టిటిడి కాంట్రాక్టర్‌ భాస్కర్‌నాయుడు ఇంటికే..!

టిటిడితో పాటు పలు ఆలయాల్లో, ప్రభుత్వ సంస్థ్లల్లో పారిశుద్ధ్య కాంట్రాక్టులు సంపాదించిన పద్మావతి హౌస్‌ కీపింగ్‌ సంస్థ తీరుపై కార్మికుల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఇష్టారాజ్యంగా కార్మికులను తొలగించడం, వేతనాల్లో కోత వేయడం వంటి చర్యలతో ఆగ్రహించిన కార్మికులు ఆందోళనలు చేసిన ఉదంతాలు ప్రతిచోటా ఉన్నాయి. ప్రత్యేకించి టిటిడిలో పద్మావతి సంస్థకు వ్యతిరేకంగా రోజుల తరబడి కార్మికులు దీక్షలు చేపట్టారు. ఈ సంస్థ అధినేత భాస్కర్‌నాయుడుకి ముఖ్యమంత్రితో దగ్గర సంబంధాలు ఉండటం వల్ల అధికారులూ ఆయన్ను ఏమీ చేయలేకున్నారు.

ఒకప్పుడు టిటిడికి సంబంధించిన కాటేజీల్లో పలు సంస్థలు పారిశుధ్య పనులు నిర్వహించేవావి. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక…టిటిడి మొత్తం భాస్కర్‌నాయుడు సంస్థ ఆక్రమించింది. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే భాస్కర్‌ నాయుడికి అనుకూలంగా టిటిడి అధికారులు వ్యవహరించడం వల్లే కాంట్రాక్టులన్నీ ఆ సంస్థ పరమయ్యాయని టిటిడి కార్మికులు చెబుతున్నారు.

ఒక్క టిటిడి మాత్రమే కాదు….రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలైన శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీశైలం, విజయవాడ తదితర ఆలయాల్లోనూ, ఎస్‌వి యూవనివర్సిటీ వంటి చోట్ల కూడా పద్మావతి హౌస్‌కీపింగ్‌ సంస్థ తిష్టవేసింది. టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత వందల కోట్ల రూపాయల లేబర్‌ కాంట్రాక్టులను భాస్కర్‌ నాయుడు దక్కించుకున్నారు.

ఇప్పుడు ఇదంతా ఎందుకంటే…వైసిపి అధికారంలోకి వస్తే ఇటువంటి కాంట్రాక్టు సంస్థలకు కాలంచెల్లే సూచనలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో జరిగిన ఓ సమావేశంలో వైసిపి అధినేత జగన్‌ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘ఆలయాల్లో పారిశుద్ధ్య పనులనూ కాంట్రాక్టుకు ఇచ్చారు. ముఖ్యమంత్రి బంధువైన భాస్కర్‌ నాయుడికి లక్ష రూపాయల పనిని నాలుగు లక్షలకు ఇచ్చారు. అన్నిచోట్లా పనులు కాంట్రాక్టుకు ఇవ్వడం, ఆపై పంచుకోవడం. ఇటువంటి కాంట్రాక్టులను చిన్నచిన్నవిగా చేసి కార్మికులకే ఇవ్వొచ్చుకదా’ అని జగన్‌ వ్యాఖ్యానించారు.

వాస్తవంగా లేబర్‌ కాంట్రాక్టు అనేది రాష్ట్ర వ్యాపితంగా పెద్ద సమస్యగా మారింది. సంస్థలకు – కార్మికులకు మధ్య దళారులు పుట్టుకొచ్చి కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. టిటిడిలో ఒక దశలో దీనికి బ్రేక్‌ వేశారు. కార్మికులను సొసైటీలుగా ఏర్పాటు చేసి, వారికే కాంట్రాక్టు ఇవ్వడం మొదలు పెట్టారు. దీనివల్ల చేసేది కాంట్రాక్టు పనే అయినా….ఉద్యోగానికి భద్రత ఏర్పడింది. సంస్థ ఎంత ఇస్తే అంత కార్మికులకే దక్కేది. మధ్యలో ఏమయిందోగానీ మళ్లీ కాంట్రాక్టర్లకు ఇవ్వడం మొదలుపెట్టారు. దీంతో భాస్కర్‌ నాయుడు వంటి వాళ్లు తిష్టవేయగలిగారు.

అధికారంలోకి ఎవరు వచ్చినా….కాంట్రాక్టు పద్ధతిని రద్దు చేయగలిగితే లక్షలాది కుటుంబాలు బాగుపడుతాయి. ఆలయాలు, యూవనిర్సటీలు, వివిధ ప్రభుత్వ సంస్థల్లో కాంట్రాక్టుపై పని చేస్తున్న వారికి కనీసం టైస్కేలు ఇచ్చినా….ఎంతో మేలు చేసినవారవుతారు. తాము అధికారంలోకి వస్తే కాంట్రాక్టు కార్మికులకు టైం స్కేల్‌ ఇస్తానని జగన్‌ పాదయాత్రలో హామీ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా ఆలయాల్లో పారిశుద్ధ్య కాంట్రాక్టుపై ప్రస్తావించారు. తాము అధికారంలోకి వస్తే భాస్కర్‌నాయుడు వంటి లేబర్‌ కాంట్ట్రార్లకు కాలం చెల్లడం ఖాయమని వైసిపి నేతలు చెబుతున్నారు. ఎవరు అధికారంలోకి వచ్చినా…కార్మికుల శ్రమను దోచుకునే విధానానికి నూకలు చెల్లాలన్నదే ధర్మచక్రం కోరుకునేది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*