టిటిడి కాంట్రాక్టు కార్మికుల సమర శంఖం!

టిటిడిలో పని చేస్తున్న రెగ్యులర్‌ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనకు సమాయత్తం అవుతున్న నమయంలోనే….కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులూ సమర శంఖం మోగించారు. తమ సమస్యలను ఆగస్టు 15వ తేదీ లోపు పరిష్కరించకుంటే….భారీస్థాయిలో ప్రత్యక్ష ఆందోళనకు పూనుకుంటామని హెచ్చరించారు. ఉద్యమ కార్యాచరణను ప్రకటించడం కోసం టిటిడిలోని అన్ని విభాగాలకు చెందిన కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులు 27.07.2019న సమావేశమయ్యారు.

తిరుమల తిరుపతి దేవస్థానంలో రెగ్యులర్‌ ఉద్యోగులు 8,500 మంది ఉండగా, అవుట్‌ సోర్సింగ్‌-కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్నవారు 14,500 మంది ఉన్నారు. పారిశుద్ధ్య విభాగం నుంచి ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ విభాగం దాకా కాంట్రాక్టు / అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులు లేని చోటే లేదు. అయితే…ఈ కార్మికులంతా కాంట్రాక్టర్ల చేతిలో దోపిడీకి గురవుతున్నారు. చాలీచాలన వేతనాలను బతుకులీడిస్తున్నారు. సగటున ఒక్కో కార్మికునికి రూ.7 వేల వేతనం కూడా లభించడం లేదు. ఈ జీతంతో ఇంటి అద్దెలు చెల్లించలేక, కుటుంబాన్ని పోషించలేక, పిల్లలకు చదువు చెప్పించలేక కార్మికులు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీకావు. పైగా కాంట్రాక్టరు మారినపుడల్లా ఉద్యోగ భయం వెంటాడుతూ ఉంటుంది. ఎవర్ని పనిలో పెట్టుకుంటారో ఎవర్ని తీసేస్తారో తెలియని స్థితి.

రాష్ట్ర ప్రభుత్వం అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు కార్మికుల వేతనాలను పెంచుతూ జీవో నెం.151 విడుదల చేసి దాదాపు రెండేళ్లవుతున్నా ఇప్పటిదాకా అది టిటిడిలో అమలుకావడం లేదు. ఈ జీవోను అమలు చేస్తే అత్యంత కిందిస్థాయిలో పనిచేసే పారిశుధ్య కార్మికులకు కూడా రూ.12,000 వేతనం అందుతుంది. జీవోను అమలు చేయాలని కార్మికులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఇదిగో అదిగో అంటున్నారు తప్ప అమలు చేయడం లేదు. గట్టిగా అడిగితే ప్రభుత్వం అంగీకరించడం లేదని చెబుతున్నారు. కొన్నేళ్ల క్రితం సుప్రీంకోర్టు ‘సమాన పనికి సమాన వేతనం’ అనే మార్గదర్శకాలు ఇచ్చింది. దీని ప్రకారం….రెగ్యులర్‌, అవుట్‌సోర్సింగ్‌-కాంట్రాక్టు అనే తేడా ఉండకూడదు. ఒక విధమైన పని చేసేవాళ్లందరికీ ఒకే రకమైన వేతనం ఇవ్వాలి. దీన్ని అమలు చేస్తే జీవో నెం.151 కంటే మెరుగైన వేతనం లభిస్తుంది.

నిత్యం లక్ష మందికి అన్నదానం చేస్తున్నామని గొప్పలు చెప్పుకునే టిటిడి…సంస్థలో పనిచేసే అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు కార్మికులకు మాత్రం కాసింత భోజనం పెట్టదు. రెగ్యులర్‌ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన క్యాంటీన్లలో వీరికి ప్రవేశం లేదు. ప్రైవేట్‌ ఫ్యాక్టరీలు కూడా రెగ్యులర్‌-కాంట్రాక్టు అనే తేడా లేకుండా భోజనం పెడుతుంటాయి. ఆ కనీస కార్మిక చట్టాలు కూడా టిటిడిలో అమలు కావడం లేదు. అనార్యంపాలైనపుడు కూడా ఇదే దుస్థితి. టిటిడి ఆస్పత్రుల్లో అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు కార్మికులకు చికిత్స చేయరు. ఆఖరికి ఆగస్టు15, జనవరి 26న ఇచ్చే ప్రశంసాపత్రాలూ వీరు నోచడం లేదు. ఉద్యోగుల వార్షిక క్రీడల్లో పాల్గొనే అర్హత కూడా లేని పరిస్థితి.

అసలు సంస్థకు-తమకు మధ్య కాంట్రాక్టరు లేకుండా చేయాలని కార్మికులు కోరుతున్నారు. టిటిడి ఇచ్చే డబ్బులను కాంట్రాక్టర్లు కొల్లగొడుతున్నారు. కాంట్రాక్టర్లు లేకుండా కార్మికులకే కాంట్రాక్టు ఇస్తే…టిటిడి ఇచ్చే అరాకొరా డబ్బులైనా చేతికి అందుతాయి. కాంట్రాక్టర్లు ఉండటం వల్ల…..రకరకాల పద్ధతుల్లో కార్మికుల శ్రమను దోచుకుంటున్నారు. అందుకే టిటిడి లేబర్‌ కాంట్రాక్టర్ల వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని కార్మికులు కోరుతున్నారు.

తమ సమస్యలను ఆగస్టు 15వ తేదీలోపు పరిష్కరించకుంటే…ప్రత్యక్ష ఆందోళనకు దిగాలని కార్మికులు నిర్ణయించారు. రెగ్యులర్‌ ఉద్యోగులతో కలిసి…ధర్నాలు చేస్తే ధర్నాలు, సమ్మెలు చేస్తే సమ్మెలు చేయాలని తీర్మానించారు. ఈ మేరకు టిటిడి ఈవోకు నోటీసు ఇవ్వనున్నారు. ఈసారి టిటిడితో, ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకోవాలన్న దృఢ నిశ్ఛయంతో ఉన్నారు. ఆ పట్టుదల శుక్రవారం జరిగిన సమావేశంలో మాట్లాడిన నాయకుల మాటల్లో స్పష్టంగా కనిపించింది.

ఈ సమావేశంలో సిఐటియు నాయకులు కందారపు మురళి, సుబ్రమణ్యం, టిటిడి ఎస్‌డబ్ల్యుఎఫ్‌ నాయకులు జి.వెంకటేశం, ఎం.నాగార్జున, మునిరాజ, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. టిటిడి ఫారెస్ట్‌, గార్డెన్‌, హాస్టల్‌ వర్కర్స్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, కల్యాణకట్ట, ఎస్‌విబిసి, ఎఫ్‌ఎంఎస్‌ తదితర విభాగాలకు చెందిన అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*