టిటిడి ఛైర్మన్‌ పదవిపై కన్నేసిన శివాజీ..!

రాష్ట్ర రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారిన సినీ నటుడు శివాజీ టిటిడి బోర్డు ఛైర్మన్‌ పదవిపై కన్నేశారా? ఎలాగైనా ఆ పదవి చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్నారా? ఇచ్చే ఎన్నికల్లో టిటిడి గెలిచి అధికారం చేపడితే…శివాజీ టిటిడి ఛైర్మన్‌ అవడం ఖాయమా? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం చెప్పాలి. ఎందుకంటే….

శివాజీనే స్వయంగా తాను టిటిడి ఛైర్మన్‌ కావాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆయన స్కైప్‌ ద్వారా వరుసగా టివి ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. మంగళవారం రాత్రి ఓ టివి ఛానల్‌లో మాట్లాడుతూ…తాను భవిష్యత్తులో టిటిడి ఛైర్మన్‌ కావడం ఖాయమని అన్నారు. గతంలోనూ ఓ ఇంటర్వ్యూలో ఇదే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

టిటిడి ఛైర్మన్‌ పదవి అత్యంత ప్రతిష్టాత్మకమైనది. మంత్రి పదవికంటే టిటిడి ఛైర్మన్‌ పదవినే ఇష్టపడేవారు చాలామంది ఉన్నారు. రాష్ట్ర మంత్రికి రాష్ట్రంలో మాత్రమే పలుకుబడి ఉంటే….టిటిడి ఛైర్మన్‌కు దేశ వ్యాపితంగా పేరు పలుకుబడి లభిస్తాయి. జాతీయ స్థాయిలో పరిచయాలు ఏర్పడుతాయి. అందుకే రాజకీయ నాయకులంతా ఒకసారయినా టిటిడి ఛైర్మన్‌ పదివి చేయాలని భావిస్తుంటారు. ఈ పదవి కోసం ఎన్ని కోట్లయినా ఇవ్వడానికి సిద్ధపడే నేతలున్నారు. ఇంతటి ప్రతిష్టాత్మక పదవి తనకు తప్పక దక్కుతుందని శివాజీ ఎలా చెబుతున్నారో అర్థం కాదు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా పేరుతో రాజకీయాలు మాట్లాడటం మొదలుపెట్టిన శివాజీ…రానురానూ అధికార తెలుగుదేశం పార్టీకి మద్దతుదారునిగా మారిపోయారు. ప్రత్యేక హోదా రాకపోడానికి బిజెపి ఎంత కారణమో…టిడిపి కూడా అంతే కారణం. అయితే….శివాజీ మాత్రం బిజేపిని ద్రోహిగా, టిడిపిని పోరాడే పార్టీగా ప్రచారం చేస్తున్నారు.

ఈ క్రమంలో ఆపరేషన్‌ గరుడ అంటూ కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఈ ఆపరేషన్‌ పేరుతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి బిజెపి కుట్రలు చేస్తోందని, ఇందుకోసం వైసిపి, జనసేనను వాడుకుంటోందని (పార్టీల పేర్లు చెప్పకుండా) ఆరోపిస్తున్నారు. సిబిఐ, ఈడి వంటి దాడులు జరుగుతాయని; ప్రతిపక్ష నేతపై ప్రాణహాని లేని దాడి చేసి అల్లర్లు సృష్టించి, శాంతిభద్రతల సమస్యను రేకెత్తించి, ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తారని చెప్పారు.

ఆపరేషన్‌ గరుడ పేరుతో శివాజీ టిడిపి తప్ప అన్ని పార్టీలపైనా తీవ్రస్థాయిలో విరుచుకుపుడుతున్నారు. తనకు ఏ రాజకీయ పార్టీతోనూ అనుబంధం, సంబంధం లేదంటూనే అధికార తెలుగుదేశం పార్టీకి అండగా నిలుస్తున్నారు. ఆయన అవునన్నా కాదన్నా శివాజీ తెలుగుదేశం మనిషి అని ప్రజలంతా నమ్మతున్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిడిపిని మళ్లీ గెలిపించడానికి ఆయన పరోక్షంగా కృషి చేస్తున్నారన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.

ఈనేపథ్యంలోనే…ఆయన తాను టిటిడి ఛైర్మన్‌ కాగలనన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మొత్తంమ్మీద శివాజీ పెద్ద ప్లానే వేసినట్లున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*