టిటిడి ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌ క్రైస్తవుడా?

ప్రభుత్వం ఎట్టకేలకు టిటిడి ఛైర్మన్‌ను ప్రకటించింది. కడప జిల్లాకు చెందిన పుట్టా సుధాకర్‌ యాదవ్‌ను టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షునిగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే సుధాకర్‌ యాదవ్‌ నియామకంపై కొందరు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు. ఆయన హిందు మతానికి చెందిన వారు కాదని, క్రైస్తవ సభల్లో పాల్గొన్నారని ఏవోవే ఆరోపణలు చేస్తున్నారు. ప్రధానంగా ప్రకాశం జిల్లాకు చెందిన శివస్వామి ఈ ఆరోపణలు గుప్పించారు. వాస్తవంగా కొన్ని నెలల క్రితమే సుధాకర్‌ యాదవ్‌ పేరు చర్చకు వచ్చింది. ఆయన్ను ఛైర్మన్‌గా నియమిస్తారన్న వార్తలు వచ్చాయి. సుధాకర్‌ యాదవ్‌ ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు చెప్పారు. ఆయనకూ అభినందనలు వెల్లువెత్తాయి. నేరుగా కలిసి చెప్పినవారు కొందరైతే… సామాజిక మాధ్యమాలా ద్వారా చాలా మంది చెప్పారు. అప్పుడే యాదవ్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి. కడప జిల్లాలో ఎక్కడో క్రైస్తవ సంఘాలు నిర్వహించిన ఓ సభకు సుధాకర్‌ యాదవ్‌ వెళ్లిన ఫొటోలు అవి. ఈ ఫొటోలు ఆధారంగా ఆయన హిందువు కాదని, ఆయనకు ఛైర్మన్‌ పదవి ఎలా ఇస్తారని కొందరు విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో సుధాకర్‌ యాదవ్‌ నియామకంపై ప్రభుత్వమూ మౌనం దాల్చింది. ముఖ్యమంత్రి సంక్రాంతి సంబరాల కోసం నారావారిపల్లికి వచ్చిన సందర్భంలో విలేకరులు…సుధాకర్‌ యాదవ్‌ నియామకంపై ప్రశ్నించారు. యాదవ్‌ను నియమిస్తున్నట్లు నేను చెప్పానా? అని బాబు ఎదురు ప్రశ్నించారు. దాంతో ఇక సుధాకర్‌ యాదవ్‌ నియామకం లేనట్లేనని అంతా భావించారు. అప్పట్లో సిఎం అలా మాట్లాడటానికి కారణం లేకపోలేదు….అప్పటికి బిజెపితో పొత్తువుంది. పుట్టాపై వున్న విమర్శల నేపథ్యంలో ఆయనకు టిటిడి ఛైర్మన్‌ పదవి ఇస్తే బిజెపి నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం కనిపించింది. అందుకే ముఖ్యమంత్రి పునరాలోచన చేశారని చెబుతున్నారు. వాస్తవంగా టిటిడి ఛైర్మన్‌ తమకు అనుకూలంగా ఉండేవారు ఉండాలనేది బిజెపి ఆలోచన. టిటిడినే చేతిలోకి వచ్చేస్తే…తమ రహస్య అజెండాలను సులభంగా అమలు చేయవచ్చనేది ఆ పార్టీ ఆలోచన. అదలావుంటే…ఈ మూడు నెలలో బిజెపి, తెలుగుదేశం సంబంధాలు బలహీనపడుతూ వచ్చి, ఆఖరికి తెగిపోయాయి. ఈ నేపథ్యంలోనే మళ్లీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ పేరు ఖరారయింది. బిజెపితో సంబంధాలు ఉంటే… సుధాకర్‌ ఛైర్మన్‌ అయ్యే అవకాశామే ఉండేది కాదని పరిశీలకుల అభిప్రాయం. ఏమైనా ఎట్టకేలకు ప్రభుత్వం ఛైర్మన్‌ను ప్రకటించడం ఆహ్వానించదగ్గ పరిణామం.

అయితే….హింతూ మతసంస్థల ముసుగులో ఉన్న కొందరు మళ్లీ సుధాకర్‌ యాదవ్‌ను వివాదాస్పదం చేసేందుకు పూనుకున్నారు. ఈ విమర్శకులు చేస్తున్నది అర్థంలేని వాదన. రాజకీయ నాయకులు అన్ని మతాల కార్యక్రమాలకు హాజరవడం సాధారణం. ముస్లింల ఇఫ్తార్‌ విందుకు ముఖ్యమంత్రి సహా అందరూ హజరవుతుంటారు. సుధాకర్‌ యాదవ్‌పై వస్తున్న విమర్శలను ఆమోదిస్తే….ఇఫ్తార్‌ విందులకు వెళ్లిన ముఖ్యమంత్రులు ఎవరూ శ్రీవారికి పట్టువస్త్రాలు ఇవ్వడానికి కూడా అనర్హులే అవుతారు. ఇది అసంమంజసం. ఇక మత సంస్థలు నిర్వహించే స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు వంటి వాటిని ప్రారంభించడానికి రాజనీయ నాయకులు వెళ్లడంలో అసలు తప్పులేదు. సుధాకర్‌ యాదవ్‌ కూడా అటువంటి సభలకే వెళ్లారు. దీని ఆధారంగా ఛాందసవాదులు రాద్ధాంతానికి దిగారు. దీన్ని గమనించిన యాదవ సంఘాలూ తీవ్రంగానే స్పందిచాయి. ప్రతిఘటనకు దిగాయి. శివస్వామికి గట్టిగా బదులిచ్చాయి. ఆయన చరిత్రను తవ్వితీసి…’నీకు హిదూ మతం గురించి మాట్లాడే అర్హత ఉందా’ అని నిలదీశాయి. ఒక టివి ఛానల్‌లో జరిగిన చర్చావేదికలోనైతే…. టిడిపి ఎంపి సిఎం రమేష్‌ ప్రత్యక్షంగా పాల్గొని శివస్వామిపై నిప్పులు కురిపించారు.

అయినా…స్వామీజీల ముసుగులో ఉన్న కొందరు టిటిడిపై పెత్తనం చెలాయించడానికి ఒకప్పుడు తెలుగుదేశం ప్రభుత్వమే ఊతమిచ్చింది. బిజెపితో ఉన్న సంబంధాలను దృష్టిలో ఉంచుకుని ఏ స్వామీజీపైనా నోరెత్తి మాట్లాడకపోగా…వాళ్ల డిమాండ్లకు తలొగ్గుతూ వచ్చింది. ఆ ధైర్యంతోనే…ఇప్పుడు సుధాకర్‌ యాదవ్‌పైనా విమర్శలు గుప్పిస్తున్నారు. యాదవ సంఘాలు సకాలంలో స్పందించడంతో ఆ నోర్లు మూతపడే అవకాశాలున్నాయి. ఛైర్మన్‌గా నియమితులైన సుధాకర్‌ యాదవ్‌కు ధర్మచక్రం అభినందనలు తెలియజేస్తోంది.

1 Comment

  1. మతాలకు అతీతంగా అన్ని కార్యక్రమాలకు రాజకీయ నాయకులు హాజరుకావచ్చు. కానీ టిటిడికి కొన్ని నిబంధనలున్నాయ్.వాస్తవంగా థర్మకర్తల మండలిలో సభ్యులుగా ఉన్న వారు అన్యమత కార్యక్రమాలకు వెళ్లకూడదు. ఇక మీరన్నట్టు రాజకీయ నాయకులు వెళుతున్నారు కాబట్టి పుట్టా వెళ్లారనడం మీ తప్పిదం కాదు. ప్రభుత్వ తప్పిదం. ఎందుకంటే రాజకీయ నాయకులను ధర్మకర్తల మండలిలో నియమించడమే పెద్ద పొరపాటు. అది పుట్టా అయినా మరే నాయకుడైనా.

Leave a Reply

Your email address will not be published.


*