టిటిడి ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ప్లకార్డులతో నిరసన

టిటిడిలోని ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బందిని ఆంధ్ర‌ప్ర‌దేశ్ కార్పొరేషన్ ఫ‌ర్ ఔట్‌సోర్సింగ్ స‌ర్వీసెస్‌(APCOS)లో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఔట్‌సోర్సింగ్ సిబ్బంది మంగళవారం ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. టిటిడి పరిపాలనా భవనంతో పాటు తిరుపతిలోని టీటీడీ సంస్థల్లో అవుట్సోర్సింగ్ సిబ్బంది భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరించి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నిరసన కార్యక్రమం అనంతరం యథావిధిగా విధుల్లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా సిఐటియు జిల్లా అధ్య‌క్షుడు ఎం.నాగార్జున మాట్లాడుతూ….

ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని APCOSలో విలీనం చేసే ప్రక్రియను టిటిడి తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గారు ఇచ్చిన హామీ మేర‌కు 14 వేల మంది ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు కార్మికులకు టైంస్కేల్ వ‌ర్తింప చేయాల‌ని కోరారు. టైంస్కేల్‌కు సంబంధించి టిటిడి ఛైర్మ‌న్ వైవి.సుబ్బారెడ్డితోపాటు బోర్డు స‌భ్యులు మ‌రియు తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి, చంద్ర‌గిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు. మే 20న బుధవారం ఉద‌యం 8 గంట‌ల‌కు టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నం ఎదుట పెద్ద ఎత్తున ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులంద‌రూ సామాజిక దూరాన్ని పాటిస్తూ ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించి శాంతియుతంగా నిర‌స‌న తెలియ‌జేస్తామని తెలిపారు.

ఔట్సోర్సింగ్ ఉద్యోగులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆయా విభాగాల వారీగా, సంస్థల వారీగా ప్లకార్డులు ప్రదర్శించారు. అన్ని విభాగాల్లో టీటీడీ రెగ్యులర్ ఉద్యోగులు వీరికి మద్దతు ప్రకటించారు. టిటిడి పరిపాలనా భవనం, సెంట్రలైజ్డ్ అవుట్సోర్సింగ్ సెల్, రవాణా విభాగం, ముద్రణాలయం, చీఫ్ ఎడిటర్ కార్యాలయం, సేల్స్ వింగ్, బర్డ్, s.v. ఆయుర్వేద కళాశాల, ఆయుర్వేద ఆసుపత్రి, కేంద్రీయ వైద్యశాల, శ్రవణం, అన్నమాచార్య ప్రాజెక్టు, శ్వేతా భవనం, అన్న ప్రసాదం విభాగం, ఉద్యానవన విభాగం, విద్యా విభాగం, ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, ఎస్ జి ఎస్ ఆర్ట్స్ కళాశాల హాస్టళ్లు, ఎస్వీ పూర్ హోమ్, తిరుపతి, పరిసర ప్రాంతాల్లోని టీటీడీ అనుబంధ ఆలయాలు, శ్రీనివాసమంగాపురంలోని ఆయుర్వేద ఫార్మసీ తదితర ప్రాంతాల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికులు నిరసన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు నాయకురాలు లక్ష్మి, టిటిడి స్టాఫ్ అండ్ వ‌ర్క‌ర్స్ యునైటెడ్ ఫ్రంట్ నాయ‌కులు, ఎంప్లాయిస్ బ్యాంక్ డైరెక్ట‌ర్ జి.వెంక‌టేశం, టిటిడి జెఏసి ఛైర్మ‌న్ జి.వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి, టిటిడి కాంట్రాక్టు ఎంప్లాయిస్ అండ్ వ‌ర్క‌ర్స్ యూనియ‌న్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి టి.సుబ్ర‌మ‌ణ్యం, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగ సంఘాల నేతలు హరిప్రసాద్, నవీన్, రూప్ కుమార్, హరి, నిరంజన్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*