకెళ్లారు. టిటిడిలోనే అర్హులైన అధికారులు ఉన్నారని, డిప్యూటేషన్లు తగ్గించి సంస్థలోని ఉద్యోగులనే ఆ పోస్టుల్లో నియమించాలని కోరారు.

ఆ మధ్యకాలంలో అధికారులు లక్ష్మీనారాయణపై కోపం తెప్పించిన అంశం మరొకటి కూడా ఉంది. 2017 వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉద్యోగులను దర్శనానికి అనుమతించకపోవడం చర్చనీయాంశమయింది. ఆ సందర్భంగా జరిగిన చర్చల సందర్బంగా ఇచ్చిన హామీలతో పాటు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలు సమ్మె నోటీసు ఇచ్చాయి. అందులో అధికారుల సంఘం తరపున లక్ష్మీనారాయణ యాదవ్‌ సంతకం పెట్టారు.

ఈ ధోరణి సహజంగానే ఉన్నతాధికారులకు మింగుడుపడదు. లక్ష్మీనారాయణ యాదవ్‌ ఒక విధానం గురించి మాట్లాడితే…తమను వ్యక్తిగతంగా వ్యతిరేకిస్తున్నట్లుగా అపార్థం చేసుకున్నారు కొందరు అధికారులు. ఈ క్రమంలోనే ఆయన్ను శ్రీనివాసమంగాపురానికి బదిలీ చేశారు. అయితే…ఇంతలోనే పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ఛైర్మన్‌ అయ్యారు. ఆయనే ఏరికోరి లక్ష్మీనారాయణను తన వద్ద నియమించుకున్నారు. ఇది ఉన్నతాధికారులకు కోపం తెప్పించింది.

ఇక ఛైర్మన్‌ కార్యాలయంలో పని చేస్తున్న సమయంలోనూ లక్ష్మీనారాయణ యాదవ్‌ను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారు. ఛైర్మన్‌ పిఎస్‌ చేయాల్సిన పనులను ఏఈవోగా ఉన్న లక్ష్మీనారాయణ చేస్తున్నారంటూ ఓ వివాదం సృష్టించారు. దాని ఆధారంగా చేసుకుని లక్ష్మీనారాయణను ఛైర్మన్‌ కార్యాలయం నుంచి తప్పించారు. దర్శనాలకు పిఎస్‌ బదులు లక్ష్మీనారాయణ సంతకాలు చేశారన్న ఆరోపణతో క్రమశిక్షణా చర్యల కోసం డిఏ సెక్షన్‌లో ఫైల్‌ ఓపెన్‌ చేశారని కూడా ఆరోపణలున్నాయి.

ఈ క్రమంలో ప్రభుత్వం మారడం, పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ఛైర్మన్‌ పదవి కోల్పోవడం చకచకా జరిగిపోయాయి. ఇదే అదునుకుగా ఆయన్ను ముంబయికి బదిలీ చేశారు. అంతదూరం వెళ్లడానికి తటపటాయిస్తూ ఉన్నతాధికారులను కలిసి విన్నవించుకున్నా….వాళ్లు కరుణించలేదు. వెంటనే వెళ్లి జాయిన్‌ అవకుంటే…దీన్నీ ఒక క్రమశిక్షణా రాహిత్యంగా భావించి డిఏ సెక్షన్‌లో ఫైల్‌ ఓపెన్‌ చేస్తామని బెదిరించినట్లు సమాచారం. దీంతో విధిలేని పరిస్థితుల్లో ఆయన ముంబయి వెళ్లి బాధ్యతలు చేపట్టారు.

సాధారణంగా దూర ప్రాంతాల్లోని పోస్టులకు కొత్త ప్రమోషన్లు వచ్చిన వారిని పంపుతుంటారు. అటువంటిది సీనియర్‌ అయిన లక్ష్మీనారాయణను పంపడమంటే….కక్ష సాధింపేనని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతూవస్తున్నారు. అదేవిధంగా లక్ష్మీనారాయణ కూడా ముంబయి వెళ్లినప్పటి నుంచి పలుపర్యాయాలు…తనకు దగ్గరగా ఉన్న పలువురు పాత్రికేయులకు ఫోన్‌ చేసి తనపై అధికారులు కక్ష సాధిస్తున్నారని వాపోయారు.

ఈపరిస్థితుల్లో లక్ష్మీనారాయణ కొన్ని రోజులుగా తీవ్ర మనోవేదనతో ఉన్నారు. ఏదో అనారోగ్య సమస్యతో ఆస్పత్రిపాలై….మరిన్ని ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టి ఆఖరికి ప్రాణాలు కోల్పోయారు. దీనిపై ఉద్యోగ సంఘాల నేతలు, కుటుంబ సభ్యులు నోరు విప్పుతారో లేదోగానీ…లోలోన మాత్రం తీవ్రంగా మదనపడుతున్నారు.

టిటిడిలో ఉద్యోగమంటే టెన్షన్‌తో కూడుకున్నది. అత్యంత సున్నితమైన వ్యవహారాల్లో చిన్న తప్పు జరిగినా పెద్ద శిక్షలు అనుభవించాల్సివస్తుంది. (టిటిడిలో పని ఒత్తిడి ఎలావుందో ఇంకో కథనంలో రాస్తాను). దీనికి కక్షసాధింపు కూడా తోడైతే ఉద్యోగులు, అధికారులు ప్రశాంతంగా పని చేయలేరు. ఆపై ఇటువంటి అనర్ధాలే సంభవిస్తుంటాయి. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు గుర్తించాలని కోరుకుంటూ….లక్ష్మీనారాయణ యాదవ్‌కు ధర్మచక్రం నివాళులు అర్పిస్తోంది.

లక్ష్మీనారాయ‌ణ యాద‌వ్ భౌతిక‌కాయాన్ని సంద‌ర్శించి నివాళుల‌ర్పిస్తున్న‌టిటిడి మాజీ ఛైర్న‌న్ పుట్టా సుధాక‌ర్‌యాద‌వ్‌

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*