టిటిడి క్యాంటీన్‌ భోజనం ధర భారీగా పెరగనుందా…!

తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం వద్దనున్న క్యాంటీన్‌లో రాయితీ భోజనం ధర భారీగా పెరగనుందా..? టిటిడి పాలక మండలి చేసిన తీర్మానం చూస్తుంటే అవుననే సమాధానమే వస్తుంది.

టిటిడి క్యాంటీన్‌లో రోజుకు 700 మందికి భోజనం, సాయంత్రం టిఫిన్‌, స్నాక్స్‌ రాయితీ ధరపై అందజేస్తున్నారు. మధ్యాహ్నం భోజనంలో అన్నం, సాంబారు, రసం, మజ్జిక, కూటు, పచ్చడి, అప్పళం, కేసరి (శనివారం మాత్రం) వడ్డిస్తున్నారు. ఈ భోజనం విలువ రూ.46.87 అయినప్పటికీ రూ.6కు అందిస్తున్నారు. అంటే ఒక్కో భోజనంపై రూ.40.87 రాయితీ ఇస్తున్నారు.

ఇదిలావుండగా….ప్రస్తుతం వడ్డిస్తున్న భోజనంలో అదనపు రుచులు చేర్చాలని ఉద్యోగులు చేసిన విజ్ఞప్తి మేరకు గత నెలలో జరిగిన బోర్డు సమావేశం ముందుకు ఒక ప్రతిపాదన వెళ్లింది.

ప్రతి సోమ, గురువారాల్లో భోజనంలో… ప్రస్తుతం వడ్డిస్తున్న పదార్థాలతో పాటు వెజిటబుల్‌ రైస్‌ / టమోటా రైస్‌ / పుదినా రైస్‌ / మిరియాల అన్నం ఏదో ఒకటి చేర్చాలన్నది ఆ ప్రతిపాదన సారాంశం. దీనివల్ల ఒక భోజనం ధర రూ.46.87 నుంచి రూ.51 – రూ.54 అవుతుందని అంచనా వేశారు.

దీనిపైన చర్చించిన బోర్డు….మెనును ఖరారు చేసే బాధ్యతను టిటిడి ఈవోకు అప్పగించింది. అయితే….భోజనం తయారీ ఖర్చులో 50 శాతం మాత్రమే టిటిడి భరించేలా నిర్ణయం చేయాలని సూచించింది. ఈ తీర్మానం ప్రకారమైతే…. ప్రస్తుతం వడ్డిస్తున్న భోజనం ధరే రూ.23కు పెరిగే అవకాశ ఉంది. అదే అదనపు రైస్‌తోనైతే రూ.25.50 – రూ.27 అవుతుంది.

ఇదే జరిగితే…టిటిడి ఉద్యోగుల నుంచి తీవ్ర నిరసనను, వ్యతిరేకతను పాలక మండలి ఎదుర్కోవాల్సి రావచ్చు. ఎందుకంటే…క్యాంటీన్‌ నిర్వహణ తీరుపై ఉద్యోగులంతా ఇప్పటికే అసంతృప్తితో ఉన్నారు. టిటిడి పరిపాలనా భవనంలో ఐదు వేల మందికిపైగా ఉద్యోగులు పని చేస్తున్నా….రోజు మొత్తంలో క్యాంటీన్‌ను వినియోగించుకుంటున్నది 700 మంది మాత్రమే.

ఈ పరిస్థితుల్లో రాయితీని 50 శాతానికి పరిమితం చేసి ధర పెంచితే….ఈ అసంతృప్తి మరింత రాజుకోవచ్చు. టిటిడి ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి ఈ అంశంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పున: పరిశీలించాల్సిన అవసరం కనిపిస్తోంది.

ధర్మచక్రం ప్రతినిధి, తిరుపతి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*