శ్రీ‌నివాసా…టిటిడి ఛైర్మన్‌ మాటల్లోని ఆంతర్యం ఏమిటి?

తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి ఎల్‌ 1, ఎల్‌ 2, ఎల్‌ 3 టికెట్ల రద్దు గురించి ప్రకటించడం కోసం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టిటిడి ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. గతంలో ఎల్‌ 1, 2, 3 దర్శనాల పేరుతో కొందరు వ్యక్తులు అక్రమాలకు పాల్పడ్డారు…ఈ టికెట్ల బ్లాక్‌ మార్కెటింగ్‌ ఎలా జరిగిందో దాన్ని త్వరలోనే బట్టయలు చేస్తాం…అని విస్పష్టంగా ప్రకటించారు. ఈ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటనేదానిపైనే అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని వెలికితీయాల్సిందిగా తన మంత్రివర్గ సహచరులకు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే. పోలవరంతో మొదలుపెట్టి పేదల ఇళ్ల నిర్మాణం దాకా అనేక పథకాల్లో, కార్యక్రమాల్లో అవినీతి జరిగినట్లు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టికెట్ల బ్లాక్‌మార్కెట్‌ గురించి టిటిడి ఛైర్మన్‌ వ్యాఖ్యలు చేశారని భావించాల్సివుంటుంది.

విఐపి బ్రేక్‌ దర్శనాల టికెట్లలో అక్రమాలు జరిగాయన్నది బహిరంగ రహస్యం. ఎల్‌-1 టికెట్టును రూ.20,000 దాకా బ్లాక్‌ మార్కెట్‌లో అమ్ముకున్నారన్నది ఎవరూ తోసిపుచ్చలేని వాస్తవం. ఈ టికెట్లతోనే కొందరు అధికారులు కోట్లకు పడగలెత్తారన్నది ఎవరికీ తెలియనిది కాదు. ఇందులో ప్రభుత్వ పెద్దలకూ వాటాలున్నాయన్నది గత కొన్ని సంవత్సరాలుగా సాగిన చర్చ. ఇవన్నీ తెలిసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి…టిటిడిలో జరిగిన అక్రమాలనూ బయటకు తీయమని ఛైర్మన్‌ను ఆదేశించినట్లు తెలుస్తోంది.

గడచిన కొన్నేళ్లలో జారీ చేసిన విఐపి బ్రేక్‌ దర్శనం టికెట్ల మంజూరుపై విచారణ జరిపించే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే….అవినీతికి ఆధారాలు లభిస్తాయా….అనేదే ప్రశ్న. తాము బ్లాక్‌లో టికెట్లు కొన్నామని ఎవరు అంగీకరిస్తారు? టికెట్ల కోసం తాము ఇంత ఇచ్చామని ఎవరు చెబుతారు? అయినా…ఎలాంటి విచారణ జరిస్తారు, ఎవరితో జరిపిస్తారు…ఏం జరగబోతోంది…అనేది తెలవాలంటే కొంతకాలం ఆగాల్సిందే…!

                                                                                      – ఆదిమూలం శేఖర్‌, ఎడిటర్‌, ధర్మచక్రం 

 

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*