టిటిడి ఛైర్మన్ గారూ, తిరుపతి ప్రజల గోడూ కాస్త వినండి..!

టిటిడిలో ఇప్పటిదాకా 140 మందికి మాత్రమే కరోనా సోకిందని, అందులో 70 మంది ఇప్పటికే కోలుకున్నారని, దర్శనాలు ఇప్పుడున్న పద్ధతిలోనే కొనసాగిస్తామని టిటిడి చైర్మన్ సుబ్బారెడ్డి చెప్పారు. భక్తుల వల్ల ఉద్యోగులకుగానీ, ఉద్యోగుల వల్ల భక్తులకుగానీ కరోనా సోకలేదని చెప్పుకొచ్చారు.

వైవి సుబ్బారెడ్డి తిరుమల వరకే పరిమితమై మాట్లాడారు. తిరుపతి నగరం గురించి ఆలోచించినట్లు లేదు. తిరుపతిలో ఇప్పటికే 1000 కేసులకు పైగా నమోదయ్యాయి. అన్ లాక్ ప్రకటించే నాటికి నగరంలో 40 కేసులు కూడా లేవు.‌ ఈ‌ 30 రోజుల కాలంలో 1000 ఈ కేసులు‌ దాటాయి. ఇదే స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది.

శ్రీవారి దర్శనం కోసం వేలాది మంది, వివిధ రాష్ట్రాల నుంచి‌ రావడం వల్లే కరోనా వ్యాప్తి పెరుగుతోందన్న భావన సర్వత్రా ఉంది. అందుకే దర్శనాలు కొంతకాలం ఆపు చేయాలని తిరుపతి వాసులు బలంగా కోరుకుంటున్నారు. నగరంలో లాక్ డౌన్ ప్రకటించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే తిరుమల శ్రీవారి దర్శనాలను దృష్టిలో ఉంచుకుని కార్పొరేషన్ అధికారులు అటువంటి నిర్ణయం తీసుకోలేక పోతున్నారు. మరోవైపు‌ టిటిడి ఉద్యోగులూ విధులు నిర్వర్తించడానికి భయపడుతున్నారు.

ఇవన్నీ వదిలేసి టిటిడి ఉద్యోగుల్లో 140 మందికి మాత్రమే వైరస్ సోకిందని, ఎవరికీ‌ ఏమీ కాలేదని చెబుతూ, దర్శనాలను కొనసాగిస్తామని ఛైర్మన్ చెప్పడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే తిరుమలేనా, తిరుపతి గురించి పట్టించుకోరా అని ప్రశ్నిస్తున్నారు. స్థానికులు ఏమైపోయినా టిటిడికి ఫర్వాలేదా అని నిలదీస్తున్నారు. కొంతకాలం‌ దర్శనాలు ఆపేస్తే జరిగే నష్టమేముందని అంటున్నారు.

ఈ తరుణంలో ముఖ్యమంత్రి ‌జగన్ మోహన్ రెడ్డి జోక్యం చేసుకుని, స్థానికుల మనోభావాలను గుర్తించి, సరైన నిర్ణయం తీసుకోవాలని‌ తిరుపతి వాసులు కోరుతున్నారు. – ధర్మచక్రం, తిరుపతి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*