టిటిడి ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డికే శఠగోపం పెడుతున్నారు..!

ఈ క్షణం నుండే టిటిడిలో ప్రక్షాళణ మొదలయింది. అందుకోసమే ముఖ్యమంత్రి గారు ఇక్కడికి (టిటిడికి) నన్ను పంపించారు….ఇవి ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి తరువాత శ్రీవారి ఆలయం నుంచి బయటకు వచ్చిన క్షణాన వైవి సుబ్బారెడ్డి చెప్పిన మాటలు.

గతంలో బ్రేక్‌ దర్శనాల టికెట్లలో భారీ అక్రమాలు జరిగాయి. ఈ టికెట్లను ఐదారు వేలకు అమ్ముకున్నారు. ఇటువంటి వాటికి అడ్డుకట్ట వేస్తాం….ఇవి కూడా వైవి సుబ్బారెడ్డి చెప్పిన మాటలే.

ఛైర్మన్‌ మాటలు చెప్పడం కాదు…తదనుగుణంగా చర్యలు కూడా చేపట్టారు. బ్రేక్‌ దర్శనాల్లో సంచలనాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఎల్‌ 1, ఎల్‌ 2, ఎల్‌ 3 తేడాలు రద్దు చేశారు. రెండు రెండు కేటగిరీలు పెట్టారు….ఒకటి ప్రోటోకాల్‌. ఇంకొకటి నాన్‌ ప్రోటోకాల్‌.

ఈ మార్పులు సత్ఫలితాలను ఇచ్చాయి. విఐపి దర్శనాల సమయం గంటకుపైగా తగ్గింది. ఆ మేరకు సామాన్య భక్తులకు దర్శన సమయం పెరిగింది. సుబ్బారెడ్డికి సర్వత్రా ప్రశంసలూ లభించాయి.

ఇప్పుడు ఇదంతా ఎందుకంటే….టిటిడిలో సమూల మార్పులు తీసుకురావాలన్న ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి ఆశయానికి…ఆయన సొంత ఆఫీసు ఉద్యోగులే తూట్లు పొడుస్తున్నారు. ఏ టికెట్లలోనైతే అక్రమాలను అరికట్టాలని ఛైర్మన్‌ అనుకున్నారో….అవే టికెట్లను అక్రమార్జనకు వాడుకుంటున్నారు ఆ ఉద్యోగులు.

ఛైర్మన్‌ కార్యాలయంలో పని చేస్తున్న ఇద్దరు ఉద్యోగులు…ఛైర్మన్‌ కోటాలో బ్రేక్‌ దర్శనం టికెట్లు మంజూరు చేయించుకుని అక్రమాలకు పాల్పడినట్లు వార్తలొచ్చాయి. ఇద్దరు ఉద్యోగులు వందల సంఖ్యలో టికెట్లు మంజూరు చేయించుకుని అమ్ముకున్నారని చెబుతున్నారు.

తన కార్యాలయంలో జరుగుతున్న అక్రమాన్ని…ఛైర్మన్‌ స్వయంగా గుర్తించినట్లు తెలుస్తోంది. దీనిపైన విచారణ జరిపించమని విజిలెన్స్‌ అధికారి ఒకరిని ఆదేశించినట్లు సమాచారం. ఈ విచారణ కూడా అత్యంత గోప్యంగా చేసినట్లు చెబుతున్నారు.

బాధ్యులైన ఆ ఉద్యోగులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది వేరే విషయంగానీ…అవినీతిని ప్రక్షాళన చేయాలనుకుంటున్న సుబ్బారెడ్డి కార్యాలయంలో అలాంటి ఉద్యోగులు ఎలా తిష్టవేయగలిగారన్నది ప్రశ్న. ఇందులో ఓ ఉద్యోగి గతంలోనూ ఓ ఛైర్మన్‌ కార్యాలయంలో పని చేశారు. అప్పట్లోనూ ఆయనపై ఇదే తరహా ఆరోపణలున్నాయి.

కమ్మరాజ్యంలో కడప రెడ్లు…పేరుతో సంచలన దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ఓ సినిమా తీస్తున్నారు. దీనికి సంబంధించి మొదటి పాటను కూడా విడుదల చేశారు. టిటిడిలో ఇందుకు రివర్స్‌ అని చెప్పాలి. వైవి సుబ్బా’రెడ్డి’ గారి కార్యాలయంలో …….గారు రాజ్యం చేస్తున్నారు.

ఛైర్మన్‌ లక్ష్యం నెరవేరాలంటే…అక్రమార్కులకు కార్యాలయంలో స్థానం ఉండకూడదు. అలాంటివారిని మొగ్గలోనే తుంచేయాల్సిన అవసరం ఉంది. మరి ఛైర్మన్‌….ఈ కథకు ఎలా శుభంకార్డు వేస్తారో చూడాలి.

ఆదిమూలం శేఖ‌ర్‌, సంపాద‌కులు, ధ‌ర్మ‌చ‌క్రం వార‌ప‌త్రిక‌

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*