టిటిడి నిర్ణయంతో తిరుమల వ్యాపారుల టెన్షన్‌!

తిరుమల శ్రీవారి ఆలయంలో మహాసంప్రోక్షణ పూజలను పురస్కరించుకుని దాదాపు వారం రోజుల పాటు దర్శనాలు నిలిపివేయాలని టిటిడి తీసుకున్న నిర్ణయంపై స్థానిక వాపారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తిరుమలకు రోజూ 70 వేల నుంచి లక్ష మంది భక్తులు వస్తుంటారు. భక్తుల కోసం హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, పూజా సామగ్రి దుకాణాలు, శ్రీవారి చిత్రపటాలు తదితర జ్ఞాపికలు విక్రయించే షాపులు, వీధుల్లో తిరుగుతూ చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే హాకర్లు వేలాది మంది శ్రీవారి భక్తులపై ఆధారపడి జీవిస్తున్నారు. అటువంటిది భక్తులే రాకుంటే….తమ జీవనం ఏమవుతుందన్న టెన్షన్‌ తిరుమల వ్యాపారుల్లో మొదలయింది.

ఆగస్టు 11 నుంచి 16వ తేదీ దాకా దర్శనాలు పూర్తిగా నిలిపివేస్తున్నామని, భక్తులెవరూ తిరుమలకు రావొద్దని టిటిడి ప్రకటించిన విషయం తెలిసిందే. వాస్తవంగా ఈ ఆరు రోజులు అలిపిరిలోనే భక్తులను ఆపేస్తారని ప్రకటించారు. అలా ఎందుకు చేస్తారని, తిరుమలకు వచ్చే భక్తులు బయట అఖండం వద్దనైనా మొక్కులు తీర్చుకుని వెళ్లే అవకాశం ఉంటుంది కదా….అని విలేకరులు ప్రశ్నించడంతో అధికారులు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. దర్శనం కల్పించలేముకానీ…తిరుమలకు రావాలనుకునే భక్తులను అడ్డుకోబోమని ఆ తరువాత చెప్పారు.

అయినా…దర్శనాలు లేనిదే భక్తులెవరూ తిరుమలకు వచ్చే అవకాశం ఉండదు. ఎంతగా వచ్చిన రోజుకు 10 వేల మందికి మించి రాకపోవచ్చు. దీనివల్ల వారం రోజులు తమ వ్యాపారాలు పూర్తిగా దెబ్బతింటాయని వ్యాపారులు చెబుతున్నారు. కొన్ని హోటళ్లయితే నెలకు లక్షల రూపాయలు టిటిడికి అద్దె చెల్లించాల్సివుంటుంది. వారం రోజులు భక్తులు లేకుంటే ఆ నెలలో భారీగా నష్టపోవాల్సివస్తుందని పెద్ద హోటళ్ల నిర్వాహకులు చెబుతున్నారు.

ఇక తిరుమల-తిరుపతి మధ్య వందల టాక్సీలు నడుస్తున్నాయి. చాలామంది నిరుద్యోగులకు ఈ టాక్సీలే జీవనాధారం. భక్తులు రాకుంటే…టాక్సీలకు కిరాకీ ఏమీవుండదు. దర్శనాలు ఉండబోవని టిటిడి ప్రకటించిన వెంటనే టాక్సీ నిర్వాహకుల్లో ఆందోళన మొదలయింది. రోజూ తిరుమలను సందర్శించే 70 వేల మంది భక్తుల్లో దాదాపు 40 వేల మందిని ఆర్‌టిసి బస్సులే అటూ ఇటూ చేరవేస్తుంటాయి. వారం రోజులు భక్తులు రాక ఆగిపోతే ఆర్‌టిసి కూడా భారీగా ఆదాయం కోల్పోతుంది.

ఇలా అనేక అంశాలు ముడిపడిన ఉన్న నిర్ణయాన్ని టిటిడి చాలా సులువుగా తీసుకుంది. తాము తీసుకున్న నిర్ణయం వల్ల ఎవరెవరు ప్రభావితం అవుతారనేదానిపై ఎక్కడా చర్చ జరిగినట్లు లేదు. అధికారులు, పాలక మండలి తమ నిర్ణయాన్ని పున: సమీక్షించాలని, భక్తుల రాకను అడ్డుకోవొద్దని వ్యాపారులు, టాక్సీవాలాలు, ఆర్‌టిసి అధికారులు కోరుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*