టిటిడి కాంట్రాక్టు పనులు : మా ఊళ్లో మేమే చేయాలి…ఎవరూ రాకూడదు!

ప్రభుత్వం ఇచ్చే కాంట్రాక్టు పనులను అధికార పార్టీ నాయకులు పంచుకోవడం తెలుసు. పంచాయతీ స్థాయిలో ఆ పంచాయతీలోని నాయకులు పంచుకుంటారు. నియోజకవర్గం స్థాయిలోనైతే ఆ నియోజకవర్గం ఎంఎల్‌ఏనో, ముఖ్య నాయకుడో తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు కాంట్రాక్టులు ఇప్పించి చేయిస్తుంటారు. ఒకరి నియోజకవర్గంలో ఇంకొకరు వెళ్లి పనులు చేయరు. టిటిడికి కూడా అటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. మూ ఊళ్లో పని చేయడానికి ఆయనెవరు…మా ఊళ్లో పని మేమే చేస్తాం…అంటున్నారు. దీంతో టిటిడి అధికారులు తలపట్టుకుంటున్నారు. ఇదెక్కడి మధ్యస్తం…టిటిడి ఇదెక్కడి సంప్రదాయం అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర విభజన తరువాత భద్రాచలం రామాలయానికి దీటుగా కడప జిల్లా ఒంటిమిట్టలోని ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ఏటా శ్రీరామ నవమి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా ఇక్కడే జరిపిస్తోంది. ఈ నేపథ్యలో ఒంటిమిట్టను టిటిడి పరిధిలోకి తీసుకొచ్చి, అక్కడ రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నారు. తాజాగా రూ.15 కోట్లతో కల్యాణ వేదిక నిర్మాణం చేపట్టారు. ఈ పనుల్లోనే ఇప్పుడు ఇటువంటి చర్చ మొదలయింది.

ఒంటిమిట్ట కల్యాణ వేదిక పనులను తిరుపతికి చెందిన ఓ కాంట్రాక్టర్‌ టెండరు ద్వారా దక్కించుకున్నారు. రాజంపేట ప్రాంతానికి చెందిన అధికార పార్టీ నేత అనుచరులూ టెండరు వేశారుగానీ…వారికి లభించలేదు. అయినా కల్యాణ వేదిక పనులను తామే చేస్తామంటూ పట్టుబట్టారట. దీంతో ఆ టెండరు దక్కించుకున్న కాంట్రాక్టరు కూడా దాన్ని వదిలేయడానికి సిద్ధపడ్డారట.

సాధారణంగా ఎవరు టెండరు దక్కించుకుంటే వాళ్లే టిటిడితో అగ్రిమెంట్‌ చేసుకోవాలి. పనుల్లో ఎటువంటి తేడాలు వచ్చినా అధికారులు ఆ కాంట్రాక్టరునే అడుగుతారు. ఇప్పుడు కాంట్రాక్టు దక్కినది ఒకరికైతే…పనులు చేయబోయేది ఇంకొకరు. ఈ పరిస్థితుల్లో ఆ కాంట్రాక్టరును ఏమని ప్రశ్నించగలమని అధికారులు వాపోతున్నారు. టిటిడి పనుల్లో ఇటువంటి సంప్రదాయం ఇప్పటిదాకా లేదు. అధికార పార్టీకి చెందిన వారు కావడంతో ఉన్నతాధికారులూ ఏమీ మాట్లాడలేకున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*