టిటిడి కాంట్రాక్టు కార్మికులది అరణ్య రోదణేనా! సమస్యలే లేవన్న ఈవో..!

టిటిడిలో పనిచేస్తున్న 14 వేల మందికిపైగా అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు కార్మికులు సమస్యల పరిష్కారం కోసం సంవత్సరాల తరబడి ఆందోళనలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా తరచూ టిటిడి పరిపాలనా భవనం ముందు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. టిటిడి కార్మికుల సమస్యలు ఏమిటో అందరికీ తెలిసినవే. అయితే టిటిడి ఈవో మాత్రం కార్మికుల సమస్యలేమిటో తమ దృష్టికి రాలేదని అంటున్నారు. ప్రభుత్వ చట్టాల ప్రకారం వేతనాలు ఇస్తున్నామని చెబుతున్నారు. ఈవో వ్యాఖ్యలు కార్మికులకు శరాఘాతంగానే చెప్పాలి. ఎందుకంటే సమస్యను పరిష్కరించాల్సిన అధికారే….అసలు సమస్యలే లేవన్నట్లు మాట్లాడితే…ఇక కార్మికుల వేదన తీరీతెలా? 28.08.2018 నాటి బోర్డు సమావేశం అనంతరం జరిగిన మీడియా సమావేశంలో కార్మికుల ప్రస్తావన వచ్చినపుడు…ఈవో స్పందిస్తూ ‘కార్మికుల సమస్య లేమున్నాయి…. జీవోల ప్రకారం వేతనాలిస్తున్నాం. ప్రత్యేకంగా ఎవరికైనా సమస్యలున్నట్లు మా దృష్టికి వస్తే పరిష్కరిస్తాం’ అని వ్యాఖ్యానించారు.

టిటిడిలో రెగ్యులర్‌ ఉద్యోగులు 8000 మంది ఉండగా…అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు పద్ధతిలో 14,000 మందికిపైగా పని చేస్తున్నారు. ఈ కార్మికుల సగటు నెల జీతం రూ.7,000కు మించడం లేదు. అత్యధిక మందికి జీవో 11 ప్రకారం వేతనాలు చెల్లిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇటీవల జీవో 151 విడుదల చేసింది. దీంతో ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు కార్మికుల వేతనాలు ఒక మేరకు పెరిగాయి. ఈ జీవో అమల్లోకి వస్తే అత్యంత కింది స్థాయిలోని పారిశుద్ధ్య కార్మికుల వేతనం రూ.12,000గా నిర్ణయమవుతుంది. ప్రస్తుతం రూ.6,800 మాత్రమే ఇస్తున్నారు. ఈ జీవోను అమలు చేయాలన్నది కార్మికుల ప్రధాన డిమాండ్‌. ఆగస్టు 16 నుంచి ఆందోళన చేపట్టనున్నట్లు కార్మికులు తమ డిమాండ్లతో కూడిన నోటీసును స్వయంగా ఈవోకే ఇచ్చిన విషయం తెలిసిందే. అయినా కార్మికుల సమస్యలేమిటో తెలియవని అంటున్నారు సింఘాల్‌.

టిటిడిలో జీవో 151 అమలుకు అనుమతి ఇవ్వాలని సాంబశివరావు ఈవోగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇప్పటికీ అది ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. ఆ మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్రాంతికి నారావారిపల్లికి వచ్చినపుడు ధర్మచక్రం ప్రతినిధి టిటిడి కార్మికుల సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కొత్త బోర్డు రాగానే వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకుంటారని సిఎం చెప్పారు. బోర్డు వచ్చినా ఇప్పటిదాకా దీనిపై అతీగతీ లేదు. దీంతో కార్మికులు మళ్లీ ఆందోళనలకు దిగారు. ఇంత జరుగుతున్నా కార్మికులకు సమస్యలే లేవన్నట్లు ఈవో మాట్లాడటం మీడియా ప్రతినిధులకు ఆశ్చర్యం కలిగించింది. ఇంకో విషయం ఏమంటే…పీస్‌రేట్‌ బార్బర్స్‌, ఫారెస్టు కార్మికులను పర్మినెంట్‌ చేయమంటూ కోర్టులు ఆదేశాలు ఇచ్చినా…వాటిని అమలు చేయడం లేదు. అప్పీళ్లతో కాలయాపన చేస్తున్నారు.

ఈ అంశంలో టిటిడి బోర్డు, ప్రత్యేకించి ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. కార్మికుల వేతనాలు పెంచడానికి చర్యలు తీసుకోవాలి. ఇది చేయకుంటే….రాజకీయంగానూ తెలుగుదేశం పార్టీ తీవ్రంగా నష్టపోయే సూచనలున్నాయి. 14 వేల మంది కార్మికులు తిరుపతి, చంద్రగిరి, రేణిగుంట ప్రాంతాల్లో కేంద్రీకృతమైవున్నారు. ఇన్ని కుటుంబాల ఓట్లు గండిపడినట్లే…!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*