టిటిడి కాంట్రాక్టర్ భాస్కర్ నాయుడికి భానుప్రకాష్‌ రెడ్డి సపోర్ట్..! టిటిడి కార్మికుల్లో ఆగ్రహం..!!

టీటీడీలో ఎఫ్ఎంఎస్ కాంట్రాక్టు పనులు చేస్తున్న పద్మావతి హాస్పిటాలిటీ అండ్ మేనేజ్ మెంట్ సర్వీసెస్ సంస్థ అధినేత భాస్కర్ నాయుడికి మద్దతుగా…బిజెపి నేత, టిటిడి మాజీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి మాట్లాడటం చర్చనీయాంశం అవుతోంది.

ఇటీవల టివి 9 డిబేట్ లోనూ, ఈ రోజు (26.02.2020) ఎపి 24 ఛానల్ చర్చ సందర్భంగానూ భానుప్రకాష్ రెడ్డి…టిటిడి లేబర్ కాంట్రాక్టర్ భాస్కర్ నాయుడి ప్రస్తావన తెచ్చారు. జగన్ ప్రభుత్వం ఒక కులంపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని చెబుతూ…ఇందుకు ఉదాహరణగా భాస్కర్ నాయుడి గురించి చెప్పారు. ఆయన కాంట్రాక్టు గడువు ఇంకా మూడేళ్లు ఉన్నప్పటికీ అన్నపళంగా రద్దు చేశారని చెప్పారు.

దీనిపైన వేడివాడి చర్చ జరిగింది. ఏపి 24 టివిలో వైసిపి తరపున చర్చలో పాల్గొన్న కొండా రాజీవ్ ఘాటుగా స్పందించారు. కాంట్రాక్టర్ గురించి మీకెందుకు…ప్రజా సమస్యలు ఉంటే చెప్పండి…కాంట్రాక్టర్ నుంచి మీకు రావాల్సిన కమీషన్ పోయిందా…కాంట్రాక్టరు ఏ తప్పు చేశారో ఎందుకు రద్దు చేశారో తెలుసుకోండి… అంతేగానీ ఈ విధంగా బురద చల్లొద్దు…అని రాజీవ్ వ్యాఖ్యానించారు. ఇటీవల టివి 9 చర్చలోనూ వైసిపి ప్రతినిధి ఇదేవిధంగా స్పందించారు.

ఇదిలావుండగా…కాంట్రాక్టరుకు మద్దతుగా భానుప్రకాష్ రెడ్డి మాట్లాడటంపై టిటిడి కార్మికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. గత తెలుగుదేశం ప్రభుత్వంలోని పెద్దలకు దగ్గరగా ఉంటూ…టిటిడితో పాటు రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలు, ఆస్పత్రిలు, యూనివర్శిటీలలో పారిశుధ్యం, అతిథి గృహాల నిర్వహణ కాంట్రాక్టు పనులను భాస్కర్ నాయుడు దక్కించుకున్నారు.

ఒక్క టిటిడిలోనే తిరుమల, తిరుపతిలో వందల కోట్ల పనులు ఆయన వంశమయ్యాయి. టిటిడి అధికారులు లోపాయికారిగా సహకరించడం వల్లే దాదాపు అన్ని పనులూ ఆయనకు దక్కాయన్న ఆరోపణలు వచ్చాయి.

ఇక… భాస్కర్ నాయుడి ప్రవేశించాక కార్మికులపై వేధింపులు అధికమయ్యాయి. 50 ఏళ్ల పైబడిన వారిని తొలగించడం, కార్మికుల సంఖ్య తగ్గచడం, ఇష్టా‌నుసారం బదిలీ చేయడం…వంటి చర్యలతో విసిగిపోయిన కార్మికులు ఆందోళనకు దిగిన ఉదంతాలున్నాయి.

ఈ సమస్యలపైన కార్మిక సంఘాల నేతలు ఎప్పటికప్పుడు టిటిడి అధికారులకు, ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేశారు. అయితే…తనకు నేరుగా చంద్రబాబుతోనూ, లోకేష్ తోనూ సంబంధాలున్నాయని, తాను వారి కుటుంబానికి బంధువునని చెప్పుకుంటూ భాస్కర్ నాయుడు అధికారులను బెదిరించేవారని కూడా కార్మిక సంఘాల నేతలు విమర్శించారు.

ఇదేసమయంలో…పాదయాత్రలో భాగంగా జిల్లాకు వచ్చిన అప్పటి ప్రతిపక్ష నేత, ఇప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి సిఐటియు నేతలు కందారపు మురళి, నాగార్జున, వెంకటేశం తదితరాలు తీసుకెళ్లారు. దీ‌నిపైన స్పందించిన జగన్ తాము అధికారంలోకి వస్తే లేబర్ కాంట్రాక్టు వ్యవస్థ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ క్రమంలోనే వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత…రాష్ట్ర స్థాయిలో అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. టిటిడితోపాటు ప్రభుత్వ శాఖలు, ఆస్పత్రులు, యూనివర్శిటీలు తదితర వాటిలో పని చేసే కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ కార్మికులందరనీ ఈ కార్పొరేషన్ పరిధిలోకి తెచ్చి, దానిద్వారా వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈమేరకు ఆయా సంస్థల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ , కాంట్రాక్ట్ కార్మికుల వివరాలు అందజేయాలని హౌసింగ్ కార్పొరేషన్ నుంచి ఆదేశాలు అందాయి. టీటీడీ కూడా ఇటువంటి వివరాలను హౌసింగ్ కార్పొరేషన్ పంపించింది. అయితే తన వద్ద పనిచేస్తున్న కార్మికుల వివరాలు అందజేయడంలో భాస్కర్ నాయుడు అలసత్వం ప్రదర్శించినట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు ఆయన కాంట్రాక్టును రద్దు చేసినట్లు చెబుతున్నారు.

ఇవేమి పట్టించుకోకుండా భానుప్రకాష్ రెడ్డి కులం కోణంలోనే ఈ వ్యవహారంపై మాట్లాడడం, భాస్కర్ రెడ్డిని వెనుకేసుకుని రావడంపై టీటీడీ కార్మికుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. భాస్కర నాయుడిపై ఉన్న విమర్శలను, ఆరోపణలను పట్టించుకోకుండా ఇలా మాట్లాడడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి కాంట్రాక్టర్ల దోపిడీకి గురవుతున్నామని, ఎట్టకేలకు కాంట్రాక్టర్ల పీడ విరగడవుతున్నందుకు సంతోషంగా ఉందని, ఈ పరిస్థితుల్లో తమ మనోభావాలకు వ్యతిరేకంగా మాట్లాడవద్దని కోరుతున్నారు.
… ఆదిమూలం శేఖర్, సంపాదకులు, ధర్మచక్రం

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*