టిటిడి ట్రెజరీలో ఏం జరుగుతోంది…! ఒకరి గుప్పెట్లోనే ఎందుకు!!

-ఆదిమూలం శేఖర్‌, సంపాదకులు, ధర్మచక్రం

టిటిడి ట్రెజరీ నుంచి వెండి కిరీటం, బంగారు గొలుసులు, ఇంకొన్ని వస్తువులు మాయమైన ఉదంతం ఇటీవల పెద్ద సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో ట్రెజరీలో అన్నీ వెరిఫికేషన్‌ చేయిస్తామని ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ ప్రకటించారు. ఈ మేరకు వెరిఫికేషన్‌ వారం రోజుల క్రితం మొదలయింది. వెరిఫికేషన్‌లో ఏం బయటపడుతుందనే సంగతి పక్కనపెడితే…ట్రెజరీ గురించి తెలుసుకునే కొద్దీ విస్మయం గొలిపే విషయాలు బయటకు వస్తున్నాయి.

శ్రీవారి హుండీ ద్వారా లభించే కోట్ల రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, వస్తువులను ట్రెజరీలో భద్రపరుస్తుంటారు. ఇటువంటివి వందల వేల ఐటమ్స్‌ ఉంటాయి. నెలకు ఒకటి రెండు సార్లు పరకామణి నుంచి వందల ఐటమ్స్‌ వస్తూనే వస్తుంటాయి. అదేవిధంగా ట్రెజరీలో నిల్వలు ఎక్కువవుతున్న సమయంలో వాటిని కరిగించడం కోసం మింట్‌కు తరలిస్తారు. అప్పుడు కూడా ప్రతి ఒక్కటీ లెక్కించుకుని పంపాల్సి వుంటుంది. బంగారు విషయానికొస్తే…వజ్రాలు పొదిగిన ఆభరణాలు, ముత్యాలు పొదిగిన ఆభరణాలు, పగడాలు పొదిగిన ఆభరణాలు, బంగారు వస్తువులు….అనేక కేటగిరీలుగా విభజించాలి. అదేవిధంగా వెండిని మొత్తం 15 కేటగిరీలుగా విభజిస్తారు. చిక్కులు, మెట్టెలు, కాలు గొలుసులు, రాళ్లు పొదిగిన ఆభరణాలు, వెండి వస్తువులు పాతవి, వెండి వస్తువులు కొత్తవి, అదర్‌ కాయిన్స్‌….ఇలా కేటగిరీలుగా విభజించాలి. ప్రతిదానికీ విలువ కట్టాలి. ప్రతిదాని వివరమూ (డిస్క్రిప్షన్‌) రిజిస్టర్‌లో నమోదు చేయాలి.

ఇదంతా గోల్డ్‌ అప్రైజర్‌ (బంగారానికి విలువ కట్టే నిపుణులు) ఆధ్వర్యంలో జరగాలి. వందల, వేల వస్తువులను పరీక్షించి, వర్గీకరించి, లెక్కగట్టడానికి పదుల సంఖ్యలో అప్రైజర్లు ఉండాలి. కానీ….టిటిడి ట్రెజరీకి ఒక్కరంటే ఒక్కరే అప్రైజర్‌ ఉన్నారు. మునిశేఖర్‌ ఆచ్చారి అనే అప్రైజరే ఏకైక దిక్కుగా మారారు. గడచిన పదేళ్లుగా ట్రెజరీ వ్యవహారాలన్నీ ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. నాగరాజ ఆచ్చారి అనే మరో అప్రైజర్‌ ఉన్నప్పటికీ…ఆయన్ను దీర్ఘకాలం తిరుమల పరకామణికి పరిమితం చేశారు. ఆ తరువాత జువలరీ విభాగానికి బదిలీ చేశారు. మరో అప్రైజర్‌ ఉన్నా…ఆయన ఎప్పుడో ఏదో తప్పు చేశారని ఆ పనిలో నుంచి తొలగించి అన్నదానంలో వేశారు.

సాధారణంగా కీలకమైన స్థానాల్లో ఒకే వ్యక్తిని దీర్ఘకాలం ఉంచరు. కానీ ట్రెజరీలో మాత్రం మునిశేఖర్‌ ఆచ్చారిని పదేళ్లుగా కొనసాగిస్తున్నారు. టిటిడిలో మరో ఇద్దరు అప్రైజర్లు ఉన్నారు. అందులో నాగరాజ ఆచ్చారిని దీర్ఘకాలం తిరుమల పరకామణికే పరిమితం చేశారు. ఆ తరువాత జ్యువలరీ సెక్షన్‌కి బదిలీ చేశారు. మరో అప్రైజర్‌ ఏదో తప్పు చేశారన్న కారణంగా ఆయన్ను పూర్తిగా ఈ విధుల నుంచి తప్పించి….అన్నదానంలో పని చేయించుకుంటున్నారు.

ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే….ట్రెజరీకి అప్రైజర్‌గా ఉన్న వ్యక్తే…ఇన్వెంటరీకి కూడా అప్రైజర్‌గా ఉన్నారు. సాధారణంగా ఇన్వెంటరీ సెక్షన్‌ ఏడాదికి ఒకసారి ప్రతి విభాగాన్ని తనిఖీ చేస్తుంది. రికార్డుల ప్రకారం ఉండాల్సిన సంస్థ ఆస్తువులు, వస్తువులన్నీ ఉన్నాయో లేదో తనిఖీ చేస్తుంది. ఈ మేరకు ట్రెజరీ రికార్డుల ప్రకారం…అన్నీ ఉన్నాయోలేదో చూసే బాధ్యత కూడా ఇన్వెంటరీ విభాగానిది. ఇక్కడ ఇన్వెంటరీ పని కూడా మునిశేఖర్‌ ఆచ్చారితోనే చేయిస్తున్నారు. ట్రెజరీలో రికార్డులు రాసేది ఆయనే..ఇన్వెంటరీ తరపున తనిఖీ చేసేదీ ఆయనే…ఇలాగైతే అక్కడ జరిగే లోపాలు ఎలా బయటికొస్తాయన్నది ప్రశ్న.

టిటిడిలో చాలినంత మంది అప్రైజర్లు లేరన్న కారణంగా…వివిధ విభాగాల్లో పని చేస్తున నలుగురిని ముంబయికి పంపించి జమాలజిస్టు కోర్సు చేయించారు. కోర్సు పూర్తి చేసిన అనంతరం…చంద్రబాబు అనే ఉద్యోగికి పరకామణిలో డ్యూటీ వేశారు. అక్కడ వచ్చే దుమ్ముధూళి వల్ల అనారోగ్యంపాలవడంతో ఆయన తన మాతృ విభాగానికి వెళ్లిపోయారు. కల్యాణి, జయసతీష్‌ రెడ్డి అనే ఇద్దరు శిక్షణ తరువాత తాము ఈ పని చేయలేమని చెప్పడంతో వారినీ వెనక్కి పంపేశారు. శివరంజని అనే ఉద్యోగి మాత్రం ట్రెజరీలో ఉన్నప్పటికీ…ఆమెను పూర్తిస్థాయి అప్రైజర్‌గా వినియోగించుకోవడం లేదు.

టిటిడికి చాలా మంది అప్రైజర్ల అవసరం ఉంది. కొత్త అప్రైజర్లను నియమించుకునే సంగతి అటుంచితే…అందుబాటులో ఉన్న ముగ్గురు నలుగురినైనా స్థానంభ్రంశం చేసి ఎందుకు వినియోగించుకోరు అనేది ప్రశ్న. ఒక మునిశేఖర్‌ ఆచ్చారినే ట్రెజరీలో పదేళ్లుగా ఉంచడం వెనక ఉన్నతాధికారుల ఆంతర్యం ఏమిటని ఉద్యోగులే ప్రశ్నిస్తున్నారు. ఈ విభాగానికి పూర్తిబాధ్యులు ఎఫ్‌ఏ అండ్‌ సిఏవో బాలాజీ. దీనికి సమాధానం చెప్పాల్సింది బాధ్యత కూడా ఆయనపైనే ఉంటుంది.

ఇక ట్రెజరీ నిర్వహణ విషయానికొస్తే అంత శాస్త్రీయంగా జరుగుతున్నట్లు అనిపించదు. దేశంలో పెద్దపెద్ద నగల దుకాణాలున్నాయి. ఆ దుకాణాల్లో వందలు, వేల ఐటమ్స్‌ ఉంటాయి. రోజూ వాటిని కస్టమర్లకు చూపించే క్రమంలో వాటిని అటూఇటూ మార్చుతుంటారు. అయితే….రాత్రి దుకాణం మూసే సమయానికి ప్రతి చిన్నవస్తువులూ లేక్క తేల్చుకుంటారు. ప్రతి వస్తువుకూ ట్యాగింగ్‌, బార్‌కోడింగ్‌ వ్యవస్థ ఉంటుంది. ఏదైనా వస్తువు కంప్యూటర్‌తో స్కాన్‌ అవకుండా (బిల్‌ కాకుండా) బయటకు వెళితే…అల్లారం మోగుతుంది. పెద్దపెద్ద సూపర్‌ మార్కెట్లలోనూ ఇదే పద్ధతి ఉంది. అటువంటి వ్యవస్థనే ట్రెజరీకి తీసుకొస్తే…ఇక్కడున్న వస్తువులు ఒకటి కూడా మిస్‌ అయ్యే అవకాశం ఉండదు. మరెందుకో అటువంటి ట్యాగింగ్‌, బార్‌కోడింగ్‌ విధానాన్ని ట్రెజరీలో ఇంకా ప్రవేశపెట్టలేదు. ఆ కారణంగానే..ఇప్పుడు ట్రెజరీ ఏఈవో మారినపుడల్లా బాధ్యతలు అప్పగించడానికి ఒకటిన్నర నెల నుంచి రెండు నెలల సమయం పడుతోంది. అధికారులు మారినపుడు తనిఖీ చేసుకోవడం మినహా…రోజువారీ ఏమివున్నాయి, ఏమిలేవు అని లెక్కలు తనిఖీ చేసుకునే పక్కా వ్యవస్థ ఇక్కడ లేదు. అందువల్లే తరచూ వివాదాస్పదం అవుతోంది.

ఇప్పటికైనా ట్రెజరీపైన టిటిడి ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ విభాగానికి అవసరమైన అప్రైజర్లను నియమించడంతో పాటు….శాస్త్రీయ పద్ధతులను ప్రవేశపెట్టడం, పారదర్శకత తీసురావడం వంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం కనిపిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*