టిటిడి నిర్ణయంపై సోషల్‌ మీడియా ఫైర్‌!

మహాసంప్రోక్షణ జరిగే ఆరు రోజుల పాటు శ్రీవారి దర్శనం నిలిపి వేయాలని టిటిడి తీసుకున్న నిర్ణయంపై సోషల్‌ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వేల సంవత్సరాల కాలంలో ఎన్నడూ తీసుకోని నిర్ణయాన్ని తీసుకున్న టిటిడి అధికారులపై, బోర్డుపైన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈ నిర్ణయం వెనుక దురుద్ధేశాలున్నాయంటూ అనుమానాలూ వ్యక్తం చేస్తున్నారు. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లను చూస్తే టిటిడి పెద్దలకూ ఈ విషయం బోధపడుతుంది.

మహాసంప్రోక్షణ పూజలు జరిగే కాలంలోనూ…రోజుకు కనీసంగా 30 వేల మందికి దర్శనం కల్పించే అవకాశం ఉందని టిటిడి అధికారులే ముందుగా ప్రకటించారు. అలాంటిది ఎవరినీ అనుమతించబోమని ఎందుకు చెబుతున్నారని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత నిర్ణయానికీ, గతంలో వచ్చిన ఆరోపణలకూ లింకు పెడుతున్నారు. గతంలో పోటులో తవ్వకాలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయని, వాటిని కప్పిపుచ్చుకునేందుకు అవసరమైన పనులు చేపట్టడానికే భక్తులను అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్నారని ఎక్కువ మంది ఆరోపిస్తున్నారు. గతంలో మహాసంప్రోక్షణ కార్యక్రమాలు జరిగినపుడు ఇదేవిధంగా దర్శనాలు ఆపేశారా…ఎప్పుడూ చేయని పని ఇప్పుడెందుకు చేస్తున్నారు…భక్తులను ఆరో రోజుల పాటు లోనికి రానివ్వకుండా చేయాలనుకోవడంలో ఉద్దేశాలు ఏమిటి….గతంలో వచ్చిన ఆరోపణలకు ఈ నిర్ణయాలు బలం చేకూర్చేలా ఉన్నాయి…ఇటువంటి కామెంట్లు సోషల్‌ మీడియా నిండా కనిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో మఠాధిపతులు, పీఠాధిపతులు జోక్యం చేసుకోవాలన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.

ఇదిలావుండగా సిసి కెమెరాలనూ బంద్‌ చేయబోతున్నారని పాలక మండలిలో చర్చ జరిగినట్లు వార్తలు బయటకు వచ్చాయి. బాలాలయంలో మిగతా చోట సిసి కెమెరాలు ఆపాల్సిన అవసరం ఏముంటుందని నిలదీస్తున్నారు. అయినా….ఇంతకీ సిసి కెమెరాలు ఆపేయాలని న్ణియించారా లేదా అనేదానిపై టిటిడి అధికారులు వివరణ ఇవ్వాల్సివుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*