టిటిడి తప్పుదిద్దుకుంటుందా…పంతానికి పోతుందా..!

ఆలయాల్లో వంశపారంపర్యంగా వస్తున్న అర్చకత్వాన్ని రద్దు చేయడానికి వీల్లేదంటూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి తనతో సహా తొలగింపునకు గురైన అర్చకులందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని… శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు టిటిడి ఈవోను కలిసి విన్నవించారు. దీనిపైన ఇప్పటిదాకా టిటిడి ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు. హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాలు చేస్తామని ఈవో చెప్పినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. అదేవిధంగా ఈ అంశాన్ని న్యాయశాఖ పరిశీలనకు పంపినట్లు మరో వార్త వచ్చింది. ఇంతకీ హైకోర్టు తీర్పును అమలు చేస్తుందా లేక పంతానికిపోయి సుప్రీందాకా వెళుతుందా అనేది తేలాల్సివుంది.

తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ఆలయాల్లో పనిచేసే 65 ఏళ్లు దాటిన అర్చకులను తొలగిస్తూ కొన్ని నెలల క్రితం నిర్ణయం తీసుకున్నారు. అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం వల్లే టిటిడి ఇప్పుడు ఇరకాటంలో పడింది. టిటిడికి వ్యతిరేకంగా మాట్లాడారన్న కోపంతో…శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులైన రమణ దీక్షితులను వయో పరిమితి పేరుతో ఆ పదవి నుంచి రాత్రికి రాత్రి తొలగించారు. ఆయన్ను తొలగించారు కాబట్టి…మరి కొంతమంది అర్చకులకు కూడా రిటైర్‌మెంట్‌ ప్రకటించారు. ఇది అన్యాయమంటూ ఇద్దరు అర్చకులు హైకోర్టులో పిటిషన్‌ వేయగా…రమణ దీక్షితులు సుప్రీంలో కేసు వేశారు. మరోవైపు ఇదే అంశంపై రమణ దీక్షితులు సుప్రీంలో కేసు దాఖలు చేశారు.

తెలుగుదేశం పార్టీకి, బిజెపికి మధ్య రాజకీయ విభేదాలు తలెత్తి, తెగదెంపులు చేసుకున్న నేపథ్యంలో…అమిత్‌ షా శ్రీవారి ఆలయానికి వచ్చినపుడు రమణ దీక్షితులు….ఆయనకు దగ్గరుండి దర్శనం చేయించారు. ఆలయంలో కైంకర్యాలు సరిగా జరగడం లేదని, పోటు తవ్వేశారని, ఆభరణాలు మాయమయ్యాయని ఫిర్యాదు చేశారు. ఈ విషయాలన్నీ ప్రభుత్వానికి చేరాయి. ఈ ఉదంతానికి కొన్ని రోజుల ముందు….శ్రీవారి ఆలయాన్ని పరిశీలించాలని పురావస్తు శాఖ తీసుకున్న నిర్ణయమూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. ఇంతలోనే అమిత్‌షా వ్యవహారం వచ్చింది. అంతే రెండు రోజుల్లో రమణ దీక్షితులను ప్రధాన అర్చక పదవి నుంచి తొలగించారు. ఇదేమంటే…65 ఏళ్లు దాటిన అర్చకులను రిటైర్‌ చేయాలని ఎప్పుడో నిర్ణయం తీసుకున్నామని, ఆ నిర్ణయాన్నే అమలు చేశామని సమర్థించుకున్నారు.

శ్రీవారి ఆలయంలో దశాబ్దాలపాటు ప్రధాన అర్చకునిగా వున్న రమణ దీక్షితులను తొలగించే ముందు….ఇది చట్ట విరుద్ధమా, చట్టబద్ధమా అనేది కూడా సంబంధిత అధికారులు ఆలోచించలేదు. టిటిడి తీసుకున్న నిర్ణయం న్యాయస్థానం ముందు నిలబడబోదని మొదటి నుంచి ధర్మచక్రం చెబుతూ వస్తోంది. అందుకు తగినట్లుగానే హైకోర్టు తీర్పును వెలువరించింది. చట్టంపై ఉన్న నమ్మకంతోనే తాను మళ్లీ ప్రధాన అర్చక పదవిలోకి వస్తానని రమణ దీక్షితులు గట్టినమ్మకంతో ఉన్నారు. సుప్రీం కోర్టులో ఉన్న దీక్షితులు కేసులోనూ టిటిడికి ఎదురుదెబ్బలు తప్పకపోవచ్చునని ఈ వ్యవహారాల గురించి తెలిసినవారు చెబుతున్నారు. హైకోర్టు తీర్పుపైన సుప్రీంలో సవాలు చేసి, అక్కడ కూడా టిటిడి వ్యతిరేకంగా తీర్పు వస్తే…అది మరింత అప్రతిష్టకరం. ఎందుకంటే ఇది స్వయంకృతంగా కొనితెచ్చుకున్న వివాదం.

అయినా…ఇది ఒక్క టిటిడికి సంబంధించిన వ్యవహారం కాదు. అన్ని ఆలయాలకు సంబంధించి విషయం. రిటైర్‌మెంట్‌ విధానాన్ని దేశ వ్యాపితంగా అర్చుకులు వ్యతిరేకిస్తున్నారు. కోర్టు కూడా విశాల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకునే తీర్పునిస్తుంది. ఆ తీర్పు టిటిడికి ఒక విధంగా, చిన్న ఆలయాలకు ఇంకో విధంగా ఉండే అవకాశం లేదు. అందుకే టిటిడికి అప్పీలుకు పోకుండా తీర్పును అమలు చేయడమే ఉత్తమమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ….టిటిడి పంతానికి వెళ్లి హైకోర్టు తీర్పును సవాలు చేస్తే….దానివల్ల ప్రభుత్వానికీ రాజకీయంగా నష్టమే. రమణ దీక్షితులు వ్యవహారంతో….రాష్ట్రంలోని అర్చకవర్గమంతా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మారారు. వాస్తవంగా గత ఎన్నికల్లో బ్రాహ్మణ సామాజికవర్గం తెలుగుదేశంతో ఉంది. రమణ దీక్షితులు వ్యవహారాన్ని సక్రమంగా డీల్‌ చేయకపోవడం వల్ల లక్షలాది ఓట్లు కోల్పోవాల్సిన పరిస్థితి దాపురించింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని టిటిడిలో అర్చకుల వివాదానికి తెర వేయాల్సిన అవసరం ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*